YSRTP Symbol : వైఎస్ఆర్టీపీకి' బైనాక్యులర్‌' గుర్తు కేటాయింపు - ఈసీ ఆదేశాలు-ysrtp gets binocular symbol for telangana assembly polls 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ysrtp Symbol : వైఎస్ఆర్టీపీకి' బైనాక్యులర్‌' గుర్తు కేటాయింపు - ఈసీ ఆదేశాలు

YSRTP Symbol : వైఎస్ఆర్టీపీకి' బైనాక్యులర్‌' గుర్తు కేటాయింపు - ఈసీ ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 26, 2023 09:19 PM IST

Telangana Elections 2023: వైఎస్ఆర్టీపీ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. బైనాక్యులర్‌ గుర్తును కేటాయిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

వైఎస్ఆర్టీపీకి' బైనాక్యులర్‌' గుర్తు కేటాయింపు
వైఎస్ఆర్టీపీకి' బైనాక్యులర్‌' గుర్తు కేటాయింపు

Telangana Elections 2023: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో ఉంటామని ప్రకటించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్‌ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి గుర్తును కేటాయించటంతో… అన్ని నియోజకవర్గాల్లో ఇదే గుర్తుపై పోటీ చేయనుంది వైఎస్ఆర్టీపీ. ఇక అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరిస్తోంది పార్టీ నాయకత్వం. ప్రభావం చూపే నేతలను ఎన్నికల బరిలో ఉంచాలని షర్మిల భావిస్తున్నారని తెలుస్తోంది.

షర్మిల పోటీ ఎక్కడ..?

మొన్నటి వరకు కాంగ్రెస్ లో విలీనం వైపు అడుగులు వేసిన వైఎస్ షర్మిల…. మళ్లీ మొదటికి రావటం ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు… కాంగ్రెస్ తో 4 నెలల పాటు చర్చలు జరిపామని… కానీ అటువైపు నుంచి స్పందన లేదంటూ చెప్పుకొచ్చారు. తమ పార్టీ 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుందని… గట్టి పోటీనిస్తుందంటూ కొద్దిరోజుల కిందటే కీలక ప్రకటన చేశారు. పాలేరులో పోటీ చేస్తానని… రెండో చోట కూడా బరిలో ఉండటంపై ఆలోచన చేస్తానని అన్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే షర్మిల అడుగులు వేస్తున్నారనే చర్చ నడుస్తోంది. మొదట పాలేరుతో పాటు మిర్యాలగూడ పేరు ప్రధానంగా వినిపించింది. కానీ షర్మిల ఆలోచన మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాలేరుతో పాటు కొడంగల్ బరిలో ఉండాలని భావిస్తున్నారట..!

పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల చెప్పినప్పటికీ… అక్కడ్నుంచి కుదరకపోతే కొత్తగూడెం నుంచి కూడా పోటీ చేసే విషయంలో ఆలోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓ మాజీ ఎంపీ రంగంలోకి దిగి షర్మిలతో చర్చలు జరిపినట్లు వార్తలు బయటికి వస్తున్నాయి. కట్ చేస్తే… రెండుచోట్ల పోటీపై సుముఖంగా ఉన్న షర్మిల…. కొడంగల్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారట షర్మిల. చివరి వరకు రేవంత్ అడ్డుపడటంతోనే…. యూటర్న్ తీసుకునే పరిస్థితి వచ్చిందని, ఈ క్రమంలోనే ఆయన పోటీ చేసే స్థానం నుంచి బరిలో ఉండాలని ఆలోచిస్తున్నారట. ఫలితంగా అక్కడ ఓట్లను కూడా ప్రభావితం చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.! అయితే తాను పోటీ చేయబోయే రెండో స్థానంపై ఒకటి రెండు రోజుల్లో షర్మిల అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోందని సమాచారం. ఒకవేళ నిజంగానే షర్మిల… కొడంగల్ బరిలో ఉంటే రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై చివర్లో ఏం జరగబోతుందనేది చూడాలి…!

IPL_Entry_Point

సంబంధిత కథనం