YS Sharmila On KCR: కేసీఆర్... మీ పార్టీ వ్యక్తికి రూ.18లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తావా..?
YS Sharmila latest News:ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల మరోసారి మండిపడ్డారు. పార్టీకి చెందిన ఓ వ్యక్తి 18 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తావా అంటూ ప్రశ్నించారు.
YS Sharmila Fires on CM KCR: మహారాష్ట్రకు చెందిన యువకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ కార్యదర్శిగా నియమించుకున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. దీనిపై అధికార బీఆర్ఎస్ టార్గెట్ గా పలు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే అంశంపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ సొమ్ము మీ తాత జాగీరా కేసీఆర్? అని ప్రశ్నించారు. తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యోగాలు ఇవ్వడం చేతకాలేదు కానీ, పక్క రాష్ట్రంలోని మీ పార్టీ వ్యక్తికి రూ.18లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తావా? అని నిలదీశారు.
ట్రెండింగ్ వార్తలు
"తెలంగాణ సంపద ఏమైనా మీ అత్తగారి సొమ్మా? తెలంగాణ కొలువులు ఏమైనా మీ ఇంట్లో నౌకరు పదవులా మీ ఇష్టారాజ్యంగా రాసివ్వడానికి? అందుకోసమేనా పేపర్లు లీక్ చేసి అమ్ముకుంటున్నారు? జీవోలు దాచిపెట్టి కొలువులు కట్టబెడుతున్నారు? నీ పార్టీ ఖజానాలో ఉన్న రూ.1250 కోట్లు సరిపోవడం లేదా? ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా నీ పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూస్తున్నావా? ఇలా జీవోలను దాచిపెట్టి ఇంకా ఎంతమందికి కొలువులు ఇచ్చారు? మీ పార్టీ కార్యకర్తలకు పదవుల కోసం ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి కామెంట్స్…
బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర యువకుడు శరద్ మర్కద్‌ను సీఎంఓలో నెలకు రూ.లక్షన్నర జీతం ఇచ్చి ప్రైవేట్ సెక్రటరీగా నియమించారని రేవంత్ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… ఇందుకు సంబంధించిన జీవోను రహస్యంగా ఉంచారని రేవంత్ ఆక్షేపించారు. ఓవైపు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతుంటే ప్రజాధనంతో పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు అక్కడి మనుషులను తెచ్చుకొని మరీ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలో చేరిన 20 రోజులకే ఉద్యోగం ఇచ్చి.. ప్రజల సొమ్ముతో ఏడాదికి రూ.18 లక్షల జీతం ఇస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
సంబంధిత కథనం