ORR Lease Tender: ఆ భయంతోనే KTR మాట్లాడటం లేదు.. కాగ్ కు ఫిర్యాదు చేస్తామన్న రేవంత్ రెడ్డి-tpcc chief revanth reddy allegeations on orr tender to private ltd ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Orr Lease Tender: ఆ భయంతోనే Ktr మాట్లాడటం లేదు.. కాగ్ కు ఫిర్యాదు చేస్తామన్న రేవంత్ రెడ్డి

ORR Lease Tender: ఆ భయంతోనే KTR మాట్లాడటం లేదు.. కాగ్ కు ఫిర్యాదు చేస్తామన్న రేవంత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
May 04, 2023 05:32 PM IST

Revanth Reddy On ORR: ఓఆర్ఆర్ అంశంపై సంబంధిత శాఖ మంత్రి వివరణ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన...ఈ అంశంపై మాట్లాడితే ఇరుక్కుపోతాననే భయంతోనే మంత్రి కేటీఆర్ ముఖం చాటేశారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy On ORR: ఓఆర్ఆర్ లీజ్ టెండర్ విధానంపై కాగ్ కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన... టెండర్ విధానంపై సంబంధిత శాఖ మంత్రి వివరణ ఇవ్వాలని అన్నారు. కానీ ఎక్కడ దొరికిపోతాననే భయంతోనే కేటీఆర్ మాట్లాడటం లేదని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై కేటీఆర్ మౌనం వెనక మర్మం ఏమిటి? అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్లు చేతులు మారాయని... అరవింద్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. మాజర్ సంస్థ నివేదిక ప్రకారం టెండర్లు ఇచ్చామని సమర్థించుకుంటున్నారని... మాజర్ సంస్థపై అమెరికాలో కేసులు నమోదయ్యాయని చెప్పారు.

"ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉండేది. IRBకి అప్పగించేందుకు ఓఆర్ఆర్ ను HMDA పరిధిలోకి తీసుకొచ్చారు. దీని వెనక అసలు విషయాన్ని ఏమిటో బయటపెట్టాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొంటామన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు ప్రయివేటుకు కట్టబెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే అథారిటీ అభ్యంతరం చెప్పింది. NHAI నిబంధనల ప్రకారం టెండర్లు ఇవ్వలేదు. బేస్ ప్రైస్ నిర్ణయించకుండా టెండర్ ఎవరైనా పిలుస్తారా? టోల్ గెట్ పై రోజుకు రూ.2కోట్ల ఆదాయం వస్తుంది. ఏడాదికి రూ.730 కోట్లు.. 30 ఏళ్లకు 22వేల కోట్లు ఆదాయం వస్తుంది. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డుకు 16వేల కోట్లు బ్యాంకు రుణం వస్తుంది. కానీ ప్రభుత్వం తక్కువ ధరకే ప్రయివేటుకు కట్టబెట్టింది. స్విస్ ఛాలెంజ్ విధానంలో బేస్ ప్రైస్ 7388 కోట్ల తో టెండర్లకు పిలవండి. IRB కంపెనీని ముందు పెట్టి తరువాత కేటీఆర్ బినామీ కంపెనీలతో ఇందులోకి ప్రవేశించే కుట్ర జరుగుతోంది. 30 ఏండ్లు వీళ్లే దోపిడీలకు పాల్పడుతున్నారు. బేస్ ప్రైస్ పెట్టాము కానీ చెప్పం అని అంటున్నారు. అందులో ఏమైనా దేశ భద్రత, కేసీఆర్ ప్రాణం ఏమైనా ఉందా? బేస్ ప్రైస్ చెప్పడానికి ఏమిటి నష్టం. అరవింద్ కుమార్ మేం లేవనెత్తిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆర్టీఐ ప్రకారం మేం అడిగిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. సీబీఐ, ఈడీకి కూడా సమాధానం ఇవ్వరా? తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలి" అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ ఆస్తుల్ని కేసీఆర్ ప్రయివేటుకు అమ్మడానికి వీల్లేదన్నారు రేవంత్ రెడ్డి. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను అగ్గువకే ప్రయివేటుకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహరంపై స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. "సెంట్రల్ విజిలెన్స్ కమీషన్, డీవోపీటీ కు అరవింద్ కుమార్ పై ఫిర్యాదు చేస్తా. ఓఆర్ఆర్ అంశంపై కాగ్ కు పిర్యాదు చేస్తాం. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల కుంభకోణం జరిగింది. దీనికి కేటీఆర్ కారణం. ఇంత జరుగుతున్నా తండ్రీ కొడుకులు బయటకు వచ్చి వివరణ ఇవ్వడంలేదు. తెలంగాణ కేబినెట్ కు అతీత శక్తులు లేవు. కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదు" అని స్పష్టం చేశారు.

ఈ నెల 8న సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ సరూర్ నగర్ లో ప్రియాంక గాంధీ గారి సభ ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యార్థులు, నిరుద్యోగులను ఎలా ఆదుకుంటామో సభలో చెబుతామని వెల్లడించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం