Revanth Reddy Lettet to KCR: కేసీఆర్ కు ఆ కుటుంబాలు కనిపించటం లేదా..?-tpcc chief revanth reddy open lettet to cm kcr bihar tour ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tpcc Chief Revanth Reddy Open Lettet To Cm Kcr Bihar Tour

Revanth Reddy Lettet to KCR: కేసీఆర్ కు ఆ కుటుంబాలు కనిపించటం లేదా..?

HT Telugu Desk HT Telugu
Sep 01, 2022 04:41 PM IST

revanth reddy open lettet to kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో అమరజవాన్ల కుటుంబాలు సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని నిలదీశారు. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ (ఫైల్ ఫొటో)
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ (ఫైల్ ఫొటో) (twitter)

Revanth Reddy open lettet to cm kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా తెలంగాణ ప్రజల సొమ్మును దేశమంతా పంచుతున్నారని విమర్శించారు. తెలంగాణకు చెందిన అమరజవాన్ యాదయ్యతో పాటు కేసీఆర్ బిహార్ పర్యటనకు సంబంధించి పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు.

అమర జవాన్లు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా వారి త్యాగం పట్ల, వారి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉందన్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అన్న తీరుగా మీ వ్యవహార శైలి ఉండటం పై మాత్రమే అభ్యంతరాన్ని తెలియజేస్తున్నట్లు లేఖలో తెలిపారు.

cm kcr bihar tour: 'బిహార్ రాష్ట్రంలో పర్యటించి గాల్వాన్ లోయ అమరవీరుల కుటుంబాలకు మీరు తెలంగాణ తరఫున పరిహారం అందజేసి వచ్చారు. ఈ పర్యటనలో గానీ, మీ పరిహారంలోగానీ అమర జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతి కంటే మీ రాజకీయ, రాజ్యాధికార విస్తరణ ఆకాంక్షే అధికంగా కనిపిస్తోంది. దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఉద్ధరించాలని మీరు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ క్రమంలోనే ఈ పప్పుబెల్లాల పంపక కార్యక్రమాన్ని చేపట్టారని చిన్న పిల్లవాడికి కూడా అర్థమవుతోంది. అమర జవాన్ల మరణాలను సైతం మీ స్వార్థ రాజకీయాలకు వాడుకునే ఎత్తుగడ చూసి తెలంగాణ సమాజం విస్తుపోతోంది. నిజంగా అమర జవాన్ల కుటుంబాల పట్ల మీకు సానుభూతి ఉంటే... తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం మీకు కనిపించలేదా...? యాదయ్య త్యాగం మీకు యాదికి రాలేదా ? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డి పల్లెకు చెందిన యాదయ్య కాశ్మీర్ లో 2013 లో ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఆయన కుటుంబాన్ని అప్పట్లో అన్ని పార్టీలు పరామర్శించాయి. మీ పార్టీ తరఫున మీ కుమార్తె కవిత స్వయంగా వచ్చి పరామర్శించి వెళ్లారు. ఆ కుటుంబానికి ఐదెకరాలు భూమి, కల్వకుర్తిలో ఇంటి స్థలం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొమ్మిదేళ్లు గడుస్తున్నా... ఆ హామీకి అతీగతీ లేదు' అని రేవంత్ విమర్శించారు.

Revanth reddy fires on cm kcr: మన తెలంగాణ బిడ్డ అమరుడై, ఆయన కుటుంబం దిక్కులేనిదై రోడ్డున పడితే పట్టించుకోవటంలేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బిహార్ రాష్ట్రంలోని అమర జవాన్లకు పరిహారం ఇవ్వడం పరిహాసంగా అనిపించడం లేదా? ఇదేనా అమర జవాన్ల కుటుంబాల పట్ల మీకున్న చిత్తశుద్ధి?అని ప్రశ్నించారు.

రాజకీయ స్వార్థం కోసం మరీ ఇంతగా దిగజారవద్దని రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఇప్పటికైనా స్వార్థపూరిత విషపు ఆలోచనలకు కొంత విరామం ఇచ్చి... దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ యాదయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆ కుటుంబానికి ఐదెకరాలు వ్యవసాయ భూమి, కల్వకుర్తిలో ఇంటి స్థలం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదయ్య పిల్లలకు మంచి చదువులు చెప్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలన్నారు.

మరోవైపు కేసీఆర్ బిహార్ పర్యటనపై కాంగ్రెస్, బీజేపీతో పాటు పలు పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఘటనలో కు.ని ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోతే పట్టించుకోని కేసీఆర్...బిహార్ కు ఏం ఉద్ధరించడానికి వెళ్లారని నిలదీస్తున్నారు.

IPL_Entry_Point