TSPSC AEE Exam : ఇవాళ, రేపు ఏఈఈ రాత పరీక్షలు.. సెంటర్ల వద్ద పటిష్ట చర్యలు-today tspsc assistant engineer exams 2023 conducted on may 21 st and 22nd may 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Aee Exam : ఇవాళ, రేపు ఏఈఈ రాత పరీక్షలు.. సెంటర్ల వద్ద పటిష్ట చర్యలు

TSPSC AEE Exam : ఇవాళ, రేపు ఏఈఈ రాత పరీక్షలు.. సెంటర్ల వద్ద పటిష్ట చర్యలు

HT Telugu Desk HT Telugu

TSPSC Exams Updates 2023: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు ఏఈఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు చేపట్టింది. మరోవైపు పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

ఇవాళ, రేపు ఏఈ రాత పరీక్షలు..

TSPSC AE Exams Updates: ఇవాళ, రేపు ( మే 21, 22) వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్‌(సివిల్) విభాగాల్లోని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పోస్టులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించనుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(సీబీఆర్టీ) పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది.

ఈ పరీక్షల ద్వారా మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 8న ఎలక్ట్రికల్‌ అండ్ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్ అభ్యర్థుల‌కు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక మే 21, 22 తేదీల్లో రెండు షిప్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను పేపర్‌ లీకేజీ కారణంగా కమిషన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. 1,540 పోస్టుల భర్తీకి ఏఈఈ నోటిఫికేషన్‌ను 2022 సెప్టెంబర్‌ 3న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఇందుకు 44,352 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

TSPSC Exam Dates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.... మరిన్ని విషయాలను బయటికి లాగే పనిలో పడింది. ఇప్పటికే 30 మందికిపై గా అరెస్ట్ చేయగా… మరోవైపు ఈడీ కూడా విచారిస్తోంది. ఇదిలా ఉంటే పరీక్ష నిర్వహణ తేదీలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని పరీక్షల తేదీలను వెల్లడించగా… తాజాగా మరో రెండు పరీక్షల తేదీలను ప్రకటించింది. జులై 8వ తేదీన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష ఉండగా... జులై 13, 14వ తేదీన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరీక్షలకు వారం రోజుల ముందు వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.

TSPSC Group 1: పేపర్‌ లీక్ వ్యవహారంతో రద్దైన గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ పరీక్షలను జూన్‌11న తిరిగి నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో గ్రూప్ 1 అభ్యర్థులు ఉండటంతో ఆఫ్‌లైన్ పద్ధతిలో, ఓఎంఆర్‌ విధానంలోనే గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షల్ని నిర్వహించనున్నారు.జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు టిఎస్‌పిఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత ఏడాది ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అక్టోబర్‌ 16న పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2,85,916 మంది హాజరయ్యారు.మెయిన్స్‌ పరీక్షలకు 25,050 మందిని కమిషన్‌ ఎంపిక చేసింది. ఈ క్రమంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తోపాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేసింది. మళ్లీ కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది.