TSPSC Paper Leak Case: పేపర్ లీక్ కేసులో చిక్కిన మరో ముగ్గురు ... ఇప్పటివరకు 30 మంది అరెస్ట్
TSPSC Paper Leak Casee Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
TSPSC Paper Leakage Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్(TSPSC Paper Leak) వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా... మరికొందరిని విచారిస్తోంది. తవ్వేకొద్ది అక్రమాలు బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది సిట్. ఫలితంగా ఇప్పటివరకు ఈ కేసులో 30 మంది అరెస్ట్ అయ్యారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌కుమార్ నుంచి ఏఈఈ పేపర్లు వరంగల్, హైదరాబాద్‌లకు చెందిన దళారులు మనోజ్‌కుమార్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డిలకు చేరాయి. వీరు ఒక్కోక్కరితో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు అడ్వాన్సులు తీసుకుని పేపర్లు అందించారు. మనోజ్, మురళీ విచారణలో వీరి నుంచి పేపర్లు ఖరీదు చేసిన వారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో గత వారమే నలుగురిని అరెస్టు చేసింది సిట్. తాజాగా క్రాంతి, శశిధర్‌రెడ్డిలను కూడా అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరు కూడా మురళీధర్‌రెడ్డి నుంచి ఏఈఈ పేపర్లను కొనుగులో చేసినట్లు గుర్తించింది. మరోవైపు ప్రవీణ్ వద్ద నుంచి డీఏఓ పేపర్ కొనుగోలు చేసి ఖమ్మం జిల్లాకు చెందిన సాయి సుస్మిత, సాయి లౌకిక్ దొరికిన సంగతి తెలిసిందే. వీరిని గత నెలలోనే అరెస్ట్ చేసింది సిట్. అయితే సాయి లౌకిక్ ఆ పేపర్‌ను తన స్నేహితుడైన రవి తేజకు విక్రయించాడు. దర్యాప్తులో ఈ విషయం గుర్తించిన పోలీసులు మంగళవారం రవితేజను అరెస్ట్ చేశారు. మంగళవారం అరెస్టయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. వీరి కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సిట్ తో పాటు ఈడీ కూడా విచారిస్తోంది. లక్షల్లో నగదు చేతులు మారినట్లు గుర్తించింది. ఈ మేరకు నిందితులతో పాటు కమిషన్ సభ్యులను కూడా ఈడీ విచారించే పనిలో పడింది.
ఓవైపు సిట్ విచారణ ముమ్మరంగా సాగుతుండగా… మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణపై దృష్టిపెట్టింది. ఇప్పటికే పలు పరీక్షల తేదీలను ఖరారు చేయగా… మరికొన్ని పరీక్షలపై కూడా ఫొకస్ పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 11 నిర్వహించనున్నారు. పేపర్ లీక్ వ్యవహారంతో గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేశారు. దీంతో ఈ పరీక్షల్ని తిరిగి ఆఫ్‌లైన్ పద్ధతిలో, ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.
సంబంధిత కథనం