Telangana New Secretariat : కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా-telangana new secretariat inauguration event postponed due to election code ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana New Secretariat Inauguration Event Postponed Due To Election Code

Telangana New Secretariat : కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

HT Telugu Desk HT Telugu
Feb 11, 2023 08:28 AM IST

telangana new secretariat inauguration postponed: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని సర్కార్ ప్రకటించింది.

తెలంగాణ కొత్త సచివాలయం
తెలంగాణ కొత్త సచివాలయం

Telangana new secretariat inauguration News: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా... ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ప్రకటించింది. నిజానికి తెలంగాణ సర్కార్ నూతనంగా నిర్మించిన డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని ఫిబ్రవరి 17 వ తేదీన ప్రారంభించబోతున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల మధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్, ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జెడియు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర ప్రముఖులు హాజరు అవుతారని కూడా మంత్రులు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్న క్రమంలో తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్.

అత్యాధునిక హంగులతో నిర్మాణం….

తెలంగాణ సచివాలయం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు. ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణాన్ని 2021 జనవరిలో ప్రభుత్వం చేపట్టింది. కొత్త సచివాలయంలో 11 అంతస్తుల ఎత్తుతో ప్రధాన నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌ సదుపాయం సిద్ధమవుతోంది. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్‌ తదితరాలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు.

సచివాలయ భవనాన్ని 7 నుంచి 11 అంతస్తుల ఎత్తులో డోములు నిర్మించారు. 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలను భవనం చుట్టూ ఏర్పాటు చేశారు. ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటు చేశారు. అయితే కొద్దిరోజుల కిందట కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం కూడా చోటు చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల శాసన మండళ్లలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24వరకు గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మార్చి 21నాటికి ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు. అయితే ఎన్నికల కోడ్ పూర్తి అయ్యాకే సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం