National Herald case: ఈడీ దూకుడు... టీ కాంగ్రెస్ నేతలకు నోటీసులు!
ED On National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఆయా నేతలు మాత్రం.. తమకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు.
ED Notices to Telangana Cogress Leaders: నేషనల్ హెరాల్డ్ కేసు.... కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు పంపింది. పలుమార్లు విచారణ కూడా జరపగా... అగ్రనేతలు స్వయంగా హాజరయ్యారు. దీనిపై బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తుండగా... హస్తం నేతలు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే... తాజాగా ఈ వ్యవహరం తెలంగాణ కాంగ్రెస్ నేతల వరకు చేరినట్లు తెలుస్తోంది.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి దూకుడు పెంచిన ఈడీ... పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. షబ్బీర్ అలీ , సుదర్శన్‌రెడ్డి , అంజన్‌కుమార్ యాదవ్ ,రేణుకాచౌదరి, గీతారెడ్డితో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 10న ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరు కావాలని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులు తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.
స్పందించిన నేతలు...
ఈడీ నోటీసులు అంశంపై పలువురు నేతలు స్పందించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.... ఈ కేసులో తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. తాను కూడా విరాళం ఇచ్చానని... ఇప్పటి వరకూ తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి కూడా తనకు నోటీసులు రాలేదని చెప్పారు. తాను నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు ఆర్థిక సహాయం చేశానని.. అది చెక్కు రూపంలోనే ఇచ్చానని పేర్కొన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. మాజీ మంత్రి గీతారెడ్డి కూడా తనకు నోటీసులు రాలేదని వెల్లడించారు. షబ్బీర్ ఆలీ స్పందిస్తూ నోటీసులు రాలేదని వస్తే విచారణకు హాజరవుతానని ప్రకటించారు.
మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో హవాలా లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారలను ఈడీ సేకరించింది. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన వారికి,ఈ సంస్థతో సంబంధం లేని మూడో వ్యక్తులకు జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ గుర్తించింది. ముఖ్యంగా ముంబై, కోల్‌కతాల్లోని హవాలా ఆపరేటర్లతో జరిగిన లావాదేవీల వివరాలను, సంబంధిత పత్రాలను ఈడీ సేకరించింది. ఢిల్లీలోని హెరాల్డ్ బిల్డింగ్‌లో ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో కూడా సోదాలు చేసిన సంగతి తెలిసిందే.