PM Modi in Hyd: వాళ్లని వదిలే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్
PM Modi Fires On TRS Govt: హైదరాబాద్ లోని బేగంపేటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. అభివృద్ధి వ్యతిరేకులతో టీఆర్ఎస్ సర్కారు జతకట్టిందని విమర్శించారు. అవినీతిని సహించేదిలేదన్నారు.
PM Modi Speech in Hyderabad: అవినీతి, కుటుంబ పాలన కారణంగానే తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదన్నారు ప్రధాని మోదీ. బేగంపేటలో బీజేపీ తలపెట్టిన సభలో మాట్లాడిన ఆయన… టీఆర్ఎస్ సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. పేదలను దోచుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగం మొదలుపెట్టిన మోదీ... తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో త్వరలోనే అంధకారం పోతుందన్న ఆయన... త్వరలోనే సూర్యోదయం రాబోతుందంటూ కామెంట్స్ చేశారు. మునుగోడులో బీజేపీ కార్యకర్తల పోరాటం ఎంతో అభినందనీయమన్నారు మోదీ. గత కొన్ని రోజులుగా జరిగిన ఉప ఎన్నికల్లో ఒకే విషయం స్పష్టమవుతోంది. కష్టకాలంలో కూడా బీజేపీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదని చెప్పారు. ఐటీలో ముందున్న రాష్ట్రాన్ని కొన్ని అంధవిశ్వాస శక్తులు పాలిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని... మూఢవిశ్వాసాలను పారదోలుతుందని స్పష్టం చేశారు. ఎర్రజెండా నేతలు అభివృద్ధి, సామాజిక న్యాయానికి వ్యతిరేకులంటూ కమ్యూనిస్టు పార్టీలను కూడా కార్నర్ చేశారు ప్రధాని. అలాంటి వారితో టీఆర్ఎస్ సర్కారు చేతులు కలిపిందన్నారు.
గతంలో పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలోనూ అక్రమాలు చేశారని.. ప్రజలను లూటీ చేసే వారు ఎవరైనా సరే.. వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు ప్రధాని మోదీ. పేదలకు అందాల్సిన నిధుల్లో అవినీతికి తావు లేకుండా చేశామని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే భాజపా రాజకీయాలు చేస్తోందన్నారు. కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారని... అయినా ఆ బూతులను నేను పట్టించుకోను అని చెప్పారు. తనని తిట్టినా పట్టించుకోను కానీ..తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించేది లేదన్న ప్రధాని... పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. 1984లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్నాయని.. అప్పుడు హన్మకొండ నుంచి జగ్గారెడ్డి గెలిచారని ప్రధాని గుర్తు చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన పోయి బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. అవినీతి, కుటుంబ పాలన దేశానికి ప్రధమ శత్రువులని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణను కుటుంబ పాలన, అవినీతి నుంచి విముక్తి చేయడం మా బాధ్యత అని ప్రసంగించారు.
అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రధానికి సీఎం స్వాగతం పలకడం ఆనవాయితీ అని... కానీ ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉందన్నారు. మహిళ అని చూడకుండా గవర్నర్‌ను అవమానించారని విమర్శించారు.