Visakha Modi Meeting : ఆంధ్రాకు అండగా ఉంటామన్న ప్రధాని నరేంద్ర మోదీ…-pm narendra modi assures andhra prades development in visakhapatnam meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Pm Narendra Modi Assures Andhra Prades Development In Visakhapatnam Meeting

Visakha Modi Meeting : ఆంధ్రాకు అండగా ఉంటామన్న ప్రధాని నరేంద్ర మోదీ…

B.S.Chandra HT Telugu
Nov 12, 2022 11:15 AM IST

Visakha Modi Meeting దేశంలో నిర్లక్ష్యానికి మౌలిక రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి పలు జాతీయ ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని పథకాలకు శంకుస్థాపనలు చేశారు. మౌలిక రంగంలో భాగంగా రోడ్లు, రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

విశాఖలో ప్రధాని నరేంద్రమోదీ
విశాఖలో ప్రధాని నరేంద్రమోదీ

Visakha Modi Meeting ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేలా మౌలిక రంగ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. కొద్ది నెలల క్రితం అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, ఏపీ రావడానికి మరో అవకాశం రావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో కీలక పట్టణమైన విశాఖ, భారతీయ వాణిజ్యానికి కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. ప్రాచీన భారత చరిత్రలో విశాఖకు సుస్థిరమైన స్థానం ఉందని, శతాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ నుంచి రోమ్, పశ్చిమాసియా దేశాలకు వాణిజ్యం జరిగేదని గుర్తు చేశారు. రక్షణ, వ్యాపార రంగాల్లో విశాఖ కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

విశాఖ సభలో వెంకయ్యనాయుడు, హరిబాబులకు ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రా ప్రాంత అభివృద్ది కోసం వారు చేసిన కృషిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రులు అన్ని రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నారని, విద్యా, వ్యాపారం, మెడికల్, టెక్నాలజీ అన్ని రంగాల్లో ఆంధ్రా ప్రాంత ప్రజానీకం తమదైన ముద్రను వేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కలుపుగోలు తనం వల్ల ఆంధ్రులకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందన్నారు. తెలుగు ప్రజలు అందరి బాగుకు ప్రాధాన్యత ఇస్తారని మోదీ చెప్పారు. దేశం పురోభివృద్ధి సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర మరువలేనిదన్నారు.

దేశంలో మౌలిక సదుపాయల అభివృద్ధి విషయంలో తమకు ఎలాంటి సందేహం లేదని ప్రధాని చెప్పారు. రైల్వేలు, రోడ్డు రవాణా, పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల దేశం వెనుకబడిందని చెప్పారు. సప్లై చైన్‌ను, లాజిస్టిక్స్‌ రంగానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మోదీ చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.

జాతీయ రహదారులను ఆరు వరుసలకు విస్తరిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌, ఫిషింగ్ హార్బల్‌ వంటి, జాతీయ రహదారుల విస్తరణ, పోర్టులకు కనెక్టివిటీ వంటి ప్రాజెక్టులకు అత్యాధునిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మోదీ చెప్పారు. మౌలిక సదుపాయల కల్పినలో పిఎం గతి శక్తి మాస్టర్‌ ప్లాన్ రూపొందించి, దేశ వ్యాప్తంగా విస్తృత సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మిషన్ గతిశక్తి ద్వారా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన సులువు అవుతుందని చెప్పారు.

కేంద్రంతో అనుబంధం రాజకీయాలకు అతీతం… సిఎం జగన్

కేంద్రంతో ఆంధ్రప్రదేశ్‌ అనుబంధం రాజకీయాలకు అతీతమైందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్విటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్రానికి ఇతోదికంగా సహకరించాలని సభా వేదికపై ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పెద్దలు సహృదయంతో తమను ఆశీర్వదించాలని కోరారు. కేంద్రం రాష్ట్రానికి చేసే ప్రతి సాయం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయన్నారు.

విభజన హామీలైన పోలీవరం, రైల్వేజోన్‌, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వంటి హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శ్రేయస్సును కోరుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ప్రత్యేక హోదా అంశం వరకు పరిష్కరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో తమ బంధానికి మరో కారణం ఏమి లేదని, తమకు ఎలాంటి అజెండా లేదు, ఉండబోదని సిఎం జగన్ ప్రకటించారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిలదొక్కుకునేందుకు ఖర్చు చేసినట్లు చెప్పారు.

సుమారు రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే చేపట్టారు. రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం చేశారు. రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్‌జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేశారు.

IPL_Entry_Point