PM Modi in Ramagundam : సింగరేణిని ప్రైవేటీకరించం.. రామగుండం సభలో ప్రధాని మోదీ-pm modi inaugurated the rfcl fertilizer plant at ramagundam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Pm Modi Inaugurated The Rfcl Fertilizer Plant At Ramagundam

PM Modi in Ramagundam : సింగరేణిని ప్రైవేటీకరించం.. రామగుండం సభలో ప్రధాని మోదీ

HT Telugu Desk HT Telugu
Nov 12, 2022 04:54 PM IST

pm modi inaugurated the RFCL fertilizer plant: బేగంపేట బహిరంగ సభ నుంచి ప్రత్యేక చార్టర్ లో రామగుండంకు చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడి నుండి రోడ్డు మార్గంలో RFCL ఎరువుల ఫ్యాక్టరీని అరగంటపాటు సందర్శించారు. అనంతరం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్నారు.

రామగుండం సభలో ప్రధాని మోదీ
రామగుండం సభలో ప్రధాని మోదీ (twitter)

PM Modi Ramagundam Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ రామగుండంలో పర్యటించారు. హైదరాబాద్ లోని బేగంపేట బహిరంగ సభలో నుండి ప్రత్యేక చార్టర్ లో రామగుండంకు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో RFCL ఎరువుల ఫ్యాక్టరీని అరగంటపాటు సందర్శించారు. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ... ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. దీనితో పాటు భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేశారు. రూ.2,268 కోట్ల రూపాయ లకు పైగా విలువ కలిగిన జాతీయ రహదారుల ప్రాజెక్ట్ లకు రామగుండంలో శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఇందులో ఎల్కతుర్తి - సిద్దిపేట, బోధన్- బైంసా, బాసర, సిరొంచా -మహాదేవపూర్ మధ్య నిర్మించే జాతీయ రహదారులు ఉన్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు. సభకు వచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక్కరోజు 10వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ప్రధాని అన్నారు. రైలు, రోడ్ల విస్తరణతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని చెప్పారు. గత రెండున్నరేళ్లుగా కరోనాతో పాటు యుద్ధాల కారణంగా ప్రపంచం ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ఫలితంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. అయినప్పటికీ భారత్... మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని వ్యాఖ్యానించారు. గత 8 ఏళ్లుగా అందిస్తున్న సుపరిపాలనే ఇందుకు నిదర్శనమన్నారు. నిరంతరం శ్రమిస్తున్నామని... అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేశారు.

దేశంలో ఫర్టిలైజర్ వ్యవస్థను ఎంతో అభివృద్ధి చేశామన్నారు ప్రధాని మోదీ. ఇందుకు రామగుండం యూనిటే ఎగ్జామ్ పుల్ అని చెప్పారు. గతంలో ఇందుకోసం విదేశాలపై ఆధారపడేవాళ్లమని గుర్తు చేశారు. యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడే వాళ్లని... కొన్నిసార్లు లాఠీ దెబ్బలు కూడా తినే వారని చెప్పారు. టెక్నాలజీ వ్యవస్థ అభివృద్ధి కాకపోవటంతో రామగుండం యూనిట్ మూతపడిందన్నారు. ఇవాళ యూరియా బ్లాక్ మార్కెట్ ను పూర్తిగా ఆరికట్టామని పేర్కొన్నారు.

"ఫర్టిలైజర్ రంగంలో ఎంతో పురోగతి సాధించాం. గోరఖ్ పూర్, రామగుండంతో పాటు 5 ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరుగుతోంది. రైతుల కోసం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేశారు. వచ్చే 2 ఏళ్లలోనూ మరో 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. గతంలో నకిలీ ఎరువులతో రైతులు నష్టపోయారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారింది. కానీ ఇప్పుడు అన్ని బ్రాండ్ లు పోయాయి. కేవలం భారత్ బ్రాండ్ పేరుతోనే యూరియా అందుబాటులో ఉంటుంది" అని మోదీ స్పష్టం చేశారు.

బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇందులో కేంద్రం వాటా 49 శాతం మాత్రమేని స్పష్టం చేశారు. ప్రైవేటీకరించటం కేంద్రం చేతిలో లేదని.. రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందన్నారు. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వం వాటా 51 శాతమని చెప్పారు.

సింగరేణిని ప్రైవేటుపరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం సభలో మాట్లాడిన ఆయన... సింగరేణి ప్రైవేటీకరణతో కేంద్రానికి సంబంధం లేదన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో ఎరువుల కొరత తీరుతుందన్నారు.

IPL_Entry_Point