RFCL Production : రామగుండంలో సాంకేతిక సమస్యలు…. అమ్మోనియా ప్లాంటుకే పరిమితం
RFCL Production రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయడానికి వస్తున్న సమయంలోనే ప్లాంటులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. యూరియా ప్రొడక్షన్ పైప్‌లైన్లలో సమస్యలు తలెత్తడంతో ప్రధాని పర్యటనను అమ్మోనియా ప్లాంటుకు మాత్రమే పరిమితం చేయాలని అధికారులు యోచిస్తున్నారు. కొద్ది వారాల క్రితమే ప్లాంటులో వార్షిక మరమ్మతులు పూర్తైనా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
RFCL Production : రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయడానికి వస్తున్న సమయంలో ప్లాంట్‌లో ప్రొడక్షన్ నిలిచిపోయింది. శనివారం మధ్యాహ్నం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని సందర్శించనున్న సమయంలో కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతోనే ప్లాంట్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అంకితం చేయనున్న సమయంలో ప్లాంటులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. శనివారం మధ్యాహ్నం రామగుండం ఫెర్టిలైజర్స్‌ను దేశానికి అంకితం చేయాల్సి ఉండగా యూరియా ఉత్పత్తికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. వార్షిక మరమ్మతులు పూర్తి చేసినా ఆటంకాలు తప్పకపోవడం అధికారుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. మరమ్మతులు పూర్తైన రెండ్రోజులకే మళ్లీ ప్లాంటులో ఉత్పత్తి మొరాయించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీలో వార్షిక రిపేర్ల కోసం గత సెప్టెంబర్ 7 నుంచి ప్రొడక్షన్ నిలిపి మరమ్మతులు నిర్వహించారు. 25రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని భావించినా రెండు నెలల సమయం పట్టింది. మరమ్మతులు పూర్తి చేసి కర్మాగారంలో ప్రొడక్షన్ ప్రారంభించిన వెంటనే యూరియా ప్లాంట్ సమస్యలు మొదలయ్యాయి. పైప్‌లైన్లలో సమస్యలు తలెత్తడంతో ప్రొడక్షన్ ఆపేశారు. యూరియా తయారు చేసే పైప్‌లైన్ రిపేర్లు పూర్తి చేసి ఈ నెల 6న ఉత్పత్తి మొదలు పెడితే, 9వ తేదీన యూరియా ప్లాంట్‌కు అమ్మోనియాను సరఫరా చేసే లైన్‌లో లీకేజీ ఏర్పడినట్లు గుర్తించారు.
ప్రధాని పర్యటన సమయంలో ప్లాంటులో ఉత్పత్తి జరగకపోతే బాగుండదని భావించి యూరియాని పరిమితంగా ఉత్పత్తి చూస్తూ లీకేజీ రిపేర్ పనులు చేపట్టారు. అయితే అవి సఫలం కాలేదు.యూరియా ఉత్పత్తిని నిలిపివేసి, అమ్మోనియా ఉత్పత్తిని సగానికి తగ్గించారు. అమ్మోనియా పైప్‌లైన్ లీకేజీ సమస్య తీరాలంటే కొత్త పైప్‌లైన్లను బిగించాల్సి ఉంది. ఈ పనుల్ని ఆగమేఘాలపై చేపట్టారు.
యూరియా ప్రొడక్షన్‌కు అవసరమైన కొత్త పైప్‌లైన్లను బిగించి ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఆరేడు గంటల సమయం పడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సమయానికి పనులు పూర్తి కాకపోవచ్చని అధికారులు అంచనా వేశారు. ప్రధాని రామగుండం ఫెర్టిలైజర్స్‌ను జాతికి అంకితం చేసే క్రమంలో అమ్మోనియా ప్లాంటులో మాత్రమే పర్యటిస్తారు. యూరియా ప్లాంట్ ప్రొడక్షన్‌కు సిద్ధం అయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రధాని పర్యటన అమ్మోనియా ప్లాంటుకు పరిమితం కానుంది. మరోవైపు ప్రధాని పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండటం తెలిసిందే…