KTR Open Letter : బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గం-minister ktr open letter to union govt over fuel prices ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Ktr Open Letter To Union Govt Over Fuel Prices

KTR Open Letter : బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గం

HT Telugu Desk HT Telugu
Mar 30, 2023 05:33 PM IST

KTR On Fuel Prices: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఈ దోపిడీ ఆపకుంటే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ (facebook)

Minister ktr open letter to Union Govt: పెట్రో ధరల దోపిడీపై కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటుందని ఫైర్ అయ్యారు. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందన్నారు.

2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలుగా ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని దుయ్యబట్టారు. కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతుందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని చెప్పారు.

2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45 శాతం పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగిందని చెప్పారు కేటీఆర్. నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోందని.... దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత 45 సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్భనం దేశాన్ని పట్టిపీడిస్తోందన్నారు.

ఇన్నాళ్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రస్తావన లేదా ఉక్రెయిన్- రష్యా యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నది వాస్తవమన్నారు. దేశీయ వినియోగం పేరు చెప్పి భారీగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురును, శుద్ధి చేసి తిరిగి విదేశాలకు అమ్ముకుంటున్న కీలకమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా దాచి ఉంచుతుందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 2013 సంవత్సరంలో ఉన్న స్థాయికి పడిపోయిన నేపథ్యంలో భారీగా పెంచిన, పెట్రోల్ రేటును తగ్గించాలని డిమాండ్ చేశారు.,

ఇప్పటికైనా ప్రధానమంత్రి మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్... దేశ ప్రజల నుంచి పెట్రోల్ ధరల రూపంలో చేస్తున్న దోపిడీని ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి ఒక్క రూపాయి వ్యాట్ ను పెంచకున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం సెస్సుల పేరుతో 30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టిందన్నారు. కానీ ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం విధించిన సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలన్నారు. పెట్రోల్ ధరలు తగ్గాలంటే దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంలోని బాధ్యత కలిగిన మంత్రులు చెప్పడం గురువింజ సామెతను తలపిస్తుందని ఎద్దేవా చేశారు. జీఎస్టీ పరిధిలో ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరను 400 రూపాయల నుంచి 1200 కు పెంచిన అసమర్ధ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉందని మండిపడ్డారు.

ఈ ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు కేటీఆర్. అయితే దేశ ప్రజలు మోదీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటున్న పెట్రో భారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలని,,,, లేకుంటే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం