PM Modi: ‘‘తెలంగాణ, ఆంధ్రాల్లోనూ ఎదుగుతున్నాం’’: ప్రధాని మోదీ-all corrupt are on one stage under bhrashtachari bachao abhiyan pm modi s dig ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi: ‘‘తెలంగాణ, ఆంధ్రాల్లోనూ ఎదుగుతున్నాం’’: ప్రధాని మోదీ

PM Modi: ‘‘తెలంగాణ, ఆంధ్రాల్లోనూ ఎదుగుతున్నాం’’: ప్రధాని మోదీ

HT Telugu Desk HT Telugu
Mar 28, 2023 09:22 PM IST

PM Modi :భారత దేశంలో బీజేపీ ఒక్కటే పాన్ ఇండియా పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. అటు ఈశాన్య రాష్ట్రాల్లో.. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదురులేని శక్తిగా ఎదుగుతోందన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

PM Modi: ఢిల్లీలో బీజేపీ ఆడిటోరియం, నివాస సముదాయాన్ని ప్రధాని మోదీ (PM Modi) మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విపక్షాలు అవినీతి పరులతో నిండిపోయాయని, అవినీతి పరులను కాపాడుకోవడమే వాటికి ప్రధాన లక్ష్యంగా మారిందని విమర్శించారు. అందుకే వారంతా ఒక్కటవుతున్నారన్నారు. లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గర పడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రతిపక్షాలపై (opposition) దాడిని తీవ్రం చేశారు. అవినీతి పరులను కాపాడడానికి మాత్రమే విపక్షాలు ఉద్యమాలు చేస్తాయని ఎద్దేవా చేశారు.

PM Modi: దక్షిణాన కూడా మనదే హవా

ఈశాన్య రాష్ట్రాల్లో (NE States), దక్షిణాది రాష్ట్రాల్లో (south states) విజయాలు సాధించడంపై బీజేపీ (BJP) పార్టీ నేతలకు, కార్యకర్తలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘కర్నాటక (karnataka )లో మనమే నెంబర్ 1. తెలంగాణ (Telangana), ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ల్లో ప్రజాదరణను గణనీయంగా పెంచుకుంటున్నాం. ఆ రాష్ట్రాల్లో బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది’ అన్నారు. తమిళనాడు (Tamil nadu), కేరళ (kerala) ల్లో బీజేపీ బూత్ స్థాయికి విస్తరించిందన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కుటుంబ పాలన కొనసాగిస్తున్న పార్టీలే ఉన్నాయని మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబ పార్టీల మధ్య ఒక్క బీజేపీ (BJP) మాత్రమే పాన్ ఇండియా పార్టీ (Pan India Party) అని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే బీజేపీ (BJP) ఇప్పుడు అతి పెద్ద పార్టీ అని గుర్తు చేశారు.

PM Modi: భారత వ్యతిరేక శక్తులు

అవినీతిపరులను కాపాడడం కోసం విపక్షాలు ‘బ్రష్టాచారి బచావో ఆందోళన్’ ను ప్రారంభించాయన మోదీ (PM Modi) విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా భారత్ లోని లోని, భారత్ వెలుపల ఉన్న దేశ వ్యతిరేక శక్తులు కలిసిపోతున్నాయన్నారు. భారత్ లోని రాజ్యాంగసంస్థలు సుధృడమైనవని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, అవినీతిపై అవి కఠిన చర్యలు తీసుకుంటున్నాయని, అందువల్లనే వాటిపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ‘‘అవినీతిపరులపై చర్యలు తీసుకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారు. కోర్టులు తీర్పులు ఇస్తే, కోర్టులను లక్ష్యంగా చేసుకుంటారు. అవినీతిపరులను కాపాడడమే వారి లక్ష్యం’’ అని (PM Modi) మండిపడ్డారు. అయితే, తాను ఎక్కడికి వెళ్లినప్పటికీ.. అవినీతిపై పోరాటాన్ని కొనసాగించమని తనకు ప్రజల నుంచి అభ్యర్థన వస్తోందని వ్యాఖ్యానించారు.

PM Modi: రెండు నుంచి 303 కి పెరిగాం..

ఈ సందర్భంగా జనసంఘ్ సమయం నుంచి ఇప్పటి వరకు బీజేపీ (BJP) ప్రస్థానాన్ని ప్రధాని మోదీ (PM Modi) వివరించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి బీజేపీ ఎదిగిందన్నారు. ‘‘1984లో ఏం జరిగిందో భారత్ ఎన్నటికీ మర్చిపోదు. అదొక చీకటి కాలం. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయినా, మనం కుంగి పోలేదు. ఎవరినీ నిందించలేదు. ఎవరిపై దాడులు చేయలేదు. ప్రజల్లోకి వెళ్లాం. ప్రజా సమస్యలపై పోరాడాం. ప్రజలనుంచి మద్దతు సాధించాం. పార్టీగా బలోపేతం అయ్యాం. 2 లోక్ సభ స్థానాల నుంచి 2019 లో 303 స్థానాలు గెలుచుకునే స్థాయికి ఎదిగాం. చాలా రాష్ట్రాల్లో బీజేపీ 50% పైగా ఓట్లు సాధించింది’’ అని మోదీ వివరించారు.

IPL_Entry_Point

టాపిక్