KCR Comments : సిట్టింగ్ MLAలు జాగ్రత్తగా పని చేసుకోవాలి... వంద సీట్లు గెలుస్తామన్న కేసీఆర్-kcr key comments in brs formation day celebrations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr Key Comments In Brs Formation Day Celebrations

KCR Comments : సిట్టింగ్ MLAలు జాగ్రత్తగా పని చేసుకోవాలి... వంద సీట్లు గెలుస్తామన్న కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Apr 27, 2023 03:21 PM IST

BRS Formation Day 2023: మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేదే ప్రాధాన్యతాంశమని చెప్పారు. బీఆర్ఎస్ అవిర్భావ వేడుకల్లో ప్రసంగించిన ఆయన... పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్
కేసీఆర్

KCR Speech at BRS Formation Day: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు కేసీఆర్. గురువారం ఉదయం తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన.. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ముందుగా పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపీ కే. కేశవరావు ప్రసంగంతో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

ఇక పార్టీ అధినేత కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేసిన క్రమాన్ని వివరించారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయగలిగామన్నారు. అదే పంథాలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని అన్నారు. అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలని చెప్పారు. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటామన్న ఆయన... మార్క్ ఫెడ్ కు ఈ మేరకు ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని అన్నారు.

వంద సీట్లు గెలుస్తాం…

“దేశ జీఎస్డీపిలో వ్యవసాయరంగం వాటా 23 శాతం. కొన్నిగ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి సర్వే నెంబర్ వేసి నా ఆఫీసులో ఇవ్వండి. ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా వుంటే వాటిని తక్షణం పంచేద్దాం. మన శాసనసభ్యులు లేని చోట జెడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇంఛార్జీలుగా ఉపయోగించుకోవాలి. ఈ 3,4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. మన మంత్రులు పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518. ఇది మనకన్నా లక్ష రూపాయలు తక్కువ. ఇంతకన్నా తక్కువ రాష్ట్రాలు 16, 17 వున్నాయి. తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక అనేక రాష్ట్రాల మోడల్స్ తెప్పిచ్చి మనం ఎలా ముందుకుపోవాలని మేథోమదనం చేశాం. తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును దాటవేసి ముందుకు పోతున్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదు. మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. కానీ తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదు..? మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తాం” అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఇక నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేశారు కేసీఆర్. "పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి. క్యాడర్ లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టండి.షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తాం. బాగా పనిచేసిన వారికే టికెట్లు ఇస్తాం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టం. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం. ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్... బట్ బై చాయిస్. దూపయినప్పుడు బావి తవ్వుతాం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదు. బీఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టివి యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చు.అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టివి ఛానల్ ను కూడా నడపవచ్చు" అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం