BRS in AP: కీలక నేతలపై బీఆర్ఎస్ ఫోకస్! ఆ భేటీ వెనుక వ్యూహం ఉందా..?
బీఆర్ఎస్ విస్తరణ పై ఫోకస్ పెట్టారు కేసీఆర్. ఏపీ నుంచి చేరికలు కూడా నడుస్తున్నాయి. కొందరు ముఖ్య నేతలు ఇప్పటికే గులాబీ కండువా కప్పేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీకి చెందిన మరో ఇద్దరు కీలక నేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.
BRS Expand in Andhrapradesh: బీఆర్ఎస్... ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్..! ఎవరూ ఊహించని విధంగా ఏపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ పరిణామం తెలుగు రాజకీయాల్లో తెగ చర్చకు కూడా దారి తీసింది. మరోవైపు కేసీఆర్ టార్గెట్ గా వైసీపీ, కాంగ్రెస్ పార్టీలే కాదు మరిన్ని పక్షాలు కూడా కాస్త ఘాటుగానే స్పందించాయి. రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్... ఏపీలో పార్టీని ఎలా విస్తరిస్తారని కూడా ప్రశ్నించాయి. ఇక పవన్ వంటి నేతలు స్వాగతించారు. కేసీఆర్ - జగన్ వ్యూహంలో భాగంగానే పలువురు ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరారనే వాదన కూడా బలంగా తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా విశాఖ వేదికగా జరిగిన ఈ భేటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. దీనిపై రకరకాలుగా ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
త్వరలోనే ఏపీ వేదికగా ఓ సభను కూడా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను ఖరారు చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్... విశాఖ వేదికగా ఇద్దరు ముఖ్య నేతలతో గురువారం భేటీ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ జేడీ లక్ష్మీ నారాయణతో సమావేశం కావటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరు కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా..? అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. వీరి భేటీకి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజా భేటీపై వస్తున్న వార్తలను జేడీ లక్ష్మీనారాయణ కొట్టిపారేశారు. బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లనున్నారనే వార్తలను ఖండించారు. ఎమ్మెల్యే వివేకానంద ఓ పెళ్లిలో కలిశారని.. ఇంటికి ఆహ్వానిస్తే వచ్చారని ఆయన చెప్పారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే నిజానికి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లోకి రావటం... ఆయనకే ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వటం కూడా కేసీఆర్ వ్యూహంలో భాగమనే చర్చ జోరుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో కీలకమైన కాపు నేతలను తమ వైపు తిప్పుకోవటంలో ఈ పరిణామం వర్కౌట్ అవుతుందన్న కోణంలోనే తోట చంద్రశేఖర్ ను బాధ్యతలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వివేకానంద... గంటాను కలవటం... అందులోనూ గంటా కాపు సామాజికవర్గానికి చెందిన బలమైన నేత కావటం.. ఆయా వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న గంటా... పెద్ద పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. రాజకీయాల్లో కూడా కాస్త సైలెంట్ గానే ఉన్నారు. జనసేన లేదా వైసీపీలోకి వెళ్తారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అలా జరగలేదు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో భేటీ కావటం మాత్రం అత్యంత ఆసక్తిని రేపినట్లు అయిందనే చెపొచ్చు. దీని వెనక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఇక తాజా వార్తలపై గంటా ఎలా స్పందిస్తారనే కూడా చూడాలి. అయితే తాజా భేటీని సదరు నేతలు కొట్టిపారేసినప్పటికీ… తెర వెనక మాత్రం పక్కా వ్యూహంతో పాటు మంత్రంగా నడిపే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా సరిహద్దు రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్న బీఆర్ఎస్… విస్తరణ దిశగా వేగంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. నాందేడ్ వేదికగా భారీ బహిరంగ సభను తలపెట్టబోతుంది. ఆ తర్వాత ఏపీలోనే సభ ఉండొచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి. నిజానికి ఓ వ్యూహం లేకుండా ఏ పని చేయని కేసీఆర్.. ఓ అడుగు ముందుకేస్తున్నారంటే… బలమైన కారణాలు ఉండే ఉంటాయన్న వాదన గట్టిగా తెరపైకి వస్తోంది.
సంబంధిత కథనం
BRS in Karnataka: కన్నడ రాజకీయాల్లో బీఆర్ఎస్ చిచ్చు! నిజమేనా..?
January 25 2023
BRS in AP : ఏపీలో బీఆర్ఎస్.. ఆ పార్టీల వైఖరి తేలినట్లేనా ?
January 08 2023