Bathukamma 2022 date: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ(bathukamma) పండుగకు సర్వం సిద్ధమవుతోంది. బతుకమ్మ పండగ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ తదితర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
'ఈనెల 25 తేదీనుండి అక్టోబర్ 3వ తేదీ వరకు బతుకమ్మ పండగ ఉంటుంది. సద్దుల బతుకమ్మ(saddula bathukamma) జరిగే అక్టోబర్ 3వ తేదీన ట్యాంక్ బండ్(tank bund) వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలి. ప్రధానంగా బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్డు రిపేర్ వర్క్స్ వెంటనే చేపట్టాలి. ఈ సారి మహిళలు ఉత్సవాలలో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలి. బతుకమ్మలను నిమ్మజ్జనం చేసే ప్రాంతాల్లో ఏవిధమైన ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించాలి బతుకమ్మ పండగ పై ఆకర్షణీయమైన డిజైన్ లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలి.' అని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
ఎల్బీ స్టేడియం(lb stadium), నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగో లను ఏర్పాటు చేయాలని సోమేశ్ కుమార్ చెప్పారు. నిర్వహణ ఏర్పాట్లు కూడా ఘనంగా ఉండాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వాహణ, ట్యాంక్ బండ్ వద్ద విద్యుత్ దీపాలంకరణ, బారికేడింగ్, తాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్స్ సరఫరా, మొబైల్ టాయిలెట్స్, నిరంతర విద్యుత్ సరఫరా వంటివి చూసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాల లైవ్ టెలికాస్ట్ ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు.
Bathukamma 2022 date: బతుకమ్మ ఉత్సవాలు మన రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనవని ఏర్పాట్లను ఘనంగా చేయాలని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధికారులకు సూచించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25 వతేది నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. అందులో భాగంగా బతుకమ్మ ఉత్సవాలు కూడా అదే రోజున ప్రారంభం అవుతాయని చెప్పారు. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. అక్టోబర్ 3 వతేదిన జరిగే సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించాలన్నారు.