TS Legislative Council Deputy Chairman: డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాశ్ ఎన్నిక-banda prakash unanimously elected deputy chairman of telangana legislative council ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Banda Prakash Unanimously Elected Deputy Chairman Of Telangana Legislative Council

TS Legislative Council Deputy Chairman: డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాశ్ ఎన్నిక

HT Telugu Desk HT Telugu
Feb 12, 2023 01:22 PM IST

MLC Banda Prakash: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం ఒక్కటే నామినేషన్ రావటంతో… ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ కు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు అభినందనలు తెలిపారు.

సీఎం కేసీఆర్ తో బండా ప్రకాశ్
సీఎం కేసీఆర్ తో బండా ప్రకాశ్

Deputy Chairman of Telangana Legislative Council: శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్మన్ పదవికి శనివారం బండా ప్రకాశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మినహా ఎవరూ కూడా ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో బండా ప్రకాశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఆదివారం శాసనమండలి ప్రారంభమైన తర్వాత చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఎన్నిక పూర్తి అయిన తర్వాత.. ఆయనను సీఎం కేసీఆర్ స్వయంగా సీట్లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులతో పాటు... ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్ కు శుభకాంక్షలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బండా ప్రకాశ్.. 1981లో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2017లో టీఆర్‌ఎస్‌కు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనూహ్యంగా ఆయన రాజీనామా చేయటంతో... ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పేరును మండలి డిప్యూటీ ఛైర్మన్​ అభ్యర్థిగా అధినాయకత్వం ఖరారు చేసింది. ఇక శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ పదవీకాలం 2021, జూన్‌ 3న పూర్తి అయిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉన్నది. ఈనేపథ్యంలో డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ఆదివారంతో పూర్తి చేశారు.

విప్ ల నియామకం…

శాసన మండలిలో చీఫ్ విప్, విప్ లను ఖరారు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద రావు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమితులయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డిలు ప్రభుత్వ విప్ లుగా నియమితులయ్యారు. ఈ నియామకాలు ఫిబ్రవరి 11 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులైన వీరు.. మంత్రి కేటీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అయ్యే రెండు స్థానాలను భర్తీ చేయనున్నారు. మార్చి 29తో సభ్యుల పదవీ కాలం పూర్తి కానుండటంతో కొత్త వారి ఎన్నికకు షెడ్యూల్ ఖరారు చేశారు. స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేసే సభ్యుల పదవీ కాలం మే 1వరకు ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీ అయ్యే మూడు పట్టభద్రుల నియోజక వర్గాలతో పాటు రెండు ఉపాధ్యాయ నియోజక వర్గాలను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పాటు ఎనిమిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను కూడా భర్తీ చేస్తారు.

తెలంగాణలో మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న కాతేపల్లి జనార్థన్ రెడ్డి పదవీ కాలం కూడా ముగియనుంది. తెలంగాణలోని హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఉన్న సయ్యద్ అమిన్ ఉల్ హసన్ జఫ్రీ పదవీ కాలం ముగిసింది. త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల శాసన మండళ్లలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24వరకు గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మార్చి 21నాటికి ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు.

IPL_Entry_Point