KCR In Nanded : బీఆర్ఎస్ వస్తే.. దేశంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు-cm kcr speech in nanded brs party public meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Speech In Nanded Brs Party Public Meeting

KCR In Nanded : బీఆర్ఎస్ వస్తే.. దేశంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు

HT Telugu Desk HT Telugu
Feb 05, 2023 04:23 PM IST

KCR Nanded Speech : తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతా రావాల్సి ఉందని బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. రైతు సర్కార్ వ‌స్తేనే దేశంలో మార్పు వ‌స్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే.. రెండు సంవత్సరాల్లో మహారాష్ట్రలోనూ 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారు.

నాందేడ్ సభలో కేసీఆర్
నాందేడ్ సభలో కేసీఆర్

మహారాష్ట్ర నాందేడ్‌లోని గురుగోవింద్‌ సింగ్‌ గ్రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రెండో భారీ బహిరంగ సభ కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సభలో కేంద్రంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. మేకిన్‌ ఇండియా జోకిన్‌ ఇండియాగా మారిందని కేసీఆర్ అన్నారు. 54 ఏళ్లు సంవత్సరాలు దేశాన్ని కాంగ్రెస్‌, 16 సంవత్సరాలు బీజేపీ పార్టీలు పాలించాయని గుర్తు చేశారు. రెండు పార్టీలు ఏం సాధించాయని అడిగారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలు పరస్పరం అవినీతి ఆలోచనలు చేసుకుంటున్నాయని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

'వెనుకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణం. ఒకరు అంబానీ అంటే మరొకరు ఆదానీ అంటారు. చిన్న చిన్న పట్టణాల్లోనూ చైనా బజార్లు ఎందుకు వచ్చాయి. మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు, చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయి. దేశమంతా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయి. చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలి. నాందేడ్ లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో.. లెక్కబెట్టారా? ప్రధాని మన్‌కీ భారత్‌ పేరుతో ప్రజలను వంచిస్తున్నారు. ఇది రాజకీయం కాదు ఇది జీవన్మరణ సమస్య.' అని కేసీఆర్ అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ చిన్న దేశమైన జింబాబ్వేలో ఉందని కేసీఆర్ అన్నారు. చాలా దేశాల్లో ఐదు వేల టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. మన దేశంలో ప్రాజెక్టులు లేవని కేసీఆర్ అన్నారు. ఇంత విశాలమైన దేశంలో కనీసం రెండు వేల టీఎంసీల రిజర్వాయర్ ఎందుకు లేదని అడిగారు. దేశంలో రిజర్వాయర్ల కంటే.. జల వివాదాలు, ట్రిబ్యునళ్లు పెరిగిపోయాయని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. 'తెలంగాణతో మహారాష్ట్రది రోటీ - భేటీ బంధం. నిత్యం తెలంగాణకు వచ్చే వాళ్లు ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. తెలంగాణ రైతు బీమాతో కుటుంబాలకు భరోసా దొరికింది. మహారాష్ట్రలో అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం కావాలి. తెలంగాణలో ఏం సాధ్యమయ్యాయో.. మహారాష్ట్రలో కూడా అమలు కావాలి. దళితబందు దేశమంతా అమలు కావాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ సర్కార్ రాగానే దేశంలో ప్రతి దళిత కుటంబానికి 10 లక్షలు అందజేస్తాం. యుద్ధం చేయాలి.. తర్వార్లు తిప్పాలి.. అని చెప్పడం లేదు. కేవలం ఒక్క బటన్ నొక్కండి.. దేశమంతా మారిపోతుంది.' అని కేసీఆర్ అన్నారు.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని నినదించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు వస్తే.. ఆవేదన ఉంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందో ఆలోచించాలని చెప్పారు.

అంతకుముందు.. కేసీఆర్ నాందేడ్ లోని చారిత్రక గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురుద్వారా బయట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిక్కు మత గురువులతో కలసి ఫొటోలు దిగారు. అక్కడ నుంచి సభకు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో నాందేడ్ వాసులు చేరారు. నాందేడ్ జిల్లాకు చెందిన పలు గ్రామాల సర్పంచ్ లు, యువకులు గులాబీ పార్టీ కండవా కప్పుకొన్నారు. నాందేడ్‌ స‌భా వేదికపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మ‌ర‌ఠా యోధుల‌కు కేసీఆర్ పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు.

IPL_Entry_Point