TS Legislative Council Deputy Chairman: బండా ప్రకాశ్ నామినేషన్.. ఎన్నిక లాంఛనమే!-brs mlc banda prakash files nomination for telangana legislative council deputy chairman ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Legislative Council Deputy Chairman: బండా ప్రకాశ్ నామినేషన్.. ఎన్నిక లాంఛనమే!

TS Legislative Council Deputy Chairman: బండా ప్రకాశ్ నామినేషన్.. ఎన్నిక లాంఛనమే!

HT Telugu Desk HT Telugu
Feb 11, 2023 01:48 PM IST

Deputy Chairman for Telangana Legislative Council: శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థిగా బండా ప్రకాశ్ ను ప్రకటించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. దీంతో ఆయన ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు.

బండా ప్రకాశ్ నామినేషన్
బండా ప్రకాశ్ నామినేషన్

Telangana Legislative Council Deputy Chairman: తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బండా ప్రకాశ్ పేరు ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులతో కలిసి బండా ప్రకాశ్... అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావ్, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన తర్వాత డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్ కు దక్కటం ఖాయమనే చెప్పొచ్చు. నిజానికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ ముదిరాజ్ అనంతరం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన పేరును మండలి డిప్యూటీ ఛైర్మన్​గా అధినాయకత్వం ఖరారు చేసింది. మరోవైపు మండలిలో బీఆర్ఎస్ కు మెజార్టీ సభ్యులు ఉండటంతో.. బండ ప్రకాశ్‌ ఎన్నిక లాంఛనమే కానున్నట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న చీఫ్‌విప్‌తో పాటు, విప్‌ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం.

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ పదవీకాలం 2021, జూన్‌ 3న పూర్తి అయిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉన్నది. ఈనేపథ్యంలో డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడింది.

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

MLC Elections in Telugu States: మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అయ్యే రెండు స్థానాలను భర్తీ చేయనున్నారు. మార్చి 29తో సభ్యుల పదవీ కాలం పూర్తి కానుండటంతో కొత్త వారి ఎన్నికకు షెడ్యూల్ ఖరారు చేశారు. స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేసే సభ్యుల పదవీ కాలం మే 1వరకు ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీ అయ్యే మూడు పట్టభద్రుల నియోజక వర్గాలతో పాటు రెండు ఉపాధ్యాయ నియోజక వర్గాలను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పాటు ఎనిమిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను కూడా భర్తీ చేస్తారు.

తెలంగాణలో మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న కాతేపల్లి జనార్థన్ రెడ్డి పదవీ కాలం కూడా ముగియనుంది. తెలంగాణలోని హైదరాబాద్ లోకలబాడీ ఎమ్మెల్సీగా ఉన్న సయ్యద్ అమిన్ ఉల్ హసన్ జఫ్రీ పదవీ కాలం ముగిసింది. త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల శాసన మండళ్లలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24వరకు గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మార్చి 21నాటికి ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు.

IPL_Entry_Point