TSPSC : పేపర్ లీక్ కేసులో మరో 13 మంది డిబార్.. పరీక్షలు రాయకుండా చర్యలు-13 more candidates debarred in tspsc paper leak case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  13 More Candidates Debarred In Tspsc Paper Leak Case

TSPSC : పేపర్ లీక్ కేసులో మరో 13 మంది డిబార్.. పరీక్షలు రాయకుండా చర్యలు

Maheshwaram Mahendra Chary HT Telugu
May 31, 2023 09:02 PM IST

TSPSC Latest News: పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారిపై టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 37 మందిని డిబార్ చేయగా… మరో 13 మందిని భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా నిర్ణయం తీసుకుంది.

 పేపర్ లీక్ కేసులో మరో 13 మంది డిబార్
పేపర్ లీక్ కేసులో మరో 13 మంది డిబార్

TSPSC Paper Leak Case Updates: టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్స్‌(TSPSC Paper Leak) వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా... మరికొందరిని విచారిస్తోంది. తవ్వేకొద్ది అక్రమాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే… కేసులో నిందితులుగా ఉన్న వారిపై కమిషన్ చర్యలు చేపట్టే పనిలో పడింది. ఇప్పటికే 37 మందిని డిబార్ చేయగా.. తాజాగా మరో 13 మందిపై కూడా చర్యలు తీసుకుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని నిర్ణయించింది. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని 13 మందికి నోటీసులు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

మరో 13 మంది అభ్యర్థులపై టీఎస్పీఎస్సీ వేటు
మరో 13 మంది అభ్యర్థులపై టీఎస్పీఎస్సీ వేటు

కమిషన్ పేర్కొన్న జాబితాలో పూల రవి కిశోర్, రాయపుర విక్రమ్, రాయపురం దివ్య ధనావత్ భరత్ నాయక్, పశికంటి రోహిత్ కుమార్, గాదె సాయి మధు, లోకిని సతీష్ కుమార్, బొడ్డుపల్లి నర్సింగ్ రావు, గుగులోత్ శ్రీను నాయక్, భూక్య మహేష్, మూఢావత్ ప్రశాంత్, వదిత్యా నరేష్, పూల రమేష్ కుమార్ పేర్లు ఉన్నాయి. కమిషన్ నిర్ణయం కారణంగా భవిష్యత్తులో వీరంతా పరీక్షలు రాయలేరు. ఇదిలా ఉంటే… మరికొందరిపై కూడా కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది. ఓవైపు సిట్ దూకుడుగా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో… మరికొంత మంది పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే వారిపై కూడా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు మొత్తం 50 మంది అభ్యర్థులు డిబార్ అయ్యారు.

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో దర్యాప్తు సాగేకొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ మార్గంలో పేపర్ సంపాదించిన అభ్యర్థులు.. సమాధానాలు తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగించినట్లు సిట్ గుర్తించింది. లీకేజీకి పాల్పడిన అభ్యర్థులు ChatGPT ను వినియోగించినట్లు విచారణలో తేలింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం పేపర్లు కాపీ చేసిన తర్వాత నిందితులలో ఒకరు సమాధానాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతను ఉపయోగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ముగ్గురు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పరీక్షా కేంద్రంలోకి రాగా ఏఐ టెక్నాలజీ ద్వారా సమాధానాలను గుర్తించి వారికి పంపిణీ చేసినట్లు గుర్తించారు.

పెద్దపల్లిలో డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పూల రమేష్ (35)ను సిట్ అరెస్టు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ లీక్ అయిన మూడు ప్రశ్న పత్రాలను కాపీ చేసి, వాటిలో రెండింటికి సమాధానాలు పొందడానికి ChatGPT టెక్నాలజీని వినియోగించాడని సిట్ గుర్తించింది. జనవరి 22, ఫిబ్రవరి 26న నిర్వహించిన రెండు పరీక్షలకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు ఈ సమాధానాలు అందించడానికి రమేష్ ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఏడుగురు బ్లూ టూత్ చెవిలో పెట్టుకుని పరీక్ష హాల్ కు వచ్చారు. పరీక్ష మొదలైన 10 నిమిషాల తర్వాత ఎగ్జామినర్ పేపర్ల ఫోటోలను తీసి రమేష్‌కు పంపినట్లు సిట్ తేల్చింది. మరో చోట తన నలుగురు స్నేహితులతో కూర్చున్న రమేష్, సరైన సమాధానాల కోసం చాట్‌ జీపీటీని ఉపయోగించాడు. ఆన్సర్స్ ను అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఏడుగురు ఒక్కొక్కరు అర్హత సాధించేందుకు రూ.40 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారని సిట్ అనుమానిస్తుంది. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు రమేశ్‌కు చాట్‌జీపీటీ ఉపయోగించాల్సిన అవసరం రాలేదని, ముందే లీకైన పేపర్ ను పూల రవికిషోర్ నుంచి అందినట్లు సిట్ తేల్చింది. ఈ ప్రశ్నపత్రాన్ని రమేష్ 30 మందికి పైగా 25 లక్షల నుంచి 30 లక్షలకు అమ్మినట్లు పోలీసుల విచారణలో తెలిసినట్లు సమాచారం.

IPL_Entry_Point

సంబంధిత కథనం