Tspsc Paper Leak: పేపర్‌ లీక్‌ కేసులో 37మంది డిబార్.. పరీక్షలు రాయకుండా ఆంక్షలు-tspsc has debarred the paper leak case accused from appearing in future exams ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Paper Leak: పేపర్‌ లీక్‌ కేసులో 37మంది డిబార్.. పరీక్షలు రాయకుండా ఆంక్షలు

Tspsc Paper Leak: పేపర్‌ లీక్‌ కేసులో 37మంది డిబార్.. పరీక్షలు రాయకుండా ఆంక్షలు

HT Telugu Desk HT Telugu
May 31, 2023 06:15 AM IST

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో నిందితులపై కమిషన్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో అక్రమ పద్ధతుల్లో ప్రశ్నాపత్రాలు పొందిన 37మంది భవిష్యత్తులో ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేసింది. వారిని బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నట్లు ప్రకటించింది.

పేపర్ లీక్ కేసులో నిందితుల డిబార్
పేపర్ లీక్ కేసులో నిందితుల డిబార్

Tspsc Paper Leak: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు చేపట్టింది. నిందితులు భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలకు హాజరు కాకుండా ఆంక్షలు విధించింది. పేపర్ లీక్ కేసులో ఓవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుండగానే కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌ ఇప్పటివరకు అరెస్ట్‌ చేసిన 37 మందిని డిబార్‌ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.

పేపర్‌ లీక్‌ కేసులో ప్రధాన నిందితుడు పులిదండి ప్రవీణ‌ కుమార్‌‌తో పాటు, అట్ల రాజశేఖర్ రెడ్డి, రేణుక రాథోడ్, లావడ్యావత్‌ డాక్యా, కె.రాజేశ్వర్, కె. నీలేశ్ నాయక్, కె.శ్రీనివాస్, కె.రాజేంద్రనాయక్, షమీమ్, ఎన్.సురేష్, డి.రమేష్ కుమార్, ఎ.ప్రశాంత్‌ రెడ్డి, టి.రాజేంద్రకుమార్‌, డి.తిరుపతయ్య, సాన ప్రశాంత్, వై.సాయిలౌకిక్, ఎం.సాయిసుష్మిత, కోస్గి వెంకటజనార్థన్, కోస్గి మైబయ్య, కోస్గి రవి, కోస్గి భగవత్‌ కుమార్‌, కొంతం మురళీధర్‌ రెడ్డి, ఆకుల మనోజ్‌కుమార్‌, ఆదిసాయిబాబు, పొన్నం వరుణ్ కుమార్‌, రమావత్ మహేశ్‌, ముదావత్ శివకుమార్, దానంనేని రవితేజ, గున్‌రెడ్డి క్రాంతికుమార్ రెడ్డి, కొంతం శశిధర్ రెడ్డి, అట్ల సుచరిత రెడ్డి, జి.పి.పురేందర్, నూతన్ రాహుల్ కుమార్, లావడ్యా శాంతి, రమావత్ దత్తు, అజ్మీరా పృధ్వీరాజ్, జాదవ్ రాజేశ్వర్‌లపై వేటు వేసింది.

నోటిఫికేషన్‌లోని నిబంధనలను అనుసరించి లీకేజీ కేసులో ప్రమేయమున్న వారు భవిష్యత్తులో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయకుండా నిషేధం విధించినట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై నమోదైన క్రైమ్‌ నంబర్లు 64/2023, 95/2023 ఆధారంగా దర్యాప్తు క్రమంలో ఆయా అభ్యర్థుల ప్రమేయమున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతోపాటు వారిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం విషయంలో ఆయా అభ్యర్థులు ఏమైనా చెప్పదలుచుకుంటే రెండు రోజుల్లోగా తమను సంప్రదించి వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ చరిత్రలో అభ్యర్ధులను మూకుమ్మడి డిబార్‌ చేయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

మరికొందరిపై వేటు పడే అవకాశం….

ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ 37 మందిని డిబార్‌ చేసినట్లు ప్రకటించింది. ఈ కేసులో సిట్‌ ఇప్పటికే 45 మందిని అరెస్ట్‌ చేసింది. దీనికితోడు అరెస్టుల సంఖ్య వంద దాటే అవకాశముందని హైదరాబాద్‌ నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం పేర్కొన్నారు. తొలుత రేణుక అనే ఉపాధ్యాయురాలు సహా తొమ్మిది మందిని అరెస్ట్‌ చేయడంతో లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది.

దర్యాప్తు క్రమంలో కమిషన్‌ ఉద్యోగులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి, షమీమ్‌, సురేశ్‌, రమేశ్‌ల పాత్ర ఉన్నట్లు తేలింది. ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు తేలిన అభ్యర్థిని సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుంటే కొత్త పేర్లు బయటికొస్తున్నాయి. ఇలా తీగలాగే కొద్దీ డొంక కదులుతుండటంతో సిట్‌ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.

పేపర్‌ లీకేజీకి లీకేజీకి పాల్పడినవారి సంఖ్య రెండు వందలకు చేరొచ్చని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. టీఎస్‌పీఎస్సీ వర్గాలు తాజా నిర్ణయం తీసుకునే సమయానికి తొలుత అరెస్టయిన 37 మంది జాబితాయే వారి వద్ద ఉండటంతో ఆ మేరకే డిబార్‌ చేసినట్లు తెలుస్తోంది. సిట్‌ తదుపరి చేసే అరెస్టుల ఆధారంగా మిగిలిన వారిని కూడా డిబార్‌ చేసే అవకాశం ఉంది.

IPL_Entry_Point