Yash Dayal: యశ్ దయాల్‌పై ఎవరూ సానుభూతి చూపలేదు.. ఇంతకంటే దారుణం ఇక చూడలేవని చెప్పాను!-yash dayal will bounce back stronger says rahul tewatia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Yash Dayal Will Bounce Back Stronger Says Rahul Tewatia

Yash Dayal: యశ్ దయాల్‌పై ఎవరూ సానుభూతి చూపలేదు.. ఇంతకంటే దారుణం ఇక చూడలేవని చెప్పాను!

Hari Prasad S HT Telugu
Apr 14, 2023 12:31 PM IST

Yash Dayal: యశ్ దయాల్‌పై ఎవరూ సానుభూతి చూపలేదని, ఇంతకంటే దారుణం ఇక చూడలేవని అతనితో చెప్పినట్లు గుజరాత్ టైటన్స్ బ్యాటర్ రాహుల్ తెవాతియా చెప్పాడు.

గుజరాత్ టైటన్స్ టీమ్
గుజరాత్ టైటన్స్ టీమ్ (IPL)

Yash Dayal: ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ లలో ఒకటి ఈ మధ్య కేకేఆర్, జీటీ మధ్య జరిగింది. ఆ మ్యాచ్ లో చివరి ఐదు బాల్స్ ను ఐదు సిక్స్ లుగా మలచి కేకేఆర్ ను గెలిపించాడు రింకు సింగ్. అయితే ఆ ఓవర్ వేసిన యశ్ దయాల్ పరిస్థితి దారుణంగా మారింది. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న బౌలర్ మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి పరిస్థితిని బౌలర్లకు ఎన్నోసార్లు కల్పించి, ఐపీఎల్లో ఫినిషర్ గా ఎదుగుతున్న రాహుల్ తెవాతియాకు ఈ విషయం ఇంకా బాగా తెలుసు. అందుకే ఆ రోజు మ్యాచ్ ముగియగానే రాహుల్ పరుగెత్తుకుంటూ వెళ్లి యశ్ కు ధైర్యం నూరిపోశాడు. ఇప్పుడు కూడా యశ్ గురించి మాట్లాడుతూ.. ఒక్క మ్యాచ్ తో పోయేదేమీ లేదని, టీమంతా అతనికి అండగా ఉందని అతడు చెప్పాడు.

"మా ప్రధాన బౌలర్లలో అతడూ ఒకడు. మేము గత సీజన్ లో ఛాంపియన్లం. అందులో అతడు కీలకపాత్ర పోషించాడు. కొత్త బంతితోపాటు డెత్ ఓవర్లలోనూ బాగా బౌలింగ్ చేశాడు. ఒక్క మ్యాచ్ తో అతడి సేవలను మేము మరచిపోము. జట్టులోనూ అతనిపై ఎవరూ సానుభూతి చూపలేదు.

గుజరాత్ టైటన్స్ జట్టులో ఎవరూ నిన్ను తక్కువ చేసి చూడరని అతనితో నేను చెప్పాను. ఒక్క మ్యాచే అలా అయింది.. ప్రాక్టీస్ చేస్తూనే ఉండు. నీ అవకాశం కోసం చూడు.. నీ కెరీర్ లో ఇక ఇంత కంటే దారుణం నీవు మరొకటి చూడలేవు అని యశ్ తో నేను చెప్పాను" అని తెవాతియా వెల్లడించాడు.

ఆ మ్యాచ్ లో కేకేఆర్ గెలవాలంటే చివరి ఓవర్లో 29 పరుగులు అవసరమయ్యాయి. యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి ఉమేష్ యాదవ్ రన్ తీశాడు. ఇక ఆ తర్వాతి ఐదు బంతులను రింకు సింగ్ ఐదు సిక్సర్లుగా మలచి ఎవరూ ఊహించని విజయాన్ని కేకేఆర్ కు అందించాడు.

WhatsApp channel

సంబంధిత కథనం