GT vs SRH: గుజరాత్ టైటన్స్ జెర్సీ రంగు మారిపోయింది.. ఎందుకో తెలుసా?-gt vs srh in ahmedabad as gt in pink jerseys here is the reason ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gt Vs Srh: గుజరాత్ టైటన్స్ జెర్సీ రంగు మారిపోయింది.. ఎందుకో తెలుసా?

GT vs SRH: గుజరాత్ టైటన్స్ జెర్సీ రంగు మారిపోయింది.. ఎందుకో తెలుసా?

Hari Prasad S HT Telugu
May 15, 2023 07:45 PM IST

GT vs SRH: గుజరాత్ టైటన్స్ జెర్సీ రంగు మారిపోయింది. ఎందుకో తెలుసా? సన్ రైజర్స్ హైదరాబాద్ తో సోమవారం (మే 15) అహ్మదాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ కు ఆ టీమ్ పింక్ జెర్సీల్లో బరిలోకి దిగింది.

పింక్ జెర్సీలో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా
పింక్ జెర్సీలో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా

GT vs SRH: గుజరాత్ టైటన్స్ అనగానే గ్రే జెర్సీలు గుర్తుకొస్తాయి. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ తో సోమవారం (మే 15) జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం హార్దిక్ సేన పింక్ జెర్సీల్లో బరిలోకి దిగింది. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాత్రమే ప్రతి సీజన్ లో రెండేసి రంగుల జెర్సీలతో ఆడేది.

తాజాగా గుజరాత్ టైటన్స్ కూడా ఆ టీమ్ తో చేరింది. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జీటీ టీమ్ ఇలా పింక్ జెర్సీల్లో ఆడుతోంది. ప్రతి సీజన్ లో ఓ మ్యాచ్ లో ఇలా పింక్ జెర్సీల్లో దిగాలని గుజరాత్ టైటన్స్ నిర్ణయించింది. ఆర్సీబీ కూడా 2011 నుంచి ఇలా ప్రతి సీజన్ ఓ మ్యాచ్ తమ రెడ్, బ్లాక్ జెర్సీ కాకుండా గ్రీన్ జెర్సీల్లో బరిలోకి దిగుతోంది.

భూమిపై పచ్చదనాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఆర్సీబీ ఇలా చేస్తోంది. ఇక ఇప్పుడు జీటీ కూడా క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి ఇలా చేస్తోంది. ఈ కొత్త జెర్సీలతో మ్యాచ్ కు ముందే కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, అల్జారీ జోసెఫ్ లు ఫొటోలకు పోజులిచ్చారు. సొంత గ్రౌండ్ లో ఈ సీజన్ లో ఆడుతున్న చివరి మ్యాచ్ లో జీటీ ఇలా పింక్ జెర్సీల్లో బరిలోకి దిగింది.

అయితే ప్రతి ఏటా చివరి మ్యాచ్ లో ఇలా దిగుతుందా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. క్యాన్సర్ పై పోరుకు మద్దతుగా గుజరాత్ టైటన్స్ ఇలా కొత్త జెర్సీల్లో దిగుతోందని కెప్టెన్ హార్దిక్ చెప్పాడు.

WhatsApp channel

సంబంధిత కథనం