RCB Vs RR : చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. రాజస్థాన్​పై బెంగళూరు సూపర్ విక్టరీ-ipl 2023 rcb vs rr royal challengers bangalore won by 112 runs rajasthan bundled out for 59 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rcb Vs Rr : చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. రాజస్థాన్​పై బెంగళూరు సూపర్ విక్టరీ

RCB Vs RR : చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. రాజస్థాన్​పై బెంగళూరు సూపర్ విక్టరీ

Anand Sai HT Telugu
May 14, 2023 07:08 PM IST

RCB Vs RR : రాజస్థాన్ రాయల్స్ మీద బెంగళూరు జట్టు భారీ విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లు చెలరేగడంతో రాజస్థాన్ జట్టు కేవలం 59 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆర్సీబీ గెలుపు
ఆర్సీబీ గెలుపు (RCB)

ప్లే ఆఫ్స్ ఆసలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగి ఆడారు. దీంతో రాజస్థాన్ జట్టుపై ఆర్సీబీ 112 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి. మెుదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 59 పరుగులకే ఆలౌటైంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో మ్యాచ్‌ జరిగింది.

మెుదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 171 పరుగులు చేసింది. ఆరంభం నుంచి వికెట్ కాపాడుకుంటూ ధీమాగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాట్స్ మెన్ చివరి దశలో వేగం అందుకోవడంలో విఫలమయ్యారు. ఈరోజు కూడా మిడిలార్డర్ వైఫల్యాన్ని చూసింది జట్టు. పవర్‌ప్లే వరకు బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సమయంలో కెప్టెన్ ఫాఫ్ నిదానంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. మ్యాక్సీ 33 బంతుల్లో మూడు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అయితే మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ రెండు బంతులు ఎదుర్కొని వికెట్‌ను లొంగిపోయారు. చివరి ఓవర్లలో చెలరేగిన అనూజ్ రావత్ 11 బంతుల్లో రెండు సిక్సర్లతో 29 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు.

కెప్టెన్ డుప్లెసిస్(44 బంతుల్లో 55 పరుగులు : 3x4, 2x6), మాక్స్​వెల్​(33 బంతుల్లో 54 పరుగులు: 5x4, 3x6) అర్ధ సెంచరీ చేశారు. ఇక విరాట్ కోహ్లీ 18 పరుగులకే ఔట్ అయ్యాడు. లామ్​రోర్​(1), దినేశ్ కార్తీక్ డకౌట్​గా పెవిలియన్ చేరుకున్నారు. చివరిలో అనూజ్ రావత్ 29 పరుగులతో బాగా ఆడాడు. రాజస్థాన్‌ తరఫున జంపా, ఆసిఫ్‌లు రెండేసి వికెట్లు తీశారు.

ఆ తర్వాత లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టు మెుదటి నుంచి వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ 59 పరుగులే చేసింది. హిట్మెయర్ 35 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అతడికి తోడు జో రూట్ 10 పరుగులు చేసి రెండంకెల స్కోరుకు చేరుకున్నాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌ స్కోర్‌ చేయలేకపోయారు. జట్టులోని విజయవంతమైన ఓపెనింగ్ జోడీ జైస్వాల్, బట్లర్ ఇద్దరూ డకౌట్ కావడంతో జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆర్సీబీ బౌలర్లు ఎవరినీ క్రీజులో ఆడేందుకు అనుమతించలేదు.. చెలరేగిపోయారు. ఆర్సీబీ బౌలర్లలో పార్నెల్‌ 3, బ్రాస్‌వెల్ 2, కర్ణ్ శర్మ 2, సిరాజ్‌, మ్యాక్స్‌వెల్ ఒక్కో వికెట్ తీశారు.

ప్రస్తుతం ఆర్‌సీబీ భారీ విజయంతో రన్ రేట్ పెరిగింది. మ్యాచ్‌కు ముందు ఎనిమిదో స్థానంలో ఉన్న ఆ జట్టు ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చింది. ప్రస్తుతం ప్లే ఆఫ్ రేసుకు చేరువలో ఉన్న జట్టు.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే దాదాపు తర్వాతి దశలోకి అడుగుపెట్టే అవకాశం ఖాయం. అదే సమయంలో రాజస్థాన్‌కు మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండడంతో గెలవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంది.

టాపిక్