LIC IPO | ఎల్ఐసీ ఐపీఓ ‘ఫెయిల్’ అవ్వడం ఖాయమా?
ఎల్ఐసీ ఐపీఓ కోసం అందరు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఐపీఓ ఫెయిల్ అవుతుందేమోనని నిపుణులు అంటున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అవేటంటే..
Will LIC IPO fail | ఎల్ఐసీ ఐపీఓ కోసం దేశీయ మార్కెట్లు, పెట్టుబడిదారులు సహా ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దాదాపు ఏడాదిగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎల్ఐసీ ఐపీఓ ఎట్టకేలకు మే 4న ఓపెన్ కానుంది. మే 17న లిస్టింగ్ డేట్. ఐపీఓకు సంబంధించి అన్ని వివరాలు బయటకొచ్చాయి. ఇక ఇప్పుడు.. ఎల్ఐసీ ఐపీఓ సక్సెస్ అవుతుందా? అని మార్కెట్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అందుకు కారణాలు లేకపోలేదు!
మార్కెట్ షేరు..
బిమా రంగంలో 2000 వరకు మోనోపోలీ స్టేటస్‌ను అనుభవించింది ఎల్ఐసీ. ఆ తర్వాత ప్రైవేటు బీమా కంపెనీలు రావడం మొదలుపెట్టాయి. ఫలితంగా 2000లో 100శాతంగా ఉన్న ఎల్ఐసీ మార్కెట్ షేరు.. 22ఏళ్లల్లో సుమారు 64శాతానికి పడిపోయింది. రానున్న రోజుల్లో ఇంకెంత పతనం అవుతుందోనని పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.
మరోవైపు ఎఫ్వై16-21 మధ్య కాలంలో ఎల్ఐసీ.. 9శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందింది. అదే సమయంలో ప్రైవేటు బీమా సంస్థలు ఏకంగా 18శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ప్రభుత్వమే భారం..!
LIC IPO news | ఎల్ఐసీకి ఒక్కోసారి ప్రభుత్వమే భారంగా మారుతుంది! ఎల్ఐసీలో ప్రభుత్వానిదే పూర్తి వాటా. అందువల్ల ప్రభుత్వం ఏం చెబితే.. అది ఎల్ఐసీ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇది అనేకమార్లు జరిగింది.
2018లో.. భారత్ డైనమిక్స్, హిందుస్థాన్ ఎయిర్నాటిక్స్ వంటి ప్రభుత్వ సంస్థలు ఐపీఓకు వచ్చాయి. కానీ అవి పూర్తిగా సబ్‌స్క్రైబ్ అవ్వలేదు. ఫలితంగా ఎల్ఐసీని రంగంలోకి దింపి.. పూర్తి సబ్స్క్రిప్షన్ వచ్చేడట్టు చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా.. వ్యవస్థలో ఏదైనా సమస్య కనిపిస్తే.. దానిని పరిష్కరించేందుకు.. ప్రభుత్వం ఎప్పుడూ ఎల్ఐసీవైపే చూస్తుంది. భారీ నష్టాల్లో ఉన్న ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ 51శాతం వాటా కొనుగోలు చేసింది. అంటే.. రూ. 21,600కోట్లు పెట్టింది. 2019లో మరోసారు రూ. 4,743 కోట్లు పెట్టుబడిపెట్టింది. ఇది ప్రభుత్వం పనే.
నష్టాల్లో ఉన్న సంస్థలను ఆదుకోవడంలో తప్పులేదు. భవిష్యత్తులు మెరుగుపడి.. అవి లాభాలను కూడా చూసే అవకాశం ఉంది. కానీ.. వీటిని పెట్టుబడిదారులు పట్టించుకోరు! నష్టాల్లో ఉన్న కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెడితే.. సంస్థకు నష్టం కలుగుతుందని పెట్టుబడిదారులు భయపడవచ్చు.
ఎల్ఐసీ.. 'డిజిటల్' కాదు.
LIC digital sales | ప్రపంచదేశాలు సాంకేతికతవైపు పరుగులు తీస్తున్న రోజులివి. అందుకు తగ్గట్టుగానే సంస్థలు కూడా టెక్నాలజీని నమ్ముకుని వేగంగా వృద్ధి చెందుతున్నాయి. కానీ ఎల్ఐసీలో అలా జరగడం లేదు. ఎల్ఐసీకి బలమైన డిజిటల్ నెట్వర్క్ లేదు. 90శాతం పాలసీలన్నీ ఏజెంట్లే అమ్ముతారు. ఇక ప్రీమియమ్స్ను రినివల్ చేయించుకోవడంలో డిజిటల్ వాటా కేవలం 36శాతం. ప్రైవేటు సంస్థల్లో ఇది 90శాతంగా ఉండటం గమనార్హం. ఇదే కొనసాగితే ఎల్ఐసీకి కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేటు సంస్థల హవా..
ఎల్ఐసీకి చెందిన వీఎన్‌బీ(వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్) మార్జిన్ క్రమంగా పడిపోతోంది. 2021 సెప్టెంబర్‌లో 9.3శాతంగా ఉంది. ఎఫ్వై21లో అది 9.9శాతంగా ఉండేది. అదే సమయంలో లిస్టెడ్ బీమా కంపెనీలు ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీ ప్రుడెన్షియల్ లైఫ్, మ్యాక్స్ లైఫ్‌కు వీఎన్‌బీ 11-27శాతం ఉండటం గమనార్హం.
పాజిటివ్‌లు లేవా?
ఎల్ఐసీ ఐపీఓను ప్రభుత్వం అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లో తీసుకురావడం సానుకూల విషయం అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే.. ఈ ఐపీఓకు 'సబ్‌స్క్రైబ్' రేటింగ్ ఇస్తున్నారు.
కానీ అనేకమంది నిపుణులు మాత్రం ఎల్ఐసీ ఐపీఓపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు పూర్తిస్థాయిలో సబ్‌స్క్రైబ్ అవుతుందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఓకు దక్కే డిమాండ్‌ను పరిశీలించి అప్లై చేస్తే ఉత్తమం అని సూచిస్తున్నారు.
ఎల్ఐసీ ఐపీఓ వివరాలు..
- LIC IPO details | ప్రైజ్ బ్యాండ్:- రూ. 902- రూ. 949
- సబ్స్క్రిప్షన్ డేట్స్:- మే 4- మే 9
- పాలసీదారులకు డిస్కౌంట్:- రూ. 60/షేరు(ఏప్రిల్ 13కు ముందు పాలసీ తీసుకుని ఉండాలి)
- ఎల్ఐసీ ఉద్యోగులకు డిస్కౌంట్:- రూ. 45/ షేరు
- లిస్టింగ్:- 2022 మే 17
ఐపీఓ ద్వారా రూ. 21వేల కోట్లను ప్రభుత్వం సమీకరిస్తోంది. ఇందుకోసం 3.5శాతం వాటాను అమ్మకానికి పెట్టింది.
గ్రే మార్కెట్ ప్రీమియం పరిస్థితేంటి?
LIC IPO GMP | గురువారం రూ. 20గా ఉన్న ఎల్ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం.. శుక్రవారానికి రూ .72కు చేరింది. ఇక శనివారం ఎల్ఐసీ జీఎంపీ రూ. 92కు పెరిగింది.
ఐపీఓకు వచ్చే కంపెనీల షేర్లు తొలుత గ్రే మార్క్ట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. దీని బట్టి.. ఐపీఓ లాభాల్లో లిస్ట్ అవుతుందా? లేక నష్టాల్లో లిస్ట్ అవుతుందా? అని మార్కెట్ వర్గాలు అంచనాలు వేసుకుంటాయి. లిస్టింగ్ లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ట్రేడర్లు, పెట్టుబడిదారులు ఈ గ్రే మార్కెట్ ప్రీమియంను ఫాలో అవుతూ ఉంటారు.
(గమనిక: ఇది పూర్తిగా సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు. ఐపీఓలకు అప్లై చేసే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం
టాపిక్