ఎల్ఐసీ షేరు ధర రూ. 902- రూ. 949.. మే 4 నుంచి ఐపీఓ ఓపెన్!
ఇన్వెస్టర్లు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న `జీవిత బీమా సంస్థ ఐపీఓ(ఎల్ఐసీ- ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)`కు ముహూర్తం కుదిరింది. ఎల్ఐసీ ఐపీఓ మే 4న ఓపెన్ అవుతోంది. సాధారణ ఇన్వెస్టర్లు మే 4 నుంచి మే 9 వరకు బిడ్డింగ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఐ ప్రైస్ బ్యాండ్ రూ. 902 -రూ. 949 గా ఉండనుంది.
ఎల్ఐసీ ఐపీఎకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఐపీఓలో షేర్ ధర రూ. 902 - 949 మధ్య ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి రూ. 60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులకు రూ. 45 డిస్కౌంట్ లభిస్తుందని తెలిపాయి. రిటైల్ ఇన్వెస్టర్లు మే 4నుంచి మే 9 వరకు బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ మే 2 నుంచి అందుబాటులో ఉంటుంది. ఐపీఓ సైజ్‌ను ముందుగా 5%గా అనుకున్నప్పటికీ.. ఇప్పుడు దాన్నిఇంకా తగ్గించి 3.5 శాతంగా నిర్ధారిస్తూ ఎల్ఐసీ బోర్డు శనివారం నిర్ణయం తీసుకుంది. అంటే, ప్రభుత్వం తన వాటాను మొదట్లో 5% తగ్గించుకోవాలని అనుకున్నప్పటికీ.. తరువాత ఆ నిర్ణయం మార్చుకుని, 3.5% తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం తన వాటాలోని 3.5 శాతాన్నిరూ. 21 వేల కోట్లకు విక్రయించనుంది. ఒకవేళ 5% వాటాను విక్రయించదలచుకుంటే, ఐపీఓ సైజ్ రూ. 30 వేల కోట్లకు చేరుతుంది.
అతిపెద్ద ఐపీఓ
రూ. 21 వేల కోట్లయినా,లేక రూ. 30 వేల కోట్లయినా.. ఎల్ఐసీ ఐపీఓ భారతదేశ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఐపీఓ ద్వారా పేటీఎం సేకరించిన రూ. 18,300 కోట్లే ఇప్పటివరకు అతిపెద్ద మొత్తం. అంతకుముందు, 2010లో కోల్ ఇండియా రూ. 15,500 కోట్లు, 2008లో రిలయన్స్ పవర్ రూ. 11,700 కోట్లు సేకరించాయి. భారతదేశ అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ విలువ రూ. 6 లక్షల కోట్లుగా ఉంది. మొదట మార్చ్ నెలలోనే ఈ ఐపీఓను ఓపెన్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, అనుకోకుండా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమవడంతో ఈ పబ్లిక్ ఇష్యూని మే నెలకు వాయిదా వేసింది.
10% పాలసీదారులకు..
మొత్తం ఐపీఓ సైజ్‌లో 10% అంటే, 2.21 కోట్ల షేర్లను తమ పాలసీదారులకోసం ఎల్ఐసీ రిజర్వ్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే, 15 లక్షల షేర్లను తమ ఉద్యోగుల కోసం రిజర్వ్ చేశారని సమాచారం. ఈ షేర్లను మినహాయించిన తరువాత.. మిగతా షేర్లలో 50% షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు, 35 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు, మిగిలిన 15% షేర్లను నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు అలాట్ చేస్తారు.
రోడ్‌షోలు..
అర్హులైన ఇన్వెస్టర్లు, అనలిస్ట్‌లను నేరుగా కలిసేందుకు జీవిత బీమా సంస్థ తమ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో కలిసి త్వరలో ఆరు నగరాల్లో రోడ్ షోలను నిర్వహించనుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యేఈ రోడ్ షోలు ఢిల్లీ, బెంగళూరు,ముంబై, అహ్మదాబాద్, రాజ్‌కోట్, కోల్‌కతాల్లో నిర్వహిస్తారు. ఏప్రిల్ 27 నుంచి వారం పాటు ఈ రోడ్ షోలు ఉంటాయి. అలాగే, ఆన్‌లైన్ ప్రమోషన్ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు కూడా ఉంటాయని ఎల్ఐసీ వర్గాలు తెలిపాయి. ఎల్ఐసీ ఐపీఓకు లభించిన ప్రచారాన్ని గమనిస్తే.. ఈ ఐపీఓకు అద్భుతమైన స్పందన లభిస్తుందని భావిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్