Russia-Ukraine crisis | యుద్ధంపై తాజా స్థితి ఏంటి? ఏ దేశం ఏమంటోంది?
సైనిక చర్య ప్రారంభమైందని పుతిన్ ప్రకటించి ఇప్పటికే ఒక రోజు గడిచిపోయింది. రష్యాపై ఏ దేశ వైఖరి ఎలా ఉంది? ఐక్య రాజ్యసమితి ఏం చేయబోతోంది? రష్యాకు మద్దతుగా నిలిచిన దేశాలేవీ?
యురోపియన్ యూనియన్ నాయకులు ఆరు గంటలపాటు సమావేశమయ్యాక మూకుమ్మడిగా రష్యాపై రెండో దశ ఆర్థిక ఆంక్షలు పెట్టాలని నిర్ణయించారు.
ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించుకోవడం కోసం రష్యా కుంటి సాకులను చెబుతోందని ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు ఆరోపించారు. ఆంక్షలు రష్యా ప్రభుత్వాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు.
అంగీకరించిన ఆంక్షలకు సంబంధించిన చట్టపరమైన డాక్యుమెంట్లు పూర్తయ్యాక శుక్రవారం ఈయూ విదేశాంగ మంత్రులకు ఆమోదం కోసం సమర్పించనున్నారు.
ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ ఆంక్షల ప్యాకేజీలో రష్యా బ్యాంకింగ్ మార్కెట్‌లో 70 శాతం, ప్రభుత్వ యాజమాన్యంలోని కీలకమైన కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు.
రష్యా తన రిఫైనరీలను అప్‌గ్రేడ్ చేయడం అసాధ్యం చేయడం ద్వారా రష్యా ఇంధన రంగాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఆమె చెప్పారు. రష్యాకు సాఫ్ట్‌వేర్, సెమీకండక్టర్లు, విమానాల అమ్మకాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.
రష్యాకు చైనా జీవనాధారంగా నిలిచింది: ఆస్ట్రేలియా ప్రధాని
అడిలైడ్ (ఆస్ట్రేలియా): ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో వాణిజ్య ఆంక్షలను సడలించడం ద్వారా చైనా రష్యాకు జీవనాధారంగా నిలుస్తోందని ఆస్ట్రేలియా ప్రధాని ఆరోపించారు.
రష్యా గోధుమ దిగుమతులకు మద్దతు ఇస్తున్నట్టు గా చైనా ప్రకటించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో వచ్చిన నివేదికపై ప్రధాని స్కాట్ మారిసన్ శుక్రవారం స్పందించారు.
ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, జపాన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయని మోరిసన్ పేర్కొన్నారు. చైనా వాణిజ్య పరిమితులను సడలించడం అంగీకారయోగ్యం కాదని అన్నారు.
‘రష్యా మరొక దేశంపై దాడి చేస్తున్నప్పుడు మీరు మధ్యలో వెళ్లి రష్యాకు జీవ రేఖగా మారకండి..’ అని వ్యాఖ్యానించారు.
జపాన్ ఏమంటోంది?
టోక్యో: ఉక్రెయిన్‌పై దాడికి ప్రతిస్పందనగా జపాన్ రష్యాపై అదనపు ఆంక్షలు ప్రకటించింది.
రష్యాలోని రష్యా గ్రూపులు, బ్యాంకులు, వ్యక్తుల ఆస్తులను స్తంభింపజేయడం, రష్యా మిలిటరీ సంబంధిత సంస్థలకు సెమీకండక్టర్లు, ఇతర సున్నితమైన వస్తువుల ఎగుమతులను నిలిపివేయడం వంటివి కొత్త చర్యలలో ఉన్నాయని ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా శుక్రవారం తెలిపారు.
కిషిడా మాట్లాడుతూ ‘యథాతథ స్థితిని బలవంతంగా మార్చే ప్రయత్నాన్ని మేం ఎప్పటికీ సహించబోమని జపాన్ తన వైఖరిని స్పష్టంగా చూపిస్తుంది..’ అని అన్నారు. ఈ వారం ప్రారంభంలో జపాన్ రష్యన్ ప్రభుత్వ బాండ్ల పంపిణీని నిలిపివేసింది, రష్యా మిలిటరీకి నిధులను తగ్గించే లక్ష్యంతో ఈ పనిచేసింది. అలాగే రెండు ఉక్రేనియన్ వేర్పాటువాద ప్రాంతాలతో వాణిజ్యాన్ని కూడా నిషేధించింది.
రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో రష్యా స్వాధీనం చేసుకున్న ఉత్తర ద్వీపాలపై నియంత్రణను తిరిగి పొందేందుకు జపాన్ చాలా కాలం పాటు ప్రయత్నించింది.
ఖండన తీర్మానం ప్రవేశపెట్టనున్న ఐక్య రాజ్యసమితి
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దురాక్రమణను బలమైన పదజాలంతో ఖండించే తీర్మానంపై ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం ఓటు వేయనుంది. ఇది రష్యా దండయాత్రను తక్షణమే నిలిపివేయాలని, మొత్తం రష్యన్ దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయనుంది.
ఈ చర్యను రష్యా వీటో చేస్తుందని బైడెన్ పాలనాయంత్రాంగానికి తెలుసునని, అయితే రష్యా ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేలా నొక్కిచెప్పేందుకు తగిన తీర్మానాన్ని ఓటింగ్‌లో ఉంచడం చాలా ముఖ్యమని అమెరికా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
అసోసియేటెడ్ ప్రెస్‌కు అందిన సమాచారం ప్రకారం ముసాయిదా తీర్మానం ఇలా ఉంది. ‘అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన సరిహద్దులలో ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతకు కౌన్సిల్ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది..’ అని తీర్మానంలో ఉంటుంది.
అగ్ర రాజ్యం ఆగ్రహం..
వాషింగ్టన్: మూసివేసిన చెర్నాబెల్ అణు కర్మాగారంలోని సిబ్బందిని రష్యా సైనికులు బందీలుగా పట్టుకున్నారని ఉక్రెయిన్ అధికారుల ‘విశ్వసనీయ నివేదికల’పై వైట్ హౌస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి గురువారం మాట్లాడుతూ ‘మేం దానిని ఖండిస్తున్నాం. వారి విడుదలను మేం అభ్యర్థిస్తున్నాం..’ అని పేర్కొన్నారు.
చరిత్రలో అత్యంత ఘోరమైన అణు విపత్తు జరిగిన దశాబ్దాల తర్వాత కూడా రేడియోధార్మికత లీక్ అవుతున్న ప్లాంట్ స్థితిపై అమెరికాకు ఎలాంటి అంచనా లేదని సాకి చెప్పారు. కానీ బందీలుగా తీసుకోవడం అణు సదుపాయాన్ని కొనసాగించే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తుందని, ఇది భయంకరమైన పరిణామమని ఆందోళన వ్యక్తంచేశారు.
రష్యా దళాలు ఆ సదుపాయాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు చెర్నోబిల్ ప్లాంట్‌లోని సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారని ఉక్రెయిన్ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ సలహాదారు అలియోనా షెత్సోవా ఫేస్ బుక్‌లో రాసిన తర్వాత సాకి మాట్లాడారు.
సైనిక చర్య నిలిపివేయాలనే ఫోన్ చేశారు..
బ్రస్సెల్స్: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫోన్ చేసిన ఉద్దేశం.. సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేయడమేనని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయంలోని అధికారి ఒకరు చెప్పారు.
ఎలిసీ ప్యాలెస్‌లోని అధికారి ఇచ్చిన సమాచారం మేరకు రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలపై దృష్టి సారించే యూరోపియన్ యూనియన్ నాయకుల అత్యవసర సమావేశం ప్రారంభమయ్యే ముందు మాక్రాన్ గురువారం బ్రస్సెల్స్ నుండి పుతిన్‌తో మాట్లాడారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సంప్రదించిన తర్వాత మాక్రాన్ పుతిన్‌కు ఫోన్ చేసినట్లు ఆ అధికారి తెలిపారు.
‘రష్యా భారీ ఆంక్షలను ఎదుర్కొంటోంది’ అని మాక్రాన్ పుతిన్‌కు గుర్తు చేశారని అధికారి చెప్పారు. ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ ఆచరణకు అనుగుణంగా అధికారి అజ్ఞాతంగా మాట్లాడారు.
అయితే క్రెమ్లిన్ నివేదిక ప్రకారం.. పుతిన్, మాక్రాన్ తమ పరిచయాలను కొనసాగించడానికి అంగీకరించారని సమాచారం.
సంబంధిత కథనం
టాపిక్