Marriage at Bus stop: బస్టాప్ లో పెళ్లి చేసుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్
Marriage at Bus stop: మైనర్లైన ఇద్దరు స్టూడెంట్స్ బస్టాప్ లోనే పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడులో జరిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులురంగంలోకి దిగి కేసు నమోదు చేశారు.
Marriage at Bus stop: తమిళనాడు లోని కడలూరులో పాలిటెక్నిక్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి, తన 16 ఏళ్ల సహ విద్యార్థినికి కాలేజ్ బస్టాప్ లోనే తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. ఇతర విద్యార్థులు, బస్టాప్ లో ఉన్న ఇతరులు చూస్తుండగానే వారు పెళ్లి చేసుకున్నారు.
Marriage at Bus stop: చైల్డ్ మ్యారేజ్
ఈ వివాహాన్ని అక్కడే ఉన్న బాలాజీ అనే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. సమాచారం పోలీసులకు తెలియడంతో పెళ్లి చేసుకున్న విద్యార్థులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
Marriage at Bus stop: అబ్బాయి జువెనైల్ హోంకి.. అమ్మాయి కౌన్సెలింగ్ కి..
అనంతరం, మైనర్ కావడంతో అబ్బాయిని జువనైల్ హోంకి తరలించారు. అమ్మాయిని స్థానిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీస్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్యవివాహ నిషేధ చట్టం ప్రకారం పురుషుడికి 21 ఏళ్లు, స్త్రీకి 18 ఏళ్లు నిండకముందు వివాహం చేయడం నేరం. ఈ నేరానికి కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా ఉంటుంది.
Marriage at Bus stop: వీడియో సర్కులేట్ చేసిన వ్యక్తికి కూడా..
ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన బాలాజీ గణేశ్ అనే వ్యక్తి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై జువనైల్ జస్టిస్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ విమన్ హెరాస్మెంట్ యాక్ట్ లోని సంబంధిత సెక్షన్లతో పాటు, ఆ విద్యార్థులు ఇద్దరూ ఎస్సీలు కావడంతో ఎస్టీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.