Maharashtra Political Crisis: అర్ధరాత్రి వడోదరకు షిండే.. ఆ నేతతో రహస్య చర్చలు!
గౌహతి వేదిక తన క్యాంప్ తో మక్కాం వేసిన ఏక్ నాథ్ షిండ్.. వేగంగా పావులు కదిపే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా శనివారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో వడోదరకు వెళ్లినట్లు తెలుస్తోంది.
Maharashtra Crisis: మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం రోజుకో మలుపులు తిరుగుతోంది. షిండే సారథ్యంలో 40 మందికిపైగా రెబల్ ఎమ్మెల్యేలు గౌహతి వేదికగా మక్కాం వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు షిండే వర్గంపై శివసేన మాటల దాడిని కూడా పెంచేసింది. ఇవన్నీ ఇలా ఉంటే... ఎక్ నాథ్ షిండే మరో అడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి బీజేపీ నేతలతో రహస్య చర్చలు జరిపినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
వడోదర వేదికగా చర్చలు...!
గౌహతిలో ఉన్న ఏక్ నాథ్ షిండే.. ప్రత్యేక విమానాంలో శనివారం రాత్రి వడోదరకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో రహస్యం చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు నేతలు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
షిండే సారథ్యంలో నాలుగు రోజులుగా అసోంలోని గౌహతిలో హోటల్లో మకాం చేసిన 40 మందికి పైగా సేన రెబల్ ఎమ్మెల్యేలు తమది శివసేన (బాలాసాహెబ్) వర్గమని ప్రకటించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో పలు తీర్మానాలను ఆమోదించింది శివసేన పార్టీ జాతీయ కార్యవర్గం. తిరుగుబాటు వర్గం కూడా బాలాసాహెబ్ పేరును వాడుకుంటున్న నేపథ్యంలో.. బాల్ ఠాక్రే పేరు దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం, వేరే ఎవరు కూడా ఆ పేరును తమ రాజకీయ అవసరాలకు వాడకూడదని ఒక తీర్మానాన్ని ఈ సమావేశంలో ఆమోదించింది.
దాదాపు 38 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బృందంలో ఉన్న నేపథ్యంలో.. వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు అప్పగిస్తూ.. మరో తీర్మానాన్ని కూడా ఈ సమావేశంలో ఆమోదించారు. అలాగే, బాల్ ఠాక్రే పేరుతో పాటు పార్టీ పేరు, జెండాను కూడా వేరే ఎవరు వాడకూడదని కోరుతూ ఎన్నికల సంఘానికి శివసేన ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముంబైలో 144 సెక్షన్ విధించారు. పలువురు రెబల్ ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాల వద్ద భారీ నిరసనలకు, దాడులకు దిగారు. పలువురి కార్యాలయాలను ధ్వంసం చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో ముంబైలో జూలై 10 దాకా 144 సెక్షన్ విధించారు. ఉద్ధవ్ ఫిర్యాదు మేరకు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు పంపారు. సోమవారం సాయంత్రంలోగా స్పందించాలని ఆదేశించారు.
మొత్తంగా తారాస్థాయికి చేరుకున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం… ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది. బీజేపీతో కలిసి షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా..? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? గవర్నర్ ఏం చేయనున్నారనే దానిపై చర్చ నడుస్తోంది.
టాపిక్