షాంఘై.. ఊపిరి పీల్చుకుంటోంది!
చైనా ఆర్థిక రాజధాని షాంఘై ఊపిరి పీల్చుకుంటోంది. దాదాపు రెండు నెలల గృహ నిర్బంధం అనంతరం షాంఘై ప్రజలు స్వేచ్ఛాగాలులు పీలుస్తున్నారు. షాంఘైలో కోవిడ్ ఆంక్షలను చైనా ప్రభుత్వం బుధవారం నుంచి సడలించింది.
షాంఘై వీధులు మళ్లీ కళకళలాడుతున్నాయి. దుకాణ సముదాయాలు తెరుచుకుంటున్నాయి. ట్రాఫిక్ మొదలైంది. పాదచారుల కదలికలు ప్రారంభమయ్యాయి. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. షాంఘైలో కోవిడ్ ఆంక్షలను సడలించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
రెండు నెలల నుంచి
షాంఘైలో రెండు నెలల క్రితం కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం నగరంలో కఠిన ఆంక్షలను విధించింది. అత్యవసర సర్వీసులను మినహాయించి, కఠిన లాక్‌డౌన్ విధించింది. ఆంక్షలను అత్యంత కఠినంగా అమలు చేసింది. దాంతో, కేసుల సంఖ్య తగ్గింది. పరిస్థితి కుదుటపడింది. ఆంక్షల కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతిన్నది. దాంతో, రెండు నెలల పాటు అత్యంత కఠినంగా అమలు చేసిన ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. సహకరించిన పౌరులకు కృతజ్ఞతలు తెలుపుతూ షాంఘై కమ్యూనిస్ట్ పార్టీ కమిటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
జీరో కోవిడ్ పాలసీ
దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జీరో కోవిడ్ పాలసీని కఠినంగా అమలు చేశారు. దీనిపై పౌరుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. ఆ వ్యతిరేకతను కూడా జిన్‌పింగ్ కఠినంగా అణచివేశారు. కేసుల సంఖ్య తగ్గడంతో తాజాగా, సాధారణ నిబంధనలను మాత్రం కొనసాగిస్తూ, కఠిన ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పటికీ, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికీ దాదాపు 5 లక్షల మంది షాంఘై పౌరులు ఇంకా లాక్‌డౌన్‌లోనే ఉన్నారు. షాంఘై మొత్తం జనాభా 2.5 కోట్లు. కాగా, బుధవారం కేవలం 15 కోవిడ్ కేసులు మాత్రమే కొత్తగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
సబ్‌వే సర్వీసులు ప్రారంభం
షాంఘైలో లోకల్ బస్సు సర్వీసులు, సబ్‌వే సర్వీసులు ప్రారంభమయ్యాయి. త్వరలో ట్రైన్ సర్వీసులను కూడా పునరుద్ధరించనున్నారు. స్కూల్స్‌ను పేరెంట్స్ అనుమతితో క్రమంగా ప్రారంభించనున్నారు. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, ఇతర స్టోర్స్ 75% కెపాసిటీతో ప్రారంభమయ్యాయి. విదేశీయులు చైనాలోకి రావడంపై, చైనా వారి విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయి. ఆంక్షలు తొలగడంతో షాంఘై పౌరులు ఆనందోత్సాహాలతో వీధుల్లోకి వచ్చారు. షాపింగ్ చేసుకున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేయడంతో చైనీస్ నూతన సంవత్సరం ఎలా సంతోషంగా జరుపుకుంటానో.. అలా ఈ రోజును జరుపుకుంటున్నాను` అని స్థానికుడైన వాంగ్ వీ వ్యాఖ్యానించారు.