Infosys vs TCS vs Wipro vs HCL Tech: ‘ఉద్యోగ కల్పనలో ఇన్ఫోసిసే ముందుంది’
ఈ సంవత్సరం మార్చ్ నుంచి జూన్ వరకు ఉన్న త్రైమాసికంలో అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చిన సంస్థగా ఇన్ఫోసిస్ తొలి స్థానంలో ఉంది. కొత్తగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు, వేతనాల పెంపులోనూ ఇన్ఫీ ముందుంది. తద్వారా, ఈ సంవత్సరం సంస్థను విడిచే ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందన్న ఆశాభావంతో సంస్థ ఉంది.
Infosys vs TCS vs Wipro vs HCL Tech: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో(Q1FY23) కొత్తగా ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రధాన ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ లు అనుసరించిన వ్యూహాలపై ఒక నివేదిక విడుదలైంది.
Infosys vs TCS vs Wipro vs HCL Tech: అత్యధికంగా ఇన్ఫీ
ఈ సంవత్సరం మార్ఛ్ నుంచి జూన్ చివరివరకు కొత్త ఉద్యోగాల కల్పనలో ఇన్ఫోసిస్ ముందుంది. ఈ మూడు నెలలలో ఈ సంస్థ కొత్తగా 21,171 మంది ఉద్యోగులను చేర్చుకుంది. జూన్ 30 నాటికి ఇన్ఫోసిస్ లోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,35,186గా ఉంది. వీరిలో3,18,447 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కాగా, మిగతావారు సేల్స్, ఇతర సపోర్ట్ విభాగాల్లోని వారు. అలాగే, మొత్తం ఇన్ఫోసిస్ ఉద్యోగుల్లో 39.6% మహిళలు ఉన్నారు. ఈ సంస్థ అత్యధికంగా 2021 తొలి త్రైమాసికంలో 67,233 మంది ఉద్యోగులను చేర్చుకుంది. కొత్తగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు, ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు ఆకర్షణీయ హైక్ లను కూడా ప్రకటించింది. తద్వారా సంస్థను వీడే ఉద్యోగుల శాతాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది.
Infosys vs TCS vs Wipro vs HCL Tech: ఆదాయం
ఆదాయ విషయానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ ఆదాయం సగటున ఒక్కో ఉద్యోగికి 56.9 వేల డాలర్లుగా ఉంది. ఇది అంతకుముందటి త్రైమాసికంతో పోలిస్తే కొద్దిగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ ఆదాయం సగటున ఒక్కో ఉద్యోగికి 57.7 వేల డాలర్లు.
Infosys vs TCS vs Wipro vs HCL Tech: అత్యల్పంగా HCL Tech
HCL Tech సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అత్యల్ప సంఖ్యలో కొత్త ఉద్యోగులను చేర్చుకుంది. ఈ సంస్థ కేవలం 2,098 ఉద్యోగులను చేర్చకుంది. ప్రస్తుతం ఈ సంస్థలో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,10,966. మరో దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,58,574. గత మూడు నెలల్లో ఈ సంస్థలో కొత్తగా చేరిన ఉద్యోగుల సంఖ్య 15,446.
Infosys vs TCS vs Wipro vs HCL Tech: టీసీఎస్ లో..
ఈ ఏడాది జూన్ చివరి నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,06,331గా ఉంది. ఈ త్రైమాసికంలో కొత్తగా 14,136 మందిని చేర్చుకున్నారు.