India beats China: ఈ విషయంలో కూడా చైనాను దాటేశాం..
India beats China: భారత్ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతోంది. తాజాగా, దేశవ్యాప్తంగా ఉన్న రహదారుల విస్తీర్ణంలో ప్రపంచ దేశాల్లో రెండో స్థానానికి చేరి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న చైనాను అధిగమించింది.
India beats China: భారత్ రోడ్ నెట్ వర్క్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ గా రికార్డు సృష్టించింది. తొలి స్థానంలో అమెరికా ఉండగా, ఇన్నాళ్లు రెండో స్థానంలో చైనా ఉంది. 2014 నుంచి 1.45 లక్షల కిలోమీటర్ల ను భారత ప్రభుత్వం కొత్తగా ఈ నెట్ వర్క్ కు జోడించింది. కేంద్రం రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు.
గత 9 ఏళ్ల పురోగతి
గత 9 సంవత్సరాలలో తమ మంత్రిత్వ శాఖ సాధించిన పురోగతిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. గత 9 ఏళ్లలో పెద్ద సంఖ్యలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే లను నిర్మించామన్నారు. భారత్ లోనే అతి పొడవైన ‘ఢిల్లీ - ముంబై ఎక్స్ ప్రెస్ వే (Delhi-Mumbai Expressway)’ నిర్మాణం త్వరలోనే పూర్తి చేయనున్నామన్నారు. 2014 లో భారత్ లో రహదారుల విస్తీర్ణం 91,287 కిమీలు మాత్రమేనన్నారు. ఈ తొమ్మిదేళ్లలో 1.45 లక్షల కిమీల మేర కొత్త రహదారులను నిర్మించామని వెల్లడించారు. 2019 ఏప్రిల్ నుంచి కొత్తగా 30 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించామని తెలిపారు. వాటిలో ఢిల్లీ - మీరట్ ఎక్స్ ప్రెస్ వే, లక్నో - ఘాజీపూర్ ఎక్స్ ప్రెస్ వే మొదలైనవి ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం మేలో 100 గంటల్లో 100 కిమీల రహదారిని నిర్మించి రికార్డు సృష్టించామన్నారు. నేహనల్ హైవేస్ అథారిటీ ఈ మే నెలలో యూపీలోని ఘాజీపూర్ - అలీగఢ్ మార్గంలో 100 గంటల్లో 100 కిమీల రహదారిని నిర్మించి రికార్డు సృష్టించింది.
ఆదాయం పెరిగింది..
గత 9 సంవత్సరాలలో రోడ్లు, రహదారుల శాఖ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని గడ్కరీ వెల్లడించారు. 9 సంవత్సరాల క్రితం, 2014లో టోల్ ఆదాయం రూ. 4,770 కోట్లు ఉండగా, ఇప్పుడు అది రూ. 41,342 కోట్లకు చేరిందని తెలిపారు. ఇప్పుడు ఆ ఆదాయాన్ని రూ. 1.3 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఫాస్టాగ్ (FASTags) సిస్టమ్ వల్ల టోల్ ప్లాజాల వద్ద పొడవాటి క్యూలు కూడా తగ్గిపోయాయన్నారు.