Who leads Congress to 2024 : కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు అశోక్ గహ్లోత్??
2024 సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు ఇంకా `యాక్టివ్` ప్రెసిడెంట్ లేరు. 75 ఏళ్ల వయస్సున్న, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ 2024 ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించడానికి సిద్ధంగా లేరు. మరి ఆ పగ్గాలు చేపట్టేదెవరు?
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని సోనియా గాంధీ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగానే ఉంటున్నప్పటికీ.. పార్టీ పగ్గాలు చేపట్టడానికి మాత్రం ఎందుకో సుముఖంగా లేరు. గాంధీ వారసత్వం ఉన్న ప్రియాంక గాంధీ యూపీకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. 2024 ఎన్నికల్లో పార్టీకి, పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం నింపే నేత కోసం ఎదురు చూస్తున్నారు.
అశోక్ గహ్లోత్..
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ పార్టీ సీనియర్ నేత, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు అప్పజెప్పనున్నారనే వార్తలు ఈ మధ్య మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సీనియర్ నేతగా, అవినీతి మచ్చ లేని ముఖ్యమంత్రిగా, సమర్ధుడైన పాలకుడిగా అశోక్ గహ్లోత్‌కు పేరుంది. ఇటీవల పార్టీలో సచిన్ పైలట్ నాయకత్వంలో తన ప్రభుత్వంపై వచ్చిన తిరుగుబాటును కూడా ఆయన సమర్ధంగా ఎదుర్కొన్నారు. అయితే, గాంధీ వారసత్వాన్ని కాదని అశోక్ గహ్లోత్ నాయకత్వాన్ని పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు అంగీకరిస్తారా? అన్నది కూడా కీలకమైన ప్రశ్నే. మరోవైపు, రాజస్తాన్, గుజరాత్ సహా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో గహ్లోత్‌కు కొంత పేరుంది కానీ దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమాయత్తపరచగలిగే కరిష్మా కానీ, ప్రజలను ఆకట్టుకోగల వాక్పటిమ కానీ గహ్లోత్‌లో లేవన్నది నిర్వివాదాంశం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో గహ్లోత్ అంటే తెలియని కాంగ్రెస్ కార్యకర్తలే చాలామందే ఉంటారు. అయితే, గాంధీ కుటుంబానికి విధేయుడైన నేతగా ఉన్న పేరు గహ్లోత్‌కు సానుకూలాంశం.
రాహుల్ గాంధీ..
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు కావాలనే వారు పార్టీలో ఇప్పటికే మెజారిటీలోనే ఉన్నారు. పార్టీని ఒకే తాటిపై నిలిపి ఉంచే శక్తి `గాంధీ` అనే పేరుకే ఉందని సీనియర్ నేత పీ చిదంబరం కూడా గతంలో ఒకసారి వ్యాఖ్యానించారు. అయితే, రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి అంత ఆసక్తిగా లేరు. మరోవైపు, అవసరమైతే, ఇతర విపక్షాలను, ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోగల సామర్ధ్యం రాహుల్ కు ఉన్నట్లు కనిపించడం లేదు. తృణమూల్ చీఫ్ మమతకు కానీ, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలకు కానీ సోనియా గాంధీతో ఉన్నంత చనువు, సామరస్యత రాహుల్‌తో ఉండదు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిని నిర్మించాలంటే ఇతర విపక్షాలను కలుపుకుపోగల లౌక్యం, శక్తిసామర్ధ్యాలు చాలా అవసరం. రాహుల్‌తో పోలిస్తే.. ఆ నైపుణ్యాలు అశోక్ గహ్లోత్‌లో ఎక్కువగా ఉన్నాయి.కానీ, త్వరలో ప్రతిష్టాత్మకంగా చేపడ్తున్న `భారత్ జోడో` యాత్ర విజయవంతమైతే, పార్టీ పగ్గాలు చేపట్టడానికి రాహుల్ గాంధీ ఆసక్తి చూపే అవకాశం కూడా ఉంది.