Himachal Pradesh election 2022 : దేశం ఎదురుచూస్తున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 68 నియోజకవర్గాలకు శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 55లక్షలకుపైగా మంది ఓటర్లు.. రాష్ట్రంలోని 7,884 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 412మంది అభ్యర్థుల భవితవ్యాన్ని వీరు నిర్ణయించనున్నారు.
భారీ సంఖ్యలో తరలివెళ్లి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని.. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ట్వీట్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. 30వేలకుపైగా మంది పోలీసులను వివిధ ప్రాంతాల్లో బందోబస్తు కోసం మోహరించారు. వీరిలో 67 సీఆర్పీఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి. 11,500 మంది రాష్ట్ర పోలీసులు సైతం విధి నిర్వహణలో ఉన్నారు. 7,884 పోలింగ్ కేంద్రాల్లో 981 ప్రాంతాలు సున్నితమైనవిగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు.
Himachal Pradesh election live updates : ఎన్నికల కోసం ఈసీ కూడా ముమ్మర చర్యలు చేపట్టింది. పోలింగ్ కోసం 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను మోహరించింది. ఈవీఎంలో లోపాలు లేకుండా చూసుకుంది. పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు.. వివిధ కేంద్రాల్లో ఈవీఎంల మాక్ పోలింగ్ ప్రక్రియ జరిగింది.
హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం మీద 55,92,828 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 28,54,945 మంది పురుషులు, 27,37,845 మంది మహిళలు ఉన్నారు. 18-19 ఏళ్ల ఓటర్లు 1.93లక్షల మంది ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఇంత కాలం ద్విముఖ పోరు నడిచింది. పోటీ అంతా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండేది. దీనికి తోడు.. హిమాచల్ ప్రదేశ్‌లో ఓ ఆనవాయితీ ఉంది! ఇక్కడ ఏ పార్టీ కూడా ఇంతకాలం వరుసగా రెండుసార్లు అధికారాన్ని దక్కించుకోలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చాయి.
Himachal Pradesh election Polling : ఈసారి ఆ పరిస్థితులు రావని బీజేపీ ధీమాగా ఉంది. ప్రధాని మోదీ ముఖ చిత్రంతో ఎన్నికల ప్రచారాలు నిర్వహించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేసేందుకు కీలక మార్పులు చేపట్టింది. డబుల్ ఇంజిన్ సర్కారుకు ఓటేయాలని పిలుపునిచ్చింది.
కాంగ్రెస్ కూడా తీవ్రస్థాయిలో ప్రచారాలు నిర్వహించింది. ఆనవాయితీకి ఓటు వేయాలని, రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని ప్రజల్లోకి వెళ్లింది.
కానీ ఇప్పుడు.. ఆప్ ఎంట్రీతో.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమరం త్రిముఖ పోరుగా మారిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్రస్థాయిలో ప్రచారాలు నిర్వహించింది ఈ పార్టీ. ఉచితాల హామీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.
2017 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 43 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 22 చోట్ల గెలిచింది. ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక సీపీఎం ఎమ్మెల్యేలు సైతం విజయం సాధించారు.
Himachal Pradesh assembly election 2022 : అయితే.. 20స్థానాల్లో గెలుపోటముల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఆయా స్థానాల్లో సుమారు 3వేల ఓట్ల తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. ఈ 20 స్థానాల్లోని 6 సీట్లలో మెజారిటీ 1000, అంతకన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ఇక 34 నియోజకవర్గాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 5000, అంతకన్నా తక్కువగా ఉంది. దీని బట్టి.. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల వేడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
మరి ఆప్‌తో బీజేపీకి ప్రమాదమా? లేక ముప్పు కాంగ్రెస్ ఓటు బ్యాంకుకేనా? అన్నది.. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్ 8తో తేలిపోతుంది.