Analysis on HP elections: హిమాచల్‌ ప్రదేశ్‌లో సంప్రదాయం కొనసాగింపా? తిరగ రాయడమా?-will tradition continue in himachal pradesh assembly elections or will it change ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Will Tradition Continue In Himachal Pradesh Assembly Elections Or Will It Change

Analysis on HP elections: హిమాచల్‌ ప్రదేశ్‌లో సంప్రదాయం కొనసాగింపా? తిరగ రాయడమా?

HT Telugu Desk HT Telugu
Nov 07, 2022 11:44 AM IST

Himachal Pradesh assembly elections: హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చే సంప్రదాయం కొనసాగుతుందా? బీజేపీ దానిని తిరగ రాస్తుందా? ఈ అంశంపై పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ ఐ.వి.మురళీ కృష్ణ శర్మ విశ్లేషణ మీ కోసం..

తన రోడ్‌షోలో ఓ మహిళా ఓటరుతో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సంభాషణ
తన రోడ్‌షోలో ఓ మహిళా ఓటరుతో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సంభాషణ (Jai Ram Thakur Twitter)

Himachal Pradesh assembly elections: మంచు కొండలతో ప్రకృతి అందాలకు నెలవైన హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో శీతాకాలంలో ఎన్నికల వాతావరణం రాజకీయ పార్టీలకు వేడి సెగను పుట్టిస్తోంది. రాష్ట్ర ప్రజలు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మారుస్తూ తీర్పునివ్వడం ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతుంది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌ 1971 జనవరి 25న రాష్ట్రంగా ఆవిర్భవించింది. ప్రారంభంలో కాంగ్రెస్‌, జనతా పార్టీ మధ్య పోటీ ఉండేది.

ట్రెండింగ్ వార్తలు

1985 నుండి నిరాటంకంగా కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ నెలకొని ఉంది. ప్రతి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు విలక్షణమైన తీర్పునిస్తూ ఒకే పార్టీకి వరుసగా విజయాన్ని అందించకుండా ప్రభుత్వాలను ప్రతి ఎన్నికలోనూ మారుస్తున్నారు. 1992-93 మధ్య దాదాపు సంవత్సర కాలం రాష్ట్రపతి పరిపాలనలో ఉన్న రాష్ట్రంలో 1993, 2003, 2012 ఎన్నికలల్లో కాంగ్రెస్‌, 1990, 1998, 2007, 2017 ఎన్నికల్లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టాయి.

ప్రతిసారి అధికార మార్పిడి జరుగుతున్న ఈ రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల్లో ఆ సంప్రదాయాన్ని తిరగరాస్తామని అధికార బీజేపీ విశ్వాసంతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తామని ఆశావాహ దృక్పథంతో ఉంది. హిమాచల్‌లో దాదాపు రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. దేశవ్యాప్తంగా విస్తరించాలని తహతహలాడుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ప్రవేశించడంతో పోటీ రసవత్తరంగా సాగుతోంది. రాష్ట్రంలోని 55 లక్షల ఓటర్లు ఈ నెల 12వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారో అని దేశవ్యాప్తంగా రాజకీయ పండితులు, విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటి వరకూ ప్రభుత్వ వ్యతిరేకతకే ఓటు

రాష్ట్ర ఎన్నికల్లో ప్రతిసారి ప్రభుత్వ వ్యతిరేకతే కీలక పాత్ర పోషిస్తోంది. 1993లో పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 1998 ఎన్నికలకు ముందు 1997లో ప్రతిపక్ష బీజేపీలో ఏర్పడిన కుమ్ములాటలతో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని రెండోసారి వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భావించింది. బీజేపీ అగ్రనేతలైన శాంతా కుమార్‌, ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌ మధ్య వర్గపోరు లాభిస్తుందని భావించిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ ఆశలు అడియాసలయ్యాయి. 1998 ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపింది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చెరో 31 స్థానాలు సాధించాయి. రాష్ట్రంలో నూతనంగా సుఖ్‌రామ్‌ ఏర్పాటు చేసిన హిమాచల్‌ వికాస్‌ కాంగ్రెస్‌ ఐదు సీట్లు సాధించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించింది. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకొని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యింది. ఈ ఎన్నికల్లో బీజేపీలోని అసమ్మతితో ప్రయోజనం పొందుదామనుకున్న కాంగ్రెస్‌కు, ఆ పార్టీ నుండి బహిష్కరణకు గురైన సుఖ్‌రామ్‌ నూతన పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చారు. 1998 ఎన్నికలు మినహాయించి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రభుత్వాలను మార్చే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

ఈ సంప్రదాయాన్ని మార్చాలని బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టి కృషి చేస్తోంది. క్రితం రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలకు, మండీ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాల్లో విజయకేతనం ఏగురవేసింది. ఆ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పరాజయంతో అధికార బీజేపీ నాయకులు ఖంగుతిన్నారు. ప్రధానంగా బీజేపీ ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్‌ సొంత జిల్లా పరిధిలోకి వచ్చే మండీ లోక్‌సభ స్థానంలో ఆ పార్టీ ఓడిపోవడం బీజేపీలో ఆందోళన రేకెత్తిచింది. దేశవ్యాప్తంగా బలహీనపడుతున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఊహించని విధంగా భారీ విజయం సాధించడం బీజేపీని కుదిపేసింది. ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో నూతనుత్తేజం నెలకొనగా బీజేపీలో నిరుత్సాహం ఏర్పడింది. ఈ ఉప ఎన్నికల తర్వాత దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీలో కొత్త ఆత్మవిశ్వాసం నింపగా కాంగ్రెస్‌‌ను ఆందోళనలో పడేశాయి.

హిమాచల్‌ మాదిరిగానే ప్రతి ఎన్నికల్లో సంప్రదాయంగా అధికార మార్పు జరిగే ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరాజయం పొంది బీజేపీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, హిమాచల్‌ పక్క రాష్ట్రమైన పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయి ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడం, రాష్ట్ర సరిహద్దులో ఉండే పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించడం హిమాచల్‌ రాష్ట్ర ఎన్నికలపై ప్రభావం చూపనుంది. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నా తాజా పరిణామాలతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో, కార్యకర్తల్లో ఒకరకమైన మానసిక ఆందోళన నెలకొంది.

సంప్రదాయాన్ని మారుస్తామంటున్న బీజేపీ

ప్రధానంగా ఉత్తరాఖండ్‌లో వరుస విజయం రాష్ట్రంలోని బీజేపీకి నూతన శక్తినిచ్చింది. ఇదే ప్రయోగాన్ని హిమాచల్‌లో కూడా నిర్వహించడానికి తీవ్ర ప్రయత్నాలను మొదలుపెట్టింది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేలా ఈ ఎన్నికల్లో ‘‘రివాజ్‌ బద్లేంగే’’ (సంప్రదాయాన్ని మారుస్తాం) అంటూ రాష్ట్రం నలుమూలల ప్రచారం నిర్వహిస్తోంది. ‘‘నయా రివాజ్‌ బనాయింగే, ఫిర్‌ బాజపా లాయేంగే’’ (నూతన సంప్రదాయాన్ని నెలకొల్పుతాం, తిరిగి బీజేపీని తీసుకొస్తాం), ‘‘జన్‌ జన్‌ కి యెహీ ఆవాజ్‌, బద్లేగా రివాజ్‌’’ (అందరిదీ ఇదే మాట, మారబోతుంది సంప్రదాయం) వంటి నినాదాలను బీజేపీ ఓటర్ల మదిలో ప్రవేశపెడుతోంది. బీజేపీ తిరిగి అధికారం చేపట్టడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. సంవత్సర కాలం నుండే ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ రాష్ట్రంలోని వివిధ వర్గాలకు అనేక ఎన్నికల వరాలను ప్రకటించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి ముందస్తుగానే పార్టీ అగ్రనేత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనేలా బహిరంగ సభలు ఏర్పాటు చేసి, పలు భారీ ప్రాజెక్టులను ప్రారంభించే కార్యక్రమాలను చేపట్టింది. ప్రధాని బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేయడంతోపాటు ఈ ప్రాంతంలో మొదటి అంబ్‌ అందౌరా- న్యూ ఢిల్లీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను, ఉనాలో త్రిపుల్ ఐటీని, బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్‌ను, చాంబాలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన పనులను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ అభివృద్ధి బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి తోడ్పడుతాయని ఆ పార్టీ భావిస్తుంది.

ఆప్ కీలకపాత్ర

2022 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న ఆప్‌ కీలక పాత్ర పోషించనుంది. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో భారీ విజయం సాధించిన ఆప్‌ హిమాచల్‌పై దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య నెలకొనగా ఆప్‌ పార్టీ రాష్ట్రంలో దాదాపు అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెడుతోంది. క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా నెట్‌వర్క్‌ లేకపోవడం ఆ పార్టీకి పెద్దలోపం. హిమాచల్‌లో ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని భావించిన ఆ పార్టీ ఇప్పుడు గుజరాత్‌ ఎన్నికలపై దృష్టి సారించింది. చిన్న రాష్ట్రమైన హిమాచల్‌లో ఎన్నికల ఫలితాల్లో గెలుపోటముల మెజార్జీ ఓట్లు వేలల్లోనే ఉంటాయి. ఈ దశలో ఇక్కడ ప్రతి ఓటు కీలకమైనదే. ఆప్‌ అన్ని చోట్ల పోటీ చేస్తుండడంతో కొన్ని స్థానాల్లో ఆ పార్టీ కీలక పాత్ర పోషించనుంది. తన విజయం సంగతెలా ఉన్నా బిజెపి, కాంగ్రెస్‌ విజయావకాశాలను ప్రభావితం చేయనుంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక, రెబల్‌ అభ్యర్థుల ప్రభావం

ఆప్‌ పార్టీ చీల్చే ఓట్లు బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఆప్‌ పార్టీ చీల్చనుండడంతో బీజేపీకి ప్రయోజనం చేకూరి కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో హెచ్‌విసి, ఎచ్‌ఎల్‌పి వంటి పార్టీలు పోటీలో లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అధికార కాంగ్రెస్‌కు నష్టం కలిగి, ప్రతిపక్ష బిజెపి లాభపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఈ ఎన్నికలను పరిశీలిస్తే... 2012లో 42.81 శాతం ఓట్లతో 36 స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ 2017లో 41.7 శాతం ఓట్లతో 21 సీట్లు సాధించి అధికారానికి దూరమయ్యింది. అంటే కేవలం 1.1 శాతం ఓట్లు తగ్గడంతో 15 సీట్లు కోల్పోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విషయానికొస్తే 2012లో 38.47 ఓట్ల శాతంతో 26 స్థానాలు పొందగా, 2017లో 48.8 శాతం ఓట్లతో 44 స్థానాలు సాధించింది. అధికంగా 10 శాతంపైగా ఓట్లు పొందడంతో 2017లో 18 సీట్లు పెరిగి 44 స్థానాలు పొందింది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకపోవడంతో బీజేపీ భారీ విజయం సాధించింది. ఈ పరిణామాల దృష్ట్యా 2022 ఎన్నికల్లో ఓట్ల చీలికల్లో ఆప్‌ కీలక పాత్ర పోషించనుంది.

ప్రధాన పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పేలాలేదు. ముఖ్యంగా టికెట్ల కేటాయింపు బిజెపికి ఇబ్బందిగా తయారయ్యింది. కాంగ్రెస్‌ నేతలను పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి ఇప్పుడు వారికి స్థానాలు కేటాయించలేక తలలు పట్టుకుంటోంది. అనేక స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు బిజెపికి సవాలు విసురుతున్నారు. కాంగ్రా, కులు, మండీ, బిలాస్‌పుర్‌ జిల్లాల్లో డజనుకుపైగా స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు ఉండడంతో బిజెపి కలవరపడుతోంది. ఆ పార్టీ ఇప్పటికే ఆరుగురు తిరుగుబాటు అభ్యర్థులను ఆరు సంవత్సరాలు పాటు పార్టీ నుండి సస్పెండ్‌ చేసింది. బిజెపితో పోలిస్తే కాంగ్రెస్‌లో తిరుగుబాటు అభ్యర్థులు తక్కువగా ఉన్నా ఆ పార్టీ కూడా ఆరుగురు తిరుగుబాటు అభ్యర్థులను పార్టీ నుండి బహిష్కరించాల్సి వచ్చింది. ఆప్‌ ప్రభావం ఎంత మేరకు ఉంటుందో అంచనా లేకపోయినా ఆ పార్టీ నుండి కూడా రెండు మూడు స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులున్నారు. ఎన్నికల సమయంలోగా ఈ పార్టీలు తిరుగు బాటు అభ్యర్థులను దారిలోకి తెచ్చే విధానంపైనే ఆ పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావాన్ని తగ్గించడానికి బిజెపి కొంత మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇతర స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. అటవీ శాఖ మంత్రి రాకేష్‌ పతానివాస్‌ను నుర్పూర్‌ నుండి ఫతేపూర్‌కు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేష్‌ భరద్వాజ్‌ను సిమ్లా నుండి కాసుమ్‌టీకు, రమేశ్‌ ద్వాలాను జ్వాలాముఖి నుండి దేహ్రా నియోజకవర్గాలకు మార్చారు. అంతేకాక ‘‘పరివార్‌వాద’’ (కుటుంబ సభ్యులకు టికెట్లు) విషయంలో కూడా బిజెపి రాజీపడాల్సి వచ్చింది. ధర్మాపుర్‌ నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ మంత్రి మోహిందర్‌ సింగ్‌ స్థానంలో ఆయన తనయుడు రాజాత్‌ ఠాకుర్‌ బరిలోకి దిపండంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు కేటాయించారు. కుటుంబ సభ్యులకు టికెట్‌ విషయంలో బీజేపీలో ఉన్నట్టు కాంగ్రెస్‌ పార్టీలో ఒక సమస్య కాదు. ఆ పార్టీ నుండి అనేక మంది వారసులు బరిలో ఉన్నారు.

హిమాచల్‌ రాష్ట్రంలో ముఖాముఖిగా తలపడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉండడంతో రాష్ట్ర అభివృద్ధి పురోగతిలో సాగుతుందని, డబుల్‌ ఇంజన్‌ సర్కారుకు ప్రజలు మద్దతివ్వాలని బీజేపీ ప్రచారం చేస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా బలపడుతున్న బీజేపీని ఇక్కడ ఓడించడం కాంగ్రెస్‌కు ఎంతో ఆవశ్యం. ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ నినాదం ఎత్తుకున్న బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడిరచడం ఆ పార్టీకి కీలకం. ఇక్కడి విజయం జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలకు ఎంతో కీలకం. ఆపిల్‌కు పేరుగాంచిన ఈ శీతల క్షేత్రంలో ఆపిల్‌ పండు ఎవరికి తీపిని కలిగిస్తుందో, ఎవరికి చేదును మిగిలిస్తుందో డిసెంబర్‌ 8న వెలువడే ఫలితాలే తేలుస్తాయి.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ

వ్యాసకర్త మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి
వ్యాసకర్త మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి

(డిస్‌క్లెయిమర్: ఈ కథనంలో విశ్లేషణ, అభిప్రాయాలు వ్యాసకర్త లేదా రీసెర్చ్ సంస్థవే. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు..)

IPL_Entry_Point