GN Saibaba acquitted: జీఎన్ సాయిబాబా విడుదలకు బాంబే హైకోర్టు ఆదేశం
మావోయిస్టులతో సంబంధం ఉందన్న ఆరోపణల్లో జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తక్షణం విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల కేసులో ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ అతన్ని వెంటనే జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించినట్లు పీటీఐ వార్తాసంస్థ నివేదించింది. ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. జీఎన్ సాయిబాబాను 2014లో అరెస్టు చేశారు.
2017లో ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతించింది. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీళ్లను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అప్పీల్ విచారణ పెండింగ్‌లో ఉన్న ఐదుగురిలో ఒకరు మరణించారు.
దోషులు మరే ఇతర కేసులో నిందితులుగా లేనట్టయితే వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
మార్చి 2017లో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు సాయిబాబా, ఇతర వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. అందులో ఒక పాత్రికేయుడు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని, దేశంపై కుట్ర చేసే కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ నిబంధనల ప్రకారం సాయిబాబా, ఇతరులను కోర్టు దోషులుగా నిర్ధారించింది.