Crime news: డబ్బు కోసం స్నేహితురాలినే దారుణంగా హత్య చేసిన విద్యార్థులు; ఇప్పుడు కటకటాల్లో..-engg student two friends murder his female classmate demands 9 l rupees ransom from parents ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: డబ్బు కోసం స్నేహితురాలినే దారుణంగా హత్య చేసిన విద్యార్థులు; ఇప్పుడు కటకటాల్లో..

Crime news: డబ్బు కోసం స్నేహితురాలినే దారుణంగా హత్య చేసిన విద్యార్థులు; ఇప్పుడు కటకటాల్లో..

HT Telugu Desk HT Telugu
Apr 10, 2024 03:56 PM IST

Pune crime news: జల్సాలకు అలవాటు పడి, డబ్బుల కోసం ఒక విద్యార్థి క్లాస్ మేట్ నే కిడ్నాప్ చేసి, దారుణంగా హతమార్చిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. ఈ నేరంలో పాలు పంచుకున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరానికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు.

డబ్బుల కోసం క్లాస్ మేట్ నే హత్య చేసిన నిందితుడు
డబ్బుల కోసం క్లాస్ మేట్ నే హత్య చేసిన నిందితుడు

Pune crime news: లాతూర్ నుంచి వచ్చి పుణెలో ఇంజనీరింగ్ చదువుతున్న భాగ్య శ్రీ అనే యువతిని, ఆమె క్లాస్ మేట్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి హత్య చేశాడు. వారు ఈ దారుణానికి పాల్పడటానికి డబ్బు అవసరాలే ప్రధాన కారణమని దర్యాప్తు అధికారులు సోమవారం తెలిపారు. నేరం జరిగిన మర్నాడే నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. పుణెలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగిన నేరాల వివరాలను పోలీసులు సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

కిడ్నాప్ చేసి.. హతమార్చి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల్లో ఒకరైన శివం ఫుల్వాలే, బాధితురాలు భాగ్యశ్రీ సూడే క్లాస్ మేట్స్. వారు వాఘోలీ రైసోని కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు. మార్చి 30న రాత్రి 9 గంటల సమయంలో వారిద్దరూ ఫీనిక్స్ మాల్ కు చేరుకున్నారు. అక్కడ వారు ఉండగానే, నిందితుడు శివం తన ఇద్దరు స్నేహితులను కారులో అక్కడికి రమ్మని మెసేజ్ పంపించాడు. వారు వచ్చిన తరువాత ముగ్గురూ కలిసి భాగ్య శ్రీని కారులో తీసుకువెళ్లారు. అహ్మద్ నగర్ కు వెళ్లే మార్గంలో ఆమెను కారులోనే గొంతు నులిమి హత్య చేశారు. ఆ తరువాత, ఆమె మృతదేహాన్ని అహ్మద్ నగర్ జిల్లాలోని పుణె-అహ్మద్ నగర్ రోడ్డులోని కమర్ గావ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టారు.

తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్

తమ ఫోన్స్ కు కూతురు భాగ్య శ్రీ స్పందించకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు భయాందోళనలకు గురై మరుసటి రోజు స్వస్థలం లాతూర్ నుంచి పుణెకు చేరుకున్నారు. ఆ తరువాత, ఈ నెల 2వ తేదీన నిందితులు సెల్ఫోన్ ద్వారా ఆమె తల్లిదండ్రుల నుంచి రూ.9 లక్షలు డిమాండ్ చేశారు. భాగ్య శ్రీని హత్య చేసిన విషయం చెప్పకుండా, మీ కూతురు మీకు క్షేమంగా కావాలంటే, తమకు రూ. 9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బును భాగ్య శ్రీ బ్యాంక్ ఖాతాకే ట్రాన్స్ ఫర్ చేయాలని కోరారు. భాగ్యశ్రీ మొబైల్ ను ఉపయోగించి నిందితులు ఆమె తండ్రిని సంప్రదించి డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో, భాగ్య శ్రీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మొబైల్ లొకేషన్ తో..

ముంబైలో ఆమె మొబైల్ లొకేషన్ ను పరిశీలించిన పుణె పోలీసుల బృందం ముంబైలోని జోగేశ్వరి ప్రాంతానికి వెళ్లినా నిందితుల ఆచూకీ లభించలేదు. ఆ తరువాత, పుణెలోని వాఘోలి ప్రాంతంలో భాగ్యశ్రీ ఫోన్ ను పోలీసులు విజయవంతంగా ట్రాక్ చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితుడు డబ్బుల కోసమే తన క్లాస్ మేట్ ను కిడ్నాప్ చేసి హత్య చేశాడని తేలిందని అదనపు పోలీసు కమిషనర్ మనోజ్ పాటిల్ తెలిపారు. ప్రధాన నిందితుడు శివం ఫుల్వాలే తో పాటు నేరంలో పాలు పంచుకున్న అతడి స్నేహితులు సురేశ్ ఇందూర్, సాగర్ జాదవ్ లను పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అప్పులు చేశామని, ఆ అప్పు తీర్చేందుకు డబ్బులు అవసరం కావడంతో భాగ్య శ్రీని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని పథకం పన్నినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. నిందితులను పట్టుకోవడానికి వారికి కొంత మొత్తం డబ్బును చెల్లించాలని పోలీసులు భాగ్య శ్రీ తల్లిదండ్రులకు సూచించారు. దీని ప్రకారం భాగ్యశ్రీ తల్లిదండ్రులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.50 వేలు బదిలీ చేశారు.

Whats_app_banner