Crime : కి'లేడీ'లు.. పనిమనిషిగా చేరి.. దోచుకోవడమే వారి హాబీ..!
Crime news : ఆ ముగ్గురు.. పనిమనుషులుగా ఇళ్లల్లోకి వెళతారు. కొన్ని రోజులకే చేతికి పని చెబుతారు. అక్కడ ఉండే ఖరీదైన వస్తువులను దోచుకుని పారిపోతారు. ముంబై అడ్డాగా సాగిన ఈ కార్యకలాపాలు.. బెంగళూరులోనూ చేసేందుకు ప్రయత్నించారు. సక్సెస్ అయ్యారు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయారు.
Crime news : వనిత(37), ప్రియాంక రాజేష్ మోర్గె(29), మహాదేవి(26)లు ముంబై కేంద్రంగా అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో 'పనిమనిషి'గా పోస్టులు పెట్టి.. తమను నియమించుకునే యజమానుల ఇళ్లను దోపిడీలు చేయడం వారికి అలవాటు. అనేకమార్లు పోలీసుల నుంచి కూడా తప్పించుకున్నారు.
ఒకసారి అనూహ్యంగా వారి నేరాలను ముంబై నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు మార్చారు. తమని తాము పనిమనుషులుగా చెప్పుకుని 'రిఫర్ హౌస్ మైడ్, బెంగళూరు' అనే ఫేస్బుక్ పేజ్లో యాడ్ ఇచ్చారు. అదే సమయంలో మరో వెబ్ పేజీని కూడా నడిపారు. స్థానికంగా ఉండే సెక్యూరిటీ గార్డులను వలలో వేసుకున్నారు. డబ్బులెక్కువ ఉండే యజమానులను చూపించాలని అడిగారు. ఇందుకోసం నెల జీతాన్ని లంచంగా ఇచ్చారు.
ఈ క్రమంలోనే మహాదేవికి రెండు నెలల క్రితం పనిమనిషిగా ఓ ఇంట్లో ఉద్యోగం దొరికింది. చేరిన మూడో రోజే చేతికి పనిచెప్పింది మహాదేవి. ఇంట్లో ఖరీదైన వస్తువులను దోచుకుని పారిపోయింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. ఆ ముగ్గురు మహిళలు దొంగలని, పనిమనుషులుగా చేరి దొంగతనాలు చేయడం వారి హాబీ అనే తెలుసుకుని షాక్ అయ్యారు. రెండు నెలల పాటు వారిని పట్టుకునేందకు ప్రయత్నించారు.
చివరికి ఆ ముగ్గురు పోలీసులకు చిక్కారు.
"ఈ ముఠాను హెన్నూర్ బృందం రెండు నెలల పాటు ఫాలో అయ్యింది. చివరికి పట్టుకుంది. వెల్ డన్ టీమ్. వారి నుంచి 250గ్రాముల బంగారం, 100గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు," అని తూర్పు బెంగళూరు డిప్యూటీ కమిషనర్ డా. భీమశంకర్ ట్వీట్ చేశారు.
కాగా.. ముఠాలో వనిత అనే మహిళ కీలకం అని తెలుస్తోంది. ముంబైలో ఆమెపై 37కేసులు ఉన్నట్టు సమాచారం.
సంబంధిత కథనం