`మిస్టర్ టెడ్రోస్.. ఇవేం లెక్కలు?` డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్‌పై భారత్ మండిపాటు
కోవిడ్ మరణాలను దారుణంగా పెంచి చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికపై భారత్ మండిపడింది. `ఇవేం లెక్కలు? ఏ పద్ధతి ప్రకారం ఈ అంచనాకు వచ్చారు?` అని ప్రశ్నించింది. ఈ అంశాన్ని డబ్ల్యూహెచ్ఓ సహా అన్ని సంబంధిత అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతామని స్పష్టం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా, గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరోనాతో, కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలతో సుమారు 1.5 కోట్ల మంది చనిపోయారని ఆ నివేదికలో పేర్కొంది. అందులో దాదాపు మూడో వంతు మరణాలు భారత్‌లో చోటు చేసుకున్నాయని, ఇండియాలో 47 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ నివేదికలోని వివరాలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఏ గణిత విధానాల ద్వారా ఈ లెక్కలు కట్టారో తెలపాలని డిమాండ్ చేసింది. విశ్వసించలేని మేథమెటికల్ మోడల్స్‌ను వాడి ఉండొచ్చని అభిప్రాయపడింది. కోవిడ్ మరణాలను ఇంత ఎక్కువగా చూపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది.
కోటిన్నర కాదు.. 60 లక్షలే..!
ఇప్పటివరకు ఆయా దేశాల అధికారిక లెక్కల ప్రకారం కోవిడ్, కరోనా సంబంధిత సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది మరణించారు. డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న 1.5 కోట్ల మరణాలకు, ఈ అధికారిక లెక్కలకు పొంతన కుదరడం లేదు. అధికారిక లెక్కల్లోని మరణాల కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ మరణాలను డబ్ల్యూహెచ్ఓ చూపుతోంది. ఆగ్నేయాసియా, యూరోప్, అమెరికా దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది.
భారత్‌లో 10 రెట్లు ఎక్కువ
భారత దేశం అధికారికంగా లెక్కల్లో చూపిన మరణాల కన్నా.. 10 రెట్లు ఎక్కువ మరణాలు(47,40,894) భారత్‌లో సంభవించాయని ఈ నివేదిక చెబుతోంది. డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న 47 లక్షల మరణాలు అనే అంచనా ఏ రకంగా నమ్మలేని విధంగా ఉందని భారత్‌లోని వైద్య వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో, ఇతర సంబంధిత అంతర్జాతీయ ఫోరమ్‌లలో లేవనెత్తాలని భారత్ భావిస్తోంది. కరోనా మరణాల అంచనా కోసం డబ్ల్యూహెచ్ఓ ఉపయోగిస్తున్న మేథమెడికల్ మోడల్స్‌ను మొదటి నుంచి భారత్ వ్యతిరేకిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఆందోళనలను పట్టించుకోకుండా, లోపభూయిష్ట విధానాలు వాడి, అహేతుకంగా, భారత్‌లో అధిక మరణాలు సంభవించాయని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. భారత్‌లో జనన, మరణాల రిజిస్ట్రేషన్ కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, పద్ధతి ప్రకారం కొనసాగుతుందని తెలిపింది.
సంబంధిత కథనం
టాపిక్