చైనాలో భారీగా కరోనా కేసులు.. భయం గుప్పిట్లో జనం..!
చైనాలో మళ్లీ కరోనా కోరలు చాచుతోంది. ఇప్పటివరకు సంతోషంగా ఉన్న అక్కడి ప్రజలను మరో పిడిగులాంటి వార్త కలవరపెడుతోంది. తాజాగా కొత్త వేరియంట్ విజృంభిస్తోందని.. అందుకు కేసుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు.
చైనాలో కరోనా పంజా విసురుతోంది. కొత్త వేరియంట్‌గా భావిస్తున్న '‘స్టెల్త్ ఒమిక్రాన్' ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫలితంగా చాలా నగరాలు లాక్ డౌన్లోకి వెళ్తున్నాయి. గత కొద్దిరోజులుగా వందలోపు ఉన్న కేసులు.. తాజాగా చేస్తున్న పరీక్షల్లో ఏకంగా వందల సంఖ్యను దాటుతున్నాయి. ఈ పరిణామాలు డ్రాగన్ దేశాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది.
భారీగా కేసులు…
గడిచిన 24 గంటల్లో స్థానికంగా చైనాలో 5,280 పైగా కేసులు నమోదు కాగా.. జిలిన్ ప్రావిన్స్‌లోనే దాదాపు ఎక్కువ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక్కడ పలు ఆంక్షలను విధించింది ప్రభుత్వం. ఇక షెన్‌జెన్ నగరాన్ని ఇప్పటికే చైనా దిగ్బంధం చేసింది. అక్కడ ప్రజలందరికీ మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. చాంగ్‌చున్ నగరంలో శుక్రవారం నుంచి లాక్‌డౌన్ అమలవుతోంది. మరోవైపు షాంఘైలోనూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. పాఠశాలలను మూసి వేశారు.
పరీక్షల సంఖ్య పెంపు...
తాజా వేరియంట్ భయంతో అప్రమత్తమైంది చైనా. చాలా నగరాల్లో విస్తృత్తంగా టెస్టులను చేస్తోంది. వైద్య సిబ్బంది ఎక్కడికక్కడే పరీక్షలను నిర్వహిస్తోంది. వైద్య సిబ్బందికి సహకరించేందుకు సైనికులూ కూడా రంగంలోకి దిగారు. స్టెల్త్ ఒమిక్రాన్‌తో మరణ భయం లేనట్లు తెలుస్తోంది.
6 వేల పడకల ఆస్పత్రి...
జిలిన్ ప్రావిన్స్‌లోని సిపింగ్, డన్‌హువా నగరాల్లో కేసులు సంఖ్య అధికంగా ఉంది. ఫలితంగా తాత్కాలిక ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా 6 వేల పడకల గల ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ఆరు రోజుల్లోనే వినియోగానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించే యోచనలో చైనాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని చైనాలోని ఓ స్థానిక మీడియా ట్విటర్లో పోస్టు చేసింది.