World Hypertension Day: ఈ జాగ్రత్తలు పాటిస్తే హైబీపీ ప్రమాదం తగ్గుతుంది!-world hypertension day follow these 6 tips to reduce risk of high blood pressure ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  World Hypertension Day Follow These 6 Tips To Reduce Risk Of High Blood Pressure

World Hypertension Day: ఈ జాగ్రత్తలు పాటిస్తే హైబీపీ ప్రమాదం తగ్గుతుంది!

Chatakonda Krishna Prakash HT Telugu
May 16, 2023 01:11 PM IST

World Hypertension Day: హై బీపీ ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

World Hypertension Day: ఈ జాగ్రత్తలు పాటిస్తే హైబీపీ ప్రమాదం తగ్గుతుంది! (Photo: Unsplash)
World Hypertension Day: ఈ జాగ్రత్తలు పాటిస్తే హైబీపీ ప్రమాదం తగ్గుతుంది! (Photo: Unsplash)

World Hypertension Day: అధిక రక్తపోటు (High Blood Pressure - High BP) సమస్య భారత్‍లో కోట్లాది మందికి ఉంది. హైపర్‌టెన్షన్‍నే హై బ్లడ్ ప్రెజర్‌గా పరిగణిస్తారు. ఇండియాలో ప్రతీ నలుగురు పెద్దల్లో ఒకరికి హైపర్‌టెన్షన్ (Hypertension) ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 12 శాతం మంది మాత్రమే తమ బ్లడ్ ప్రెజర్ (BP)ని నియంత్రణలో ఉంచుకుంటున్నారు. అయితే, 2025లోగా హైపర్‌టెన్షన్‍ను 25 శాతం మేర తగ్గించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్టు డబ్ల్యూహెచ్‍వో పేర్కొంది. అయితే, మీ జీవన విధానంలో కొన్ని మార్పుల ద్వారా హై బీపీ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. బీపీని అదుపులోకి ఉంచుకునేందుకు పాటించాల్సిన కీలకమైన జాగ్రత్తలేవో ఇక్కడ చూడండి. ఈనెల 17వ తేదీన ప్రపంచ హైపర్‌టెన్షన్ డే (World Hypertension Day) సందర్భంగా ఈ కథనం.

రక్తపోటును ఎలా లెక్కిస్తారు?

High Blood Pressure : రక్తపోటును మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ (mmHg)గా కొలుస్తారు. సిస్టోలిక్ ప్రెజర్, డియాస్టోలిక్ ప్రొజర్.. అనే రెండు నంబర్లు ఉంటాయి. ప్రెజర్ కొలతలు 120/80 mmHg లోపు ఉంటే సాధారణ రేంజ్ అని అర్థం చేసుకోవచ్చు. 140/90 mmHg లేదా అంత కంటే ఎక్కువగా ఉంటే అది హై బ్లడ్ ప్రెజర్.

హై బ్లడ్ ప్రెజర్‌ను అదుపులో ఉంచుకుందుకు ఈ జాగ్రత్తలు:

ఉప్పు తగ్గించండి

High Blood Pressure : ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల హై బీపీ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకే ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. సోడియం ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్, ఇతర ప్యాకేజ్ ప్రొడక్టులను ఎక్కువగా తినకూడదు. ఆహారంలో ఉప్పు బదులు సుగంధ ద్రవ్యాలు, మూలికలు వాడడం మంచిది. అలాగే తాజా పండ్లు, కూరగాయాలు తినడం, ఇంటి భోజనాన్నే ఎక్కువగా తినడం వల్ల ఉప్పు తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు.

వ్యాయామం తప్పనిసరి

High Blood Pressure : ప్రతీ రోజు వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు పూర్తి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది. వారంలో కనీసం 150 నిమిషాలైన మోస్తరు నుంచి తీవ్రమైన వ్యాయామాలు చేయాలి. వేగంగా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయాలి.

డాష్ డెయిట్ పాటించాలి

High Blood Pressure : డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్ (DASH) డైట్‍ ప్లాన్‍ను పాటించాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ తక్కువగా ఉండే డెయిరీ ప్రొడక్టులు, తృణధాన్యాలు తినడమే ఈ డైట్ ప్లాన్. వీటిలో సోడియం, ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. డ్యాష్ డైట్ వల్ల హైపర్ టెన్షన్ ప్రమాదం తగ్గుతుంది. ప్రతీ రోజూ ఎక్కువగా పండ్లు, కూరగాయాలు తినాలి.

ఆరోగ్యకరమైన బరువు

High Blood Pressure : ఊబకాయం వల్ల కూడా హైబీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన శరీర బరువు ఉండాలి. ఉండాల్సిన దాని కంటే అధిక బరువు ఉండకూడదు. ఎక్కువ బరువు ఉంటే.. తగ్గేందుకు క్రమం తప్పకుండా వ్యాయమం లాంటి శారీరక కార్యకలాపాలు చేస్తుండాలి. కండరాలను పెంచుకునేందు, జీవక్రియను మెరుగుపరుచుకునేందుకు వ్యాయామాలు ఉపయోగపడతాయి. బరువు తగ్గేందుకు సరిపడా డైట్ పాటించాలి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి

అధిక ఒత్తిడి వల్ల అప్పటికప్పుడు బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. దీర్ఘకాల ఒత్తిడి వల్ల హైపర్ టెన్షన్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఒత్తిడిని అధిగమించేందుకు రిలాక్సేషన్ టెక్నిక్‍లను పాటించాలి. డీప్ బ్రెత్ టేకింగ్ (గాఢంగా శ్వాసను పీల్చడం) ఎక్సర్‌సైజ్, మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి. పుస్తరాలు చదవడం, మ్యూజిక్ వినడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

ఆల్కహాల్, స్మోకింగ్ వద్దు

ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ ప్రమాదం పెరుగుతుంది. ఒకవేళ హైబ్లడ్ ప్రెజర్ ఉంటే.. వారు ఆల్కహాల్, స్మోకింగ్ మానేయడం మంచిది.

హై బ్లడ్ ప్రెజర్ సూచనలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ సూచించినట్టయితే, బీపీని కంట్రోల్‍లో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి.

WhatsApp channel

సంబంధిత కథనం