Wednesday Motivation : గమ్యానికి దారులెన్నో.. మర్చాల్సింది ఆలోచన అంతే
Wednesday Motivation : ఎంత ప్రయత్నించినా.. అనుకున్నది కావట్లేదు. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నా.. అనుకున్న ఫలితం రావట్లేదు. ఇలానే చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ అన్నిసార్లు ఒకే దారిలో ప్రయత్నించే బదులు.. ఇంకో దారిలో ప్రయత్నిస్తే.. ఇప్పటికే గెలుపు నీ ఇంటిలో ఉండేదేమో కదా.
గెలుపు కోసం.. ప్రయత్నించకపోవడం పెద్ద తప్పు. అలాగే.. ఓడిపోతున్నా.. అదే దారిలో మళ్లీ మళ్లీ ప్రయత్నించడం కూడా పెద్ద తప్పే. వందసార్లు ఒకే దారిలో విజయం కోసం బయలుదేరే బదులు.. ఒక్కసారి వేరే దారిలో ప్రయత్నించి చూడు. విజయం నీ సొంతం అవుతుందేమో. గెలుపునకు షార్ట్ కట్స్ ఉండవు.. కానీ వేరే దారి దొరకొచ్చు. అందుకే వందసార్లు ఒకేలా ప్రయత్నించడం కంటే.. ఒక్కసారి కాస్త.. ఆలోచించి.. ప్రయత్నించాలి. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే గెలుపు దగ్గరకు మీరు వెళ్లగలుగుతారు. ఓ చిన్న స్టోరీ చదివితే.. ఎలా ఉండాలో మీకు ఈజీగా అర్థమవుతుంది.
ఒక గ్రామంలో తెలివైన సన్యాసి ఉండేవాడు. అతను ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించగలడు. అందుకే ఆ ఊరిలోని ప్రజలు ఏ సమస్య వచ్చినా ఆయన వద్దకు వెళ్లి తమ సమస్య చెప్పుకుని పరిష్కరించుకుంటారు. ఆ గ్రామంలోని ప్రజలు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు సమీపంలోని మార్కెట్‌కు వెళ్లేవారు. మార్కెట్ కొంచెం దూరంలో ఉంది, చిన్న వీధుల గుండా వెళ్ళాలి. వారానికి ఒక రోజు జరుగుతుంది.
ఓ రోజు ఆ ఊరి ప్రజలంతా మార్కెట్ కోసం వెళ్లారు. తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలనుకున్నారు. అయితే ఓ వీధి దాటి మార్కెట్ కు వెళ్లాలి. కానీ వీధి చివరన ఓ పోకిరి గుర్రం ఉంది. దాని దగ్గరకు వెళ్తే తన్నేస్తుంది. నిత్యం అదే వీధి గుండా వెళ్తుండటంతో ప్రజలంతా అక్కడే నిల్చోని చూస్తున్నారు. ఆ వీధి దాటి మార్కెట్లోకి వెళ్లాల్సి ఉంటుంది.. గుర్రం ఎప్పుడు వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
ఇదే సమయంలో అటువైపుగా మెుదట చెప్పిన సన్యాసి వచ్చాడు. అతడిని చూసిన ప్రజలు వెంటనే దగ్గరకు వెళ్లారు. సాధువుకు జరిగిన విషయం అంతా చెప్పారు. ఓహో మార్కెట్లోకి వెళ్లాలంటే గుర్రం ఉందని భయపడుతున్నారా? అని.. సరే నాతో రండి.. అని వేరే వీధి నుంచి మార్కెట్లోకి తీసుకెళ్లాడు. చెప్పేందుకు ఇది చిన్న కథే. కానీ సరిగా ఆలోచిస్తే.. చాలా అర్థం ఉంటుంది.
మనం వెళ్లే దారిలో కూడా అడ్డంకులు వస్తాయి. అలా అని అక్కడే నిల్చోనీ చూడకూడదు. సన్యాసి చేసినట్టుగానే మరో దారిని ఎంచుకోవాలి. గమ్యం వైపు నడుస్తుంటే.. చాలా ముళ్లు ఉంటాయి. వాటిని దాటేందుకు దారులు కూడా ఉంటాయి. తెలివిగా ఆలోచించి.. దారులు వెతుకున్నవాడే విజయం సాధిస్తాడు.
కళ్లలో నీరు ఉప్పగా ఉన్నా.. కళ్లు కనే కలలు తియ్యగా ఉండాలి..
గుండెలో బరువు ఎంత ఉన్నా.. పెదవులలో చిరునవ్వు ఉండాలి..
చుట్టూ గాలి ఎలా ఉన్నా.. పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు రేపాలి..
పయణించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా.. మన అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి..!