Thursday Motivation : మందులతో ఆరోగ్యాన్ని కొనలేరు.. మీరే దానిని కాపాడుకోవాలి..-thursday motivation on health does not always come from medicine ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation : మందులతో ఆరోగ్యాన్ని కొనలేరు.. మీరే దానిని కాపాడుకోవాలి..

Thursday Motivation : మందులతో ఆరోగ్యాన్ని కొనలేరు.. మీరే దానిని కాపాడుకోవాలి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 10, 2022 06:35 AM IST

Thursday Motivation : మందులతో ఆరోగ్యాన్ని కొనుక్కోగలమని భావించడం మూర్ఖత్వమే. అదే నిజమైతే డబ్బున్న వాళ్లంతా.. బీపీ, షుగర్లతో బాధపడరు. ఆరోగ్యం అనేది నిజమైన సంపద. దానిని ఒక్కసారి కోల్పోతే.. తిరిగి తెచ్చుకోవడం అసంభవం. కాబట్టి.. మనుషులు, పదవులు, డబ్బులు, ఫేమ్ వంటి వాటి వెనుక పరుగెత్తకండి. ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : ప్రపంచాన్ని నడిపించేది డబ్బే. కానీ ఆ డబ్బు నిద్రని కొనలేదు. మీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. తరతరాలు తిన్నా తరగని డబ్బు మీ దగ్గరున్నా.. ఆరోగ్యం లేకుంటే.. మీరు దానిలో ఓ రూపాయి కూడా మీకు నచ్చిన దానికోసం ఖర్చుపెట్టలేరు. నచ్చిన ఫుడ్ తినలేరు. జీవితంలో మనం పోరాడాల్సిన సమస్యలు చాలానే ఉంటాయి. వాటిలో పడి మనం మన గురించి పట్టించుకోవడమే మానేస్తాము. కొంత దూరం వెళ్లాక ఏంటి అని వెనుక తిరిగి చూస్తే.. దేని వెంట పడుతూ.. దేనిని ఇగ్నోర్ చేశామో అర్థమవుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది.

డబ్బు ఈరోజు కాకుంటే రేపు సంపాదించవచ్చు. సుఖం ఈరోజు కాకుంటే రేపు పొందవచ్చు. పదవి ఈరోజు కాకుంటే రేపు దక్కుతుంది. ప్రేమ ఈరోజు కాకుంటే.. రేపు వేరే రూపంలో మనల్ని చేరుతుంది. ఇలా మనం సోయ తెలియకుండా పరుగెత్తే చాలా విషయాలకు రేపు అనే గ్యారెంటీ ఉంది కానీ.. ఆరోగ్యానికి మాత్రం రేపు అనే గ్యారెంటీ లేదు. ఈరోజు నువ్వు దానిపై శ్రద్ధ వహించకుంటే.. రేపు నీ ఆరోగ్యానికి, నీకు గ్యారెంటీ ఉండదు. సక్సెస్, డబ్బు, ప్రేమ, సుఖం, పదవి అనుభవించాలంటే.. మీ దగ్గర ఉండాల్సింది ఆరోగ్యం. వీటి కోసం ఎలాగో పరుగెడుతున్నారు కదా.. మీ ఆరోగ్యం కోసం కూడా శ్రద్ధ తీసుకుని పరుగెత్తండి. అదే మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్.

ఆరోగ్యం లేకుండా మీరు ఎంత సంపాదించినా.. ఎంత గొప్ప పదవి పొందినా.. ఎంతగా ఎదిగినా.. మీరు వేస్ట్. ఆరోగ్యాన్ని పట్టించుకోకుంటే.. దానిని మందుల్లోనే వెతుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల కాస్తైన మెరుగుపడవచ్చేమో కానీ.. పూర్తిగా కోలుకోలేము. ఇంతకీ ఆరోగ్యాన్ని ఎలా పొందాలో మీకు తెలుసా? ఆరోగ్యం అనేది వ్యాయామాల వల్లనో.. పరుగెత్తడం వల్లనో.. కసరత్తులు, యోగా చేయడం వల్లనో రాదు. మానసికంగా సంతోషంగా ఉంటే.. కొండంత బలంగా అనిపిస్తుంది. మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఉరుకుల, పరుగుల జీవితంలో కాస్త నవ్వుకోవాలి. ప్రేమను పొందాలి. ఇలాంటివే ఆరోగ్యానికి నిజమైన మందులు.

ఇంగ్లీషు మందుల్లో ఏముందబ్బా. ఈ నిజమైన మందులు మీ జీవితంలో ఉండేలా చూసుకోండి. ఆరోగ్యం మీకు దాసోహం అవుతుంది. కాస్త వ్యాయామం. నవ్వు. ప్రేమ. ప్రశాంతత. ఒత్తిడి లేని జీవితం. ఇవి మాత్రం చాలు. సాధించాలి అనుకున్నవాటి వెంట పరుగెత్తండి. కానీ ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని మాత్రం అస్సలు విస్మరించకండి. మీ ఆరోగ్యమే మీకు నిజమైన ఆస్తి. దేనినైనా సాధించాలన్నా ఆరోగ్యం ఉండాలి కాబట్టి. ముందు హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది. మిమ్మల్ని గెలిపిస్తుంది. మీ గెలుపును మీరు ఆస్వాదించేలా చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం