TB Symptoms : నాలుగు వారాలకు పైగా మీకు ఇలా జరుగుతుందా?-tb disease symptoms and treatment details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tb Symptoms : నాలుగు వారాలకు పైగా మీకు ఇలా జరుగుతుందా?

TB Symptoms : నాలుగు వారాలకు పైగా మీకు ఇలా జరుగుతుందా?

HT Telugu Desk HT Telugu
Mar 28, 2023 12:30 PM IST

Tuberculosis : క్షయ (ట్యూబర్క్యులోసిస్ - టీబీ)ప్రాణాంతకం కాగల అంటువ్యాధి. ఈ మహమ్మారిని నివారించి ఉపశమనం పొందే విధానాన్ని చాలా ఏళ్ల కిందే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువచ్చింది. డాక్టర్ల సూచనమేరకు నిర్ధిష్టకాలం పాటు మందులు వాడితే పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చు

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

చాలామందికి క్షయ వ్యాధిపై అవగాహన ఉండటం లేదు. దేశవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటి మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో మరణాలకు కారణం అవుతున్న అంటువ్యాధి ఇదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం మన దేశంలో ప్రతి నిమిషానికి ముగ్గురు.. సంవత్సరానికి మూడు లక్షల మంది ఈ జబ్బుతో చనిపోతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యం, ధూమపానంతో పాటు వ్యాధిని సరైన సమయంలో వ్యాధిని గుర్తించి, సరిగ్గా మందులు వాడకపోవడం ఈ సమస్యను అధికమించలేకపోవడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు విశ్లేషిస్తున్నారు.

చాలా మంది భావిస్తున్నట్లు కేవలం ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలోని ఏ భాగానికైనా ఈ క్షయ వ్యాధి రావచ్చు. ఎముకలు, లింపు గ్రంధులు, మెదడు పొరలు, మూత్ర పిండాలు, పేగు వ్యవస్థకూ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. అయితే ఈ జబ్బు ఎక్కువగా ఊపితిత్తులనె టార్గెట్ చేస్తుంది. “నాలుగు వారాలకు పైగా ఎడతెరిపి లేకుండా దగ్గు, విపరీతమైన దగ్గుతో పాటు కఫం మరియు రావడం, సాయంత్రం, రాత్రి వేళల్లో జ్వరం, ఒక్కసారిగా బరువు తగ్గడం, ఆకలి అసలు లేకపోవడం లక్షణాలుగా చెప్పవచ్చు.” అని హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్స్ కు చెందిన సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ డి.ఎస్.సౌజన్య చెప్పారు.

నిపుణులైన వైద్యుల సలహా మేరకు కొన్ని ప్రామాణికమైన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ సులువుతుంది. కఫం స్మిర్, చెస్ట్ ఎక్స్ రే, స్పుటం కల్చర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన న్యూక్లియర్ యాసిడ్ అమ్ప్లిఫికేషన్ టెస్ట్ ద్వారా కేవలం 100 నిమిషాల్లో సులువైన పద్ధతిలో ఈ వ్యాధిని గుర్తించవచ్చు. NAAT గా పిలిచే ఈ టెస్ట్ డీఎన్ఏ ఆధారంగా రూపొందించడం జరిగింది. క్షయను గుర్తించడంలో మూడు రెట్లు మెరుగైన ఫలితాలు అందిస్తుంది.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వయస్సు మీరిన వాళ్ళు, హెచ్ఐవి సోకిన వాళ్లు, పోషకాహారం లభించని వయోజనులకు క్షయ వ్యాధి సులభంగా సోకే ప్రమాదం ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో వ్యాధి సోకకుండా, సోకినా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంది. క్షయ రోగికి ఒకరికి వ్యాధి నయం కాకపోతే అతని ద్వారా 15 నుంచి 20 మందికి ఈ జబ్బు సోకే ప్రమాదం ఉంది. అతను దగ్గినపుదు గానీ తుమ్మినపుడు గనీ 40 వేల దాకా వ్యాధికారకసూక్ణక్రిములు వాతావరణంలో కలిసిపోయి, ఇతరులలో ప్రవేశించి మాటు వేసి ఉంటాయి.

రోగ నిరోధక శక్తి తగ్గినపుడు అవి విజృంభించి క్షయ వ్యాధి బయటపడుతుంది. ఈ కారణంగానేక్షయ రోగిని విడిగా గదిలో ఉంచి చికిత్సచేయిస్తూనే, దగ్గరుండి వ్యాధి నయం అయ్యే వరకు కనిపెడుతూ ఉండాలని డాక్టర్లు సూచిస్తుంటారు. క్షయ రోగి మందులు ఖచ్చితంగా వాడుతున్నడా చూసి వాడేందుకు ఒప్పించటం, ఈ చికిత్సలో భాగంగా వాడే మందుల వల్ల వచ్చే చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్సను తట్టుకునే విధంగా వారికి పోషకాహారాన్ని అందించటం అవసరం. “పూర్తిగా తగ్గకమునుపే మందులు మానివేయటం లేదా అడపాదడపా మందులు వేసుకుకొంటూ ఉండటం వల్ల టి.బి.కారక బాక్టీరియా మందులను తట్టుకోగల శక్తిని పెంచుకుంటుంది. దాంతో రోగిలో వ్యాధి ముదిరి మందులకు లొంగనిదిగా తయారవుతుంది. ఇటువంటి రోగుల నుంచి డ్రగ్ రెసిస్టెంట్ టి.బి. వ్యాపిస్తుంటుంది.” అని డాక్టర్ హెచ్చరించారు.

ప్రస్తుతం దేశంలో క్షయ వ్యాధిసోకిన వారినలో దాదాపు పదిశాతం మంది ఈ విధంగా మందులకు లొంగని టి.బి.తోనే బాధపడుతున్నారు. అందువల్ల క్షయవ్యాధి గ్రస్థులు అందరూ చికిత్స పొందటం, పూర్తిగా తగ్గేవరకు మందులు వాడటం పైననే రానున్న రోజుల్లో మనదేశం ఈ వ్యాధిపై పైచేయిసాధించగల అవకాశాలను నిర్ణయిస్తుంది.

డాక్టర్ సౌజన్య
డాక్టర్ సౌజన్య
WhatsApp channel

సంబంధిత కథనం