Saturday Motivation : భయపడటంలోనే పడిపోవటం ఉంది.. భయం నుంచి బయటపడు
Saturday motivation : భయపడటంలోనే పడిపోవటం ఉంది. జీవితంలో ఏం అవుద్దో.. చేసేది కరెక్టేనా ఇలాంటి భయాలు చాలా మందికి ఉంటాయి. అయితే వాళ్లు అక్కడే ఉండిపోతారు. భయంతోనే జీవితం నడిపిస్తారు. కావాలనుకున్నది దక్కదు.
భయపడటంలోనే పడటం ఉంది బాబాయ్.. ఇది ఓ సినిమాలో డైలాగ్. కానీ ఇది నిజం. ఏ విషయంలోనైనా.. భయం మెుదలైతే.. మీ పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది. అందుకే భయం వీడి ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరికి ఉంటుంది.. కానీ భయం నుంచి బయటపడేవాడే.. వీరుడు. లేదంటే మీరు వీక్‌గా అయిపోతారు. భయమే బలం కావాలి. అప్పుడు విజయం మీ సొంతం అవుతుంది. కానీ అది మీ బలహీనత అయితేనే సమస్యలు ప్రారంభమవుతాయి.
అందరికీ భయం ఒకేలా ఉండదు. కొందరు ఓడిపోతామనే భయంతో లేదా ప్రేమించిన వారిని కోల్పోతామనే భయంతో వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. అయితే వాటిని దక్కించుకునేందుకు వారి భయాన్నే బలంగా మార్చుకుంటారు. దానికోసం తగినంత ప్రాక్టీస్ చేస్తారు. అది వారు గెలిచేందుకు మార్గంగా సహాయం చేస్తుంది.
అయితే మరికొంతమంది భయం వేరేలా ఉంటుంది. అనుకున్నది జరగదేమో.. ఏం చేస్తే ఏమవుతుందోననే ఆలోచనల్లో ఉంటారు. ఇతరులను కోల్పోతామని లేదా కోరుకున్నది దక్కదేమో అనే భయం మీకు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ భయం మిమ్మల్ని, మీ పరిస్థితిని మరింత ఘోరంగా తయారు చేస్తుంది. మీ భయం మిమ్మల్ని, మీ పరిస్థితులను చిన్నాభిన్నం చేస్తుంది. ఆ సమయంలోనే మీరు తెలియకుండా ఎక్కువ తప్పులు చేసే అవకాశముంది. మీరు చేసిన తప్పులు మీ భయాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.
ఒక్కోసారి మీరు కావాల్సినవి కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. తగినంత జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఏదైనా చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ఉండాలి. పొరపాటున ఏది చేసినా.. దాని గురించి నిరంతరం బాధపడాలి.
భయం అందరిలో ఉంటుంది.. కానీ దాని నుంచి బయటపడినవారికే సక్సెస్ దక్కుతుంది. భయం అనేది బలహీనత కాదు.. మీ ఆయుధం కావాలి. మనుషులకుండే ఎమోషన్స్‌లో అది కూడా ఒకటి. కొందరికి నీరంటే భయముంటుంది. కానీ మీకు ఉండకపోవచ్చు. కాబట్టి మీకు కొన్ని విషయాలపట్ల లేదా కొందరు వ్యక్తుల పట్ల భయం ఉండొచ్చు. మీరు భయపడేవాటికి అందరూ భయపడాలి అని రూల్ లేదు. ఇతరులు భయపడే వాటిపట్ల మీకు భయం ఉంటుందని గ్యారెంటీ లేదు. మీకు భయం ఉంటే.. మీరే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని అర్థం. ఆలోచనలను అదుపులో పెట్టుకుంటే భయం కూడా మీ దగ్గరికి రాదు. ఓవర్ థింక్ చేయడం మానుకోండి. మీకు ఏదంటే భయముందో దానిని ఓసారి ఎదుర్కోండి. అప్పుడు మీకు దానిలోని ప్లస్, మైనస్‌లు అర్థమవుతాయి. ఇంకోసారి.. అలాంటి పరిస్థితి ఎదురైనా.. మీరు ధైర్యంగా ఉంటారు.
ఈ సమాజంలో నేను ఒక్కడినే ఏం చేయగలనని ప్రతీ మనిషి భయపడిపోతున్నాడు.. కానీ ఒక్కసారి తలెత్తి చూడు... ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే..!