Royal Enfield Himalayan 450 । దూసుకొస్తున్న కొత్త బైక్.. ఈసారి మరింత పవర్‌‌ఫుల్!-royal enfield himalayan 450 is all set to launch soon teaser out check details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Royal Enfield Himalayan 450 । దూసుకొస్తున్న కొత్త బైక్.. ఈసారి మరింత పవర్‌‌ఫుల్!

Royal Enfield Himalayan 450 । దూసుకొస్తున్న కొత్త బైక్.. ఈసారి మరింత పవర్‌‌ఫుల్!

HT Telugu Desk HT Telugu
Aug 24, 2022 08:58 PM IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ వరుస బైక్ మోడళ్ల విడుదలతో దూకుడు మీద ఉంది. ఇటీవలే హంటర్ 350 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇప్పుడు హిమాలయన్ 450ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ బైక్ విశేషాలు..

Royal Enfield Himalayan 450
Royal Enfield Himalayan 450

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ బ్రాండ్ నుంచి ప్రసిద్ధ అడ్వెంచర్ టూరర్ అయిన హిమాలయన్ బైక్ అప్‌డేట్ వెర్షన్‌ను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సరికొత్త మోటార్ సైకిల్ హిమాలయన్ 450 (Royal Enfield Himalayan 450) గా త్వరలో లాంచ్ కాబోతుంది. ఈ బైక్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ ఒక చిన్న టీజర్ వీడియోను కంపెనీ పోస్ట్ చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) సిద్ధార్థ్ లాల్ తన వ్యక్తిగత Instagram ఖాతాలో రాబోయే హిమాలయన్ 450 బైక్‌కు సంబంధించి స్నీక్ పీక్ టీజర్‌ను షేర్ చేశారు. అయితే అందులో కేవలం బైక్ ముందుభాగంలో LED హెడ్‌లైట్‌ మాత్రమే కనిపించింది.

కానీ.. ఈ బైక్ టెస్టింగ్ మోడల్ ఇది వరకే బహిర్గతం అయింది, ప్రామాణిక హిమాలయన్ బైక్‌తో పోల్చితే కొత్త హిమాలయన్ 450 బైక్‌లో హెడ్‌ల్యాంప్ కౌల్, విండ్‌షీల్డ్, ఫ్రంట్ బీక్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్‌లలో మార్పులు ఉన్నాయి.

Royal Enfield Himalayan 450 ఎలా ఉండవచ్చు?

హిమాలయన్ 450 నూతనమైన K1 ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇందులో సీట్ పొజిషనింగ్‌ ఇంకాస్త అధికంగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న హిమాలయన్ మోడల్స్ కంటే మెరుగైన ఆఫ్-రోడింగ్ అనుభవాన్ని అందించగలదని భావిస్తున్నారు. కొత్త మోటార్‌సైకిల్ ముందుభాగంలో తలక్రిందులుగా ఉండే కయాబా ఫ్రంట్ ఫోర్క్‌లు, వెనుక భాగంలో మోనో-షాక్‌ను కలిగి ఉంటుంది.

కొత్త హిమాలయన్ బైక్‌లో 450cc సామర్థ్యం కలిగిన లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉండనుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్సుతో అనుసంధానమై వస్తుంది. ఈ కొత్త ఇంజన్ 40 బిహెచ్‌పి పవర్, 40 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందించగల సామర్థ్యాలతో రావచ్చని భావిస్తున్నారు.

హిమాలయన్ బైక్ ఇండియాలో BMW G310GS, Hero Xpulse 300 అలాగే KTM 390 అడ్వెంచర్‌ బైక్ లతో పోటీపడుతుంది.

అయితే పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఎంత అనేది ఈ బైక్ అధికారికంగా విడుదలైతే కానీ చెప్పలేం. అయితే ఇప్పుడున్న మోడల్ కంటే ధర ఎక్కువగానే ఉండబోతుంది. నివేదికల ప్రకారం, హిమాలయన్ 450 ఈ ఏడాది నవంబర్‌లో EICMA 2022లో పరిచయం కావచ్చు, అయితే దాని లాంచ్ 2023 ప్రారంభంలో జరుగుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఇటీవలే భారత్‌లో ఎంతగానో ఎదురుచూసిన హంటర్ 350 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇది మెట్రో, రెట్రో అనే రెండు వేరియంట్లలో రూ.1.50 లక్షల ప్రారంభ ధరతో ఆగస్టు 7న విడుదల అయింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్