Lunar Eclipse 2022- Chandra Grahanam: నవంబర్ 8, మంగళవారం నాడు సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో సమలేఖనం అవుతున్నాయి. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వస్తుంది. సూర్యుని కాంతి నేరుగా చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఈ సందర్భంలో భూమిపై నుంచి చూస్తే చంద్రుడు కనిపించడు, లేదా పాక్షికంగా మాత్రమే కనిపిస్తాడు. దీనినే మనం చంద్రగ్రహణం అని పిలుస్తాము. ఇదే సమయంలో భూమిపై సూర్యోదయం, సూర్యాస్తమయాల కారణంగా భూమిపై నుంచి ఏటవాలుగా ప్రసరించే కాంతికిరణాలు చంద్రుడి రంగును మారుస్తాయి. ఎరుపు లేదా ముదురు గోధుమ రంగులో చంద్రుడు కనిపిస్తాడు. అందుకే దీనిని Blood Moon అని పేరుతో కూడా పిలుస్తారు.
ఈ రకమైన ఖగోళ మార్పులు, గ్రహాల కదలిక, మరేతర ఖగోళ పరిణామాలు భూమిపై ఉండే జీవుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే నమ్మకం ఉంది. ఈ కారణంగా, గ్రహణాలు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
గ్రహణాలు ఖగోళంలో సంభవించే సహజమైన దృగ్విషయం అయినప్పటికీ, ఇది ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై గ్రహణ (సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రెండూ) ప్రభావం చెడుగా ఉంటుందని బలంగా విశ్వసిస్తారు.
మనుషులపై గ్రహణాల ప్రభావానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, ఈ నమ్మకాలు మన పురాణాలు, ఆచార సంప్రదాయాల కారణంగా మనలో బలంగా నాటుకుపోయాయి. కాబట్టి, చెడు జరుగుతుందన్నప్పుడు వాటిని విస్మరించే బదులు ఆ సమయంలో జాగ్రత్తలు పాటిస్తే పోయేదేముందని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా గ్రహణం సమయంలో మహిళలు తమ ఇళ్ల నుండి బయటకు రాకూడదు. ఎందుకంటే ఇది వారి పుట్టబోయే బిడ్డకు హాని కలిగించవచ్చు, అకాల ప్రసవానికి దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో మన నమ్మకాల ప్రకారం, చంద్ర గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పనులు చేయాలి, ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకోండి.
భారతదేశంలో చంద్ర గ్రహణం 2022 సమయాలు ప్రాంతాల వారిగా ఈ లింక్ క్లిక్ చేసి చూడండి. అయితే దృక్ పంచాంగం ప్రకారం, చంద్ర గ్రహణ సూతక కాలం ఉదయం 9:21 గంటలకు ప్రారంభమయి, సాయంత్రం 6:19 గంటలకు ముగుస్తుంది.
తెలుగు పంచాంగం ప్రకారం.. కార్తీక మాసంలో, 08/11/2022 మంగళవారం నాడు పౌర్ణమి తిథి, భరణి నక్షత్రం రోజున మేష రాశిలో చంద్ర గ్రహణం 2022 ఏర్పడుతుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం 02:39 నిమిషాలకు ప్రారంభమై, సాయంత్రం 06:19 నిమిషాలకు విడుస్తుంది. గ్రహణం మొత్తం కాల సమయము 3 గంటల 40 నిమిషాలుగా ఉంది.
సూతక సమయం మధ్యాహ్నం 2:48 గంటల నుంచి పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లకూడదు. సూతకం, గ్రహణం సమయంలో అన్ని రకాల ఆహార పదార్థాలు ఘన లేదా ద్రవం తీసుకోవడం నిషేధం. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం ఆచరించాలి.
పైన పేర్కొన్న సూచనలకు, గ్రహణ ప్రభావాలు నిరూపించటానికి ఎలాంటి ఆధారాల్లేవు. అయితే ఇది మీ నమ్మకం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉంటుంది. మీ ఆరోగ్యం, గర్భిణీలు వారి ఆరోగ్యంతో పాటు వారికి పుట్టబోయే బిడ్డ శ్రేయస్సుకు సంబంధించిన కోణంలో ఆలోచిస్తే ఇక్కడ పేర్కొన్న సూచనలను పాటించండి.
సంబంధిత కథనం