Lunar Eclipse- Chandra Grahanam 2022: నవంబర్ 8న, మంగళవారం నాడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ ఏడాది ఇది చివరి, సంపూర్ణ చంద్ర గ్రహణం. మళ్లీ మూడేళ్ల తర్వాత 2025లో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే చాలా అరుదుగా సంభవించే గ్రహణాలు ఈసారి మనం చూస్తున్నాం. మొన్న దీపావళి నాడు సూర్యగ్రహణం ఏర్పడగా, కేవలం 15 రోజుల వ్యవధిలో మరొకటి, చంద్రగ్రహణం సంభవిస్తుంది. అది కూడా కార్తీక పౌర్ణమి నాడే చంద్రగ్రహణం సంభవించడం గమనార్హం.
నిండు పౌర్ణమి నాడు పూర్తి రూపంతో, వెన్నెల వెలుగులతో కనిపించాల్సిన చంద్రుడు, కనిపించకుండా అదృశ్యం అవుతున్నాడు. మరి ఇదేమైనా కీడును సూచిస్తుందా? పంచాంగకర్తలు, ఆధ్యాత్మికవేత్తలు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం ఈ సృష్టి యందు గ్రహణములు ఏర్పడటం సాధారణమైన విషయము. ఆధ్యాత్మిక వేత్తలకు, మోక్ష సాధకులకు, పుణ్యార్చన చేయు వారికి గ్రహణం ఒక అద్భుతమైన అవకాశం. గ్రహణం కీడు అని భావించే వారికి ఆధ్యాత్మకవేత్తలు వివరణ ఇస్తున్నారు. గ్రహణం వల్ల ఆధ్యాత్మిక లాభాలు అధికమని, గ్రహణం ఎంతమాత్రం కీడు కాదు అని ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు పితృ కారకుడని (తండ్రి అని) చంద్రుడు మాన:కారకుడు (తల్లి అని) తెలుపబడమైనది. ఇలాంటి తల్లిదండ్రులు అయినటువంటి సూర్యచంద్రులకు రాహు- కేతు స్పర్శచే గ్రహణం ఏర్పడటం జరుగుతుంది. అందువలన ఇది సూతకముగా భావించడమైనది. ఆ సూతకం ప్రభావంచేత గ్రహణ సమయాలలో సూతక నియమాలు అనగా శుచి, శుభ్రత, స్నానదానాలు, తర్పణాలు, ఆహార నియమాలు పాటించటం వంటివి చేయాలి.
చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ పంచాంగ గణితం ఆధారంగా 8-11-2022 నాడు, అనగా శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, కార్తీక మాసం, పౌర్ణమి తిథి, భరణి నక్షత్రం రోజున రాహు గ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
ఈ గ్రహణం మధ్యాహ్నం 2.39 ని.లకు (స్పర్శ కాలము) ప్రారంభం అవుతుంది. మధ్య కాలము 4.29 ని.లు. మోక్షకాలము 6.19 ని.లుగా ఉన్నవి. గ్రహణం మొత్తం కాల సమయము 3.40 ని.లు ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ప్రభావం చేత 8వ తారీఖు 11 గంటల లోపు భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళీ రాత్రి 8.30 తరువాత భోజనాది కార్యక్రమాలు చేసుకోవచ్చని ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ చంద్రగ్రహణం భరణి నక్షత్రం మేష రాశిలో ఏర్పడటం చేత మేషరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. కుంభ, వృశ్చిక, కర్కాటక, మిథున రాశి వారికి ఈ చంద్ర గ్రహణం వలన శుభ ఫలితాలు కలుగబోతున్నాయి. మీన, ధను, తుల, సింహరాశి వారికి మధ్యస్త ఫలితములు. మేష, మకర, కన్య, వృషభ రాశుల వారికి అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ఇందు వలన గ్రహణ శాంతులు జరుపుకోవాలి. దానధర్మాలు చేసుకోవాలి. శుభం!
సంబంధిత కథనం