Ganesh Immersion 2022 : దేవుడు కమర్షియల్ అవుతున్నాడో.. లేక భక్తులే దేవుడిని కమర్షియల్ చేస్తున్నారో తెలియదు కానీ.. ఇప్పుడు పండుగ వాతావరణాలన్నీ కమర్షియల్‌గానే ఉంటున్నాయి. వినాయకచవితి మట్టి గణపతిని పూజించటం మంచిది అంటారు. ఎందుకంటే వాటి వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు కాబట్టి. పైగా మట్టి గణపతులును నీటిలో నిమజ్జనం చేస్తాము కాబట్టి.. దాని వల్ల నీటికాలుష్యం జరగకుండా ఉంటుంది కాబట్టి.,దీని వెనుక మరో కారణం కూడా ఉంది. పూజా సమయంలో గణపతికి చేసే షోడశోపచార పూజలో.. మాటిమాటికీ మట్టి విగ్రహాన్ని, ఆకులను తాకుతాము. దానివల్ల వాటిలోని ఔషది తత్వం మనకి చేరుతుంది. అంతేకాకుండా చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధి గుణాలు చేరుతాయి. పైగా వినాయక చవితి సమయానికి వర్షాలు ఊపందుకుంటాయి. వాగులూ, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తాయి. అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేస్తే.. వరదపోటు తగ్గే అవకాశముంటుంది. ఇలా భావించి మట్టి విగ్రహాలను పూజలో పెట్టే ఆనవాయితీ వచ్చింది. ,అయితే ఇప్పుడు ఈ ఆనవాయితీకి చిల్లుపడిందనే చెప్పాలి. పక్కవీధిలో 20 అడుగుల విగ్రహం పెడితే మనం 21 అడుగుల విగ్రహాన్ని పెట్టాలి అనే స్థాయికి పోటీ ఉంటుంది. పూజ ఎంత బ్రహ్మాండగా చేస్తున్నారు అనేది పక్కన పెట్టి విగ్రహాల పొడవులను బట్టి కీర్తి గడించేందుకు చూస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పర్యావరణానికి ఎంత కీడు జరుగుతుందో అందరికీ తెలిసిందే. ,పైగా నిమజ్జనంకి వెళ్లేవారిలో అందరూ కాదు.. కొందరు మద్యం సేవించి దేవుని ముందు ఎగురుతారు. దేవుడిని భక్తితో సాగనంపండిరా అంటే.. మద్యంతో సాగనంపి ఆ వినాయకుడిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడుకుంటే.. కచ్చితంగా మరో విషయం గురించి మాట్లాడుకోవాల్సిందే. అదేనండి వినాయకుని మండపాల్లో, వినాయకుని నిమజ్జనానికి తీసుకువెళ్లే సమయంలో వేసే భక్తిరస.. సారీ సారీ రక్తిరస పాటల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే వినాయకుని ముందు ఒకటా రెండా.. ఎన్ని ఐటమ్ సాంగ్స్ వేయాలో అన్నిఐటమ్ సాంగ్స్ వేసేస్తున్నారు. అది మండపమా? లేక ఇంకేదైనానా అనే డౌట్ మనకే వచ్చేస్తుంది. పాపం అక్కడే కుర్చొని వారు వేసే పాటలు వింటున్న వినాయకుడు ఎంత ఫీల్ అవుతూ ఉండి ఉంటాడో. మాట్లాడగలిగి ఉంటే.. అరే బాబు నా దగ్గర పాటలు వేయకపోయినా పర్లేదు కానీ.. వాటిని ఆపేయండిరా అనేవాడు. ,ఇంకొందరు తమ అపార్ట్మెంట్లో అందరూ ఆదివారం ఖాళీగా ఉంటారు కాబట్టి అప్పుడు నిమజ్జనం చేద్దాం అనుకుని చర్చించుకుంటారు. నిమజ్జనం చేయాల్సిన రోజులు కూడా వారికి అనువుగా మార్చేసుకుంటున్నారు. ప్రసాదాలతో కడుపు నింపుకోవాల్సిన వినాయకుడు.. ఇలాంటి సంఘటనలతో తన కడుపుని మాడ్చుకుని వెళ్లిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటివి చూసి తను ఆ ప్రసాదాలను ఎలా ఆరగించగలడు చెప్పండి. ,సరేలా గణపయ్య.. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుని ఏమి ఫీల్ అవ్వకు. నెక్స్ట్ టైమ్ నువ్వు వచ్చేసరికైనా.. మా భక్తుల ధోరణి మారేలా నువ్వే ఏదైనా చేసేయ్.,